మంత్రి వివేకా రాజీనామా ఆమోదం
posted on Apr 16, 2011 @ 9:37AM
హైదరాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ప్రజల నుంచి వచ్చే అధికారమే తనకు కావాలని, నామినేటెడ్ అధికారం వద్దంటూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అధిష్ఠానం పెద్దలు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలు వివేకానంద రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినా ఫలించలేదు. మంత్రి పదవికి వైఎస్ వివేకానందరెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. తన రాజీనామా ఆమోదిస్తే తప్ప పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసేది లేదని వివేకానందరెడ్డి పలుమార్లు సీఎంకు స్పష్టం చేశారు. శనివారం ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. ఈలోగా తన రాజీనామాను ఆమోదించాల్సిందేనని వివేకా పట్టుబట్టారు. అధిష్ఠానం సూచన మేరకు వివేకాను ఒప్పించేందుకు చివరి వరకూ ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఒకరోజు ముందుగా వివేకా మంత్రి పదవి రాజీనామాను అమోదించాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు సీఎం సిఫారసు చేశారు. దీనితో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వివేకా నామినేషన్ దాఖలు చేయడంపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి.