సద్భావన యాత్రలో లగడపాటి వీరంగం
posted on Apr 15, 2011 @ 1:28PM
విజయవాడ: విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ శుక్రవారం సద్భావన యాత్రలో వీరంగం సృష్టించారు. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జువరం సద్భావన యాత్రలోభాగంగా లగడపాటి మాట్లాడుతున్న సమయంలో జానీ అనే వ్యక్తి స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాడు. దాంతో ఆగ్రహం చెందిన లగడపాటి ఆ వ్యక్తిని గాడిద అంటూ నెట్టేశారు. ఎంపీ దురుసు ప్రవర్తనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు నేతలు లగడపాటి రాజగోపాల్ స్పీచ్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. జగన్‌కు మద్దతు పలకాల్సిందిగా డిమాండ్ చేశారు. గొడవ సద్దుమణిగిన అనంతరం ఆయన తన స్పీచ్ కొనసాగించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలకు అంతగా ప్రాధాన్యం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీల బలం ఈ ఎన్నికలలో తెలియవని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే ఆయా పార్టీల బలం తెలుస్తుందని చెప్పారు. ఇప్పుడు పార్టీని వీడిన వారు 2014లో తప్పకుండా కాంగ్రెసు పార్టీలోకి వస్తారని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.