బాబా ఆరోగ్యంపై తాజా బులెటిన్
posted on Apr 16, 2011 @ 10:03AM
పుట్టపర్తి: సత్య సాయిబాబా ఆరోగ్యపరిస్థితి మేరుగుపడినా ఇంకా ఆందోళనకరంగానే ఉందని డా. సఫాయా పేర్కొన్నారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు ఈరోజు ఉదయం బాబా ఆరోగ్యపరిస్థితిపై తాజా నివేదిక వెలువరించారు. మూత్రపిండాలకు సీఆర్ఆర్ థెరపీ కొనసాగిస్తున్నామని, వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నామని డా. సఫాయా పేర్కొన్నారు.
కాగా, సత్యసాయి బాబా తన సహాయకుల చేతిలోనే బందీ అయిపోయాడంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనంపై రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేగింది. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. వెంటనే డాక్టర్లు రవిరాజ్, నాగేశ్వరరావుతో అత్యవసరంగా భేటీ అయ్యారు. బాబా ఆరోగ్యం ఇంకా ఎన్నాళ్లకు కుదుట పడుతుంది, ఏమయింది అనే విషయంపై వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది. కాగా సత్యసాయి బాబాను చూపించకుండా డాక్టర్లు కేవలం ఉదయం, సాయంత్రం పూటలలో హెల్త్ బులెటిన్ మాత్రమే విడుదల చేయడంపై అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ మండి పడింది. బాబాను వెంటనే చూపించాలంటూ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం వద్ద ఆందోళనకు దిగింది. లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది. పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు.