డీఎల్, బొత్సలకు చేదు అనుభవం
posted on Apr 19, 2011 @ 2:36PM
కడప : ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలకు మంగళవారం చేదు అనుభవం ఎదురు అయ్యింది. పెద్దపులుసులలో డీఎల్‌ను 104 సిబ్బంది నిలదీశారు. తమకు జీతాలు రావటంలేదని, మందులు లేవని రోగులు నిరసన తెలుపుతున్నారంటూ ఆయన్ని ప్రశ్నించారు. అయితే వారికి సమాధానం చెప్పకుండానే డీఎల్ వెళ్లిపోయారు. కాగా నెమళ్లదిన్నెలో డీఎల్ ప్రచారం రసాభాసాగా మారింది. ఆయన్ని చూడగానే గ్రామస్తులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. తమ గ్రామానికి ప్రచారానికి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. గ్రామస్తుల నిరసనలతో డీఎల్ ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు. డీఎల్ కాన్వాయ్‌లో పరిమితికి మించి వాహానాలు ఉండటంతో అధికారులు నాలుగు వాహనాలను సీజ్ చేశారు. దీంతో తన వాహనాలనే సీజ్ చేస్తారా అంటూ డీఎల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల ప్రచారానికి వచ్చిన బొత్స సత్యనారాయణను కొండాపురంలో గండికోట ప్రాజెక్టు నిర్వాసితులు అడ్డుకున్నారు. తమకు పరిహారం ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించారు.