రాజశేఖర్ రెడ్డి అవినీతికి వారసుడు జగన్
posted on Apr 19, 2011 @ 2:23PM
కడప: కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం కోసం రాష్ట్రానికి చెందిన 15 మంది మంత్రులు ఆంబోతుల్లా తిరుగుతున్నారని ఆ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న సీనియర్ నేత ఎం.వి.మైసూరా రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి అవినీతికి వారసుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం ఉద్యమాలు సాగించి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిని తానని చెప్పుకున్నారు. తాను వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో కొనసాగలేదని ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాల కోసం నిత్యం ప్రజలతో బంధాలు కొనసాగిస్తున్నానన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు రాజ్యసభలో ఉన్న ప్రజా సమస్య పైనే దృష్టి సారించినట్లు తెలిపారు. రాజకీయాల్లో ఉంటూ కోట్లు కూడపెట్టలేదని దీనిని వ్యాపారపరంగా చూడలేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పార్టీలు అవినీతి పార్టీలేనన్నారు. ఈ రెండు ఒకే పుట్టలో నుంచి వచ్చిన పెద్ద చిన్న పాములేనన్నారు. ఐదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్.రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశ ఖజానాను దోచుకున్నారన్నారు. జలయజ్ఞం పేరుతో వేలాది కోట్ల రూపాయలు దోచుకొని ధన యజ్ఞంగా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సెజ్‌ల పేరుతో ఉన్న భూములన్నింటిని పెద్దపెద్ద కంపెనీలకు కట్టబెట్టి రైతుల నోరు కొట్టారని తీవ్ర స్థాయిలో మైసూరా రెడ్డి ధ్వజమెత్తారు.