జగన్ అఫిడవిట్ తప్పుల తడక: టీడీపీ
posted on Apr 20, 2011 9:17AM
హైదరాబాద్: కడప పార్లమెంటు నియోజకవర్గానికి వైఎస్సార్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి సమర్పించిన అఫడవిట్ తప్పుల తడకగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆస్తుల వివరాలన్నీ దాచిపెట్టి సమర్పించిన జగన్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టిడిఎల్పీ డిప్యూటీ లీడర్ మోత్కుపల్లి నర్శింహులు, ప్రధాన కార్యదర్శి పి. చంద్రశేఖర్‌లు కమిషన్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు హైదరాబాద్, బెంగుళూర్, కడప, పులివెందుల తదితర ప్రాంతాలలో కోట్లాది రూపాయల విలువ చేసే ఖరీదైన స్థిరాస్తులున్నాయని పేర్కొన్నారు. గత ఎన్నికల సందర్భంగా జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 600 ఎకరాల భూమి ఉన్నట్టు అఫడవిట్‌లో పేర్కొన్నారని, తాజా అఫడవిట్‌లో ఈ భూమిని ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. జగన్ ఆస్తుల ఆధారాలను సమర్పిస్తామని, దీనికి జగన్ ప్రస్తుతం సమర్పించిన అఫడవిట్‌కు తేడా పరిశీలించేందుకు దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.