టీడీపీలో వారసత్వ పోరు లేదన్న బాలయ్య
posted on Apr 20, 2011 @ 10:35AM
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 62వ ఏట అడుగుపెట్టారు. ప్రముఖ నందమూరి హీరో బాలకృష్ణ తన వియ్యంకుడు చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబును సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో దర్శకరత్న దాసరి తదితరులు ఉన్నారు. మరోవైపు తెదేపా చీఫ్ చంద్రబాబు 62వ జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి.
తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు లేదని నందమూరి హీరో, యువరత్న బాలకృష్ణ అన్నారు. నందమూరి-నారా కుటుంబాల మధ్య ఎటువంటి వారసత్వ పోరు లేదని, అదంతా మీడియా సృష్టేనని బాలకృష్ణ కొట్టిపారేశారు. బావ, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. తమ రెండు కుటుంబాల మధ్య వారసత్వ పోరు మీడియా సృష్టేనని తోసిపుచ్చారు. మీడియా సృష్టించిన ఈ వారసత్వ పోరును మీడియానే పరిష్కరించాలని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబమంతా కలిసే ఉందని బాలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.