ప్రభుత్వానికి ప్రణాళికా సంఘం అక్షింతలు
posted on Apr 20, 2011 @ 9:33AM
న్యూఢిల్లీ: వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం అమలు జరుగుతున్న తీరుపై ప్రణాళికా సంఘం తీవ్ర అసంతృప్తివ్యక్తం చేసింది. ఖర్చుకు తగ్గ ఆదాయం లభించడం లేదు కనుక ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవలసిందిగా ప్రణాళికా సంఘం స్పష్టం చేసింది. గత ఆరు సంవత్సరాలలో వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు లభించలేదని ప్రణాళికా సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్ గుప్తాచెప్పారు. రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఖరారు చేయటానికి పూర్వరంగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు ప్రణాళికా సంఘం సభ్యులతో చర్చలు జరిపారు. చర్చలు ముగిసిన తరువాత అభిజిత్ సేన్ మీడియాతో మాట్లాడారు. జలయజ్ఞంలో మార్పులు చేయటంతోపాటు ఉచిత విద్యుత్ పథకం అమలులో మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. వేలాది కోట్ల రూపాయలను ఖర్చుపెట్టిన తరువాత జలయజ్ఞాన్ని అర్ధంతరంగా ఆపివేయటం సాధ్యపడదని చెబుతూ భూగర్భ జలాల మట్టాన్ని పెంచటంతో పాటు నీటి పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రప్రభుత్వంపై విపరీతమైన భారం మోపుతున్నందున పథకం అమలులో ప్రయివేట్ భాగస్వాములకు వీలు కల్పించవలసిందిగా ప్రణాళికా సంఘం సూచించింది. ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న అన్ని పథకాలను ఒక గొడుగు కిందికి తీసుకురావలసిందిగా ప్రణాళికాసంఘం సూచించిందని అధికార ప్రతినిధి తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈదిశలో ఇప్పటికే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేస్తున్నట్లు ఆప్రతినిధి తెలియచేశారు.