బాబా సహాయకుడికి ప్రాణహాని

హైదరాబాద్: పుట్టపర్తి సత్య సాయిబాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ ప్రాణాలకు ముప్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వ నిఘా విభాగం హెచ్చరించింది. సత్య సాయిబాబా వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ అయ్యర్ ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంత కాలం పాటు ప్రజలకు ఎక్కువగా కనిపించవద్దని వారిద్దరికి నిఘా విభాగం సూచించింది. బాబాకు సన్నిహితంగా ఉన్న కొంత మందిని హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. ఈ స్థితిలో సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులకు ప్రభుత్వం భద్రతను పెంచింది. కాగా, సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు సత్యజిత్ నేతృత్వం పట్లనే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబా మెడికల్ రికార్డులను సక్రమంగా నిర్వహించలేదని భక్తులు కొంత మంది అయ్యర్‌పై విమర్శలు చేస్తున్నారు. బాబా అస్పత్రిలో ఉన్నప్పుడు అయ్యర్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ఈ విషయాలను ప్రశాంతి నిలయం వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కాంగ్రెస్ నుంచి కల్మాడీ సస్పెన్షన్

న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి జరిగిన అవినీతి కేసులో సురేష్ కల్మాడీని సిబిఐ అరెస్టు చేయడంతో ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సిబిఐ అధికారులు సోమవారం సురేష్ కల్మాడీని మొదట విచారించి ఆ తరువాత వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కల్మాడీపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన పలు సాక్ష్యాలు లభించటంతో సిబిఐ ఆయనను అరెస్టు చేసింది. కాగా కల్మాడీ అరెస్టు వల్ల తమకు చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. కాంగ్రెస్ ఎప్పుడూ అవినీతిపరులను సమర్థించలేదని పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ చెప్పుకొచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 2జి స్పెక్ట్రం కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, ఆదర్శ్ గృహ నిర్మాణం కుంభకోణాలకు బాధ్యులైన వారందరిపై తమ పార్టీ కఠిన చర్యలు తీసుకుందని అన్నారు. బిజెపి ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తివారీ ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అవినీతికి పాల్పడినా బిజెపి అధినాయకత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. బంగారు లక్ష్మణపై కనీసం ఎఫ్‌ఐఆర్ దాఖలుకాలేదని గుర్తుచేశారు. సురేష్ కల్మాడీ కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రాగానే ఆయనను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి పదవి నుండి తొలగించామన్నారు.

మళ్ళీ పేలనున్న పెట్రో బాంబు

న్యూఢిల్లీ: ఎన్నికలయ్యే వరకూ పెట్రో ధరల పెంపుదలను వాయిదా వేయించిన కేంద్రం ఇప్పుడు అందుకు పచ్చ జెండా ఊపుతోంది. జనవరి నుండి ఇప్పటి వరకూ పెట్రో ధరలను సవరించనందున ఇప్పుడు పెంపుదల అనివార్యమవుతోందని ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసి) ఛైర్మన్‌ రణబీర్‌సింగ్‌ బుటోలా చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలోనే ఈ ధరల సవరణను పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌కు తమ కార్పొరేషన్‌ ఏడు రూపాయల చొప్పున నష్టపోతున్నదన్నారు. వ్యాట్‌తో కలిపిఢిల్లీలో లీటరు పెట్రోలుకు 7.50 చొప్పున పెంచాలని యోచిస్తున్నారు. పెట్రో ధరల నిర్ణాయక విధానాన్ని ప్రభుత్వం సరళతరం చేయటంతో గతేడాది జూన్‌ నుండి ఇప్పటి వరకూ పెట్రోల్‌ ధరలను ఏడు సార్లు పెంచారు.

అంత్యక్రియల తర్వాతే బాబా వారసుడి ఎంపిక?

పుట్టపర్తి: : పుట్టపర్తి సత్యసాయి పరమపదించిన తర్వాత ఆయన వారసుడెవరన్న అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. సత్యసాయి బాబా మృతితో దాదాపు 40 వేల కోట్ల రూపాయల ఆధ్యాత్మిక ఆస్తుల వ్యవహారం, కార్యకలాపాలపై ప్రస్తుతం అయోమయం నెలకొంది. దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని సత్యసాయి ట్రస్టు వెల్లడించనుంది. బుధవారం ఉదయం బాబా అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. ఆ తర్వాత సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కీలక భేటీ జరుగనుంది.  ఆధ్యాత్మిక కేంద్రం కార్యకలాపాలను ఎలా కొనసాగించాలి, ఎవరు నేతృత్వం వహించాలి అనే అంశాలపై ఈ ట్రస్ట్ చర్చించనుంది. బుధవారం జరిగే సమావేశంలో ట్రస్టు సభ్యులతో పాటు సత్యసాయి బాబా కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. ఇరు పక్షాల మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో బుధవారం జరిగే సమావేశానికి అత్యంత ప్రాధాన్యత చేకూరింది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున కొందరు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌ను ట్రస్టులోకి తీసుకోవాలా, వద్దా అనే విషయంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సత్యజిత్ పట్ల కొంత మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై పలువురు పలు రకాలుగా విమర్శలు సైతం గుప్పించారు. అందువల్ల ఈయనకు ట్రస్టులో సభ్యత్వం కల్పించే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇకపోతే.. సాయిబాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ ట్రస్ట్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పాత్ర భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది కూడా ఈ సమావేశంలో తేలే అవకాశాలు ఉన్నాయి.

కుల్వంత్ హాల్‌లోనే సత్య సాయి ఖననం

పుట్టపర్తి: సత్య సాయిబాబా పార్ధివ దేహాన్ని కుల్వంత్ హాల్‌లోనే ఖననం చేయాలని ట్రస్టు సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చారు. సత్య సాయి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ట్రస్టు సభ్యులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సత్య సాయి కుటుంబ సభ్యులతో ట్రస్టు సభ్యులు పలు విడతలు చర్చలు జరిపారు. భక్తులకు సత్య సాయి కుల్వంత్ హాల్‌లోనే దర్శనమిచ్చేవారు. బాబా నివసించే యజర్ మందిర్‌లో పార్ధివ దేహాన్ని ఖననం చేయాలని తొలుత అనుకున్నారు. అయితే, యజర్ మందిర్‌లో ఖననం చేస్తే దర్శనానికి ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో కుల్వంత్ హాల్లోనే ఖననం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

నేడు పుట్టపర్తికి ప్రధాని, సోనియా

పుట్టపర్తి: సత్య సాయిబాబాకు అంతిమ నివాళులర్పించడానకి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం సాయంత్రం పుట్టపర్తికి రానున్నారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఈ విషయాన్ని ధ్రువీకరించి సాయంత్రం 4.30 గంటలకు వారు పుట్టపర్తికి చేరుకుంటారని చెప్పారు. ప్రధాని, సోనియా వస్తున్నట్లు అధికారికంగా ఖరారు కావడంతో సోమవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులు భద్రతా చర్యలపై చర్చించారు. సెంట్రల్‌ ట్రస్టు సభ్యులతో కూడా వారు సమావేశమయ్యారు. ప్రత్యేక బోయింగ్‌ విమానంలో పుట్టపర్తికి చేరుకున్న ఎయిర్‌ ఫోర్సు అధికారులు విమానాశ్రయంలో రక్షణ చర్యలను పరిశీలించారు. ప్రధాని భద్రతా దళానికి చెందిన అధికారులు విమానాశ్రయం నుండి ప్రశాంతి నిలయం వరకు ట్రైల్‌ రన్‌ నిర్వహించారు.

శ్రీకృష్ణపై సభా హక్కుల నోటీసు

హైదరాబాద్: హైకోర్టు తీర్పు చూశాక శ్రీకృష్ణ కమిటీపై సభా హక్కుల నోటీసు విషయంపై నిర్ణయం తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం న్యాయమైన అంశాలపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయాన్ని వ్యక్త పరుస్తామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయాన్ని కేంద్రం తప్పకుండా బయట పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆత్మబలిదానాలు ఆపకపోతే అందరూ తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత ఏ ఒక్కరిపైనో లేదన్నారు. ఆ బాధ్యత అన్ని పార్టీల పైన ఉందని చెప్పారు. తెలంగాణ విషయంలో రాజకీయ పక్షాలు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.

జగన్ వర్గ ఎమ్మెల్యేలపై టిజి ధ్వజం

కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యులపై చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ కడప జిల్లాలో తన ప్రచారంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలకు సిగ్గు ఏమాత్రమైనా ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారు తమ నైతికత చూపించాలనుకుంటే రాజీనామా చేసి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు విలువలు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలుసుకున్నారు కాబట్టే పార్టీలోకి అహ్వానించామని అన్నారు. కాంగ్రెసు పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయకుండానే ఇతర పార్టీలలో చేరడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికలలో గెలుస్తుందని చెప్పారు.

బాబాకి బిగ్‌బీ సంతాపం

ముంబై: సత్యసాయి మరణంతో తాను తీవ్ర దుఖానికి లోనయ్యానని అమితాబ్ ట్విట్టర్‌లో తెలిపారు. కూలీ షూటింగ్ సమయంలో ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత బాబాను దర్శించుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. కూలీ షూటింగ్‌లో గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్నపుడు బాబా విభూతిని పంపించారని.. బాబా పంపిన విభూతిని తన నాలుకపై పెట్టారని ఆయన తెలిపారు. ఆతర్వాత చెన్నైకి సమీపంలోని బాబా ఆశ్రమంలో తాను కలిశానని.. అక్కడ బాబా తనను ఆశ్వీరదించి గాలి నుంచి విభూతిని సృష్టించి ఇచ్చారని బిగ్‌బీ గుర్తు చేసుకున్నారు. ఆయన జీవితకాలంలో పేదప్రజల కోసం ఎంతగానో శ్రమించారని.. ఎన్నో అస్పత్రులు, విద్యాసంస్థలు కట్టించారని .. అందుకే బాబాకు లక్షలాది మంది భక్తులుగా మారారని అన్నారు.

ఆ ఇద్దరిపై చర్యలు తీసుకుంటాం: వంగా గీత

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవిపై పార్టీ నేతలు, కార్యకర్తల నుండి తీవ్ర ఒత్తిడి ఉందని వంగా గీత చెప్పారు. వంగా గీత డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఏకాభిప్రాయంతోనే వీలినం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అందరి అభిప్రాయాలు పార్టీ సేకరించిందన్నారు. విలీనం అంశంపై ఎన్నో సమావేశాలు కూడా నిర్ణయించామన్నారు. అప్పుడు వారిని పిలిచామని వారే హాజరు కాలేదని చెప్పారు. అప్పుడు సమావేశాలకు హాజరు కాకుండా ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం సమంజసం కాదని చెప్పారు. ఇన్నాళ్లుగా చెప్పకుండా ఇప్పుడు తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగానే విలీనం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జగన్‌తో వెళుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పార్టీలో మెజార్టీ సభ్యులు కోరుతున్నారని ఆమె చెప్పారు. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.

షోకాజ్ కు వివరణ ఇచ్చిన పోచారం

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉప సభాపతి నాదెండ్ల మనోహర్‌ను కలిసి షోకాజ్ నోటిసుకు వివరణ ఇచ్చుకున్నారు. తాను గత శాసనసభ కోటా మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయలేదో వివరణ ఇచ్చుకున్నారు. వివరణ ఇచ్చుకున్న అనంతరం ఆయన నాదెండ్లను తన రాజీనామాను త్వరగా ఆమోదించాల్సిందిగా కోరారు. అయితే గత శాసనమండలి ఎన్నికలలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఓటు వేసిన విషయం తెలిసిందే. గత నాలుగు నెలలుగా ఆయన ప్రత్యేక తెలంగాణపై తెలుగుదేశం పార్టీ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించక పోవడం వల్లే తాను టిడిపిని వీడుతున్నట్టు చెప్పారు. అయితే ఆయన గత సాధారణ ఎన్నికలలో టిడిపి మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి లేనందునే తాను వ్యతిరేకంగా ఓటు వేశాననే వివరణ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.

8వ అధ్యాయం వెల్లడిపై హైకోర్టు స్టే

హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీకి హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి ఊరట లభించింది. రహస్యంగా ఉంచిన కమిటీ ఎనిమిదో అధ్యాయాన్ని వెల్లడించాలని హైకోర్టు సింగిల్ జడ్డి ఇచ్చిన తీర్పుపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం స్టే ఇచ్చింది. తెలంగాణ ఉద్యమంపై శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయంలో వ్యాఖ్యలు చేసిందని, దాన్ని వెల్లడించాలని కోర్టుకెక్కారు. ఎనిమిదో ఆధ్యాయాన్ని వెల్లడించాలని సింగిల్ జడ్జి బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై ప్రభుత్వం ఇద్దరు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్‌కు అపీల్ చేసుకుంది. కమిటీ ఎనిమిదో అధ్యాయాన్ని సీల్డు కవరులో తమకు అందించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది. తన నివేదికలోని ఎనిమిదో అధ్యాయాన్ని కమిటీ సీల్డు కవర్‌లో కేంద్ర హోం మంత్రి చిదంబరానికి అందజేసింది. దాని బహిర్గతం చేయరాదని కోరింది.

కాంగ్రెస్ పై డిఎంకె ఆగ్రహం

న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు మరోసారి కాంగ్రెసు, డిఎంకెల మధ్య సంబంధాలను దెబ్బ తీసే పరిస్థితిని కల్పించింది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు, పార్లమెంటు సభ్యురాలు కనిమొళి పేరును సిబిఐ 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసు చార్జిషీట్‌లో చేర్చించింది. కరుణానిధి ఇద్దరు భార్యల్లో ఒక భార్య దయాళ్ అమ్మాళ్ పేరును కూడా సిబిఐ తన చార్జీషీట్‌లో చేర్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, చార్జీషిట్‌లో కనిమొళి పేరును చేరుస్తూ సిబిఐ సోమవారం రెండు చార్జీషీట్‌ను ప్రత్యేక న్యాయమూర్తి ఒపి సైనీకి సమర్పించింది. దయాళ్ అమ్మాళ్ పేరును చార్జిషీట్‌లో చేరిస్తే మంత్రి వర్గం నుంచి తప్పుకోవాలని తమ ఆరుగురు కేంద్ర మంత్రులను కరుణానిధి ఆదేశించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. చార్జిషీట్‌లో తన తల్లి పేరు చేర్చే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలతో ఆమె కుమారుడు అళగిరి అసంతృప్తితో ఉన్నారుట. నిందితుల జాబితాలో తన తల్లి పేరు చేరిస్తే తాను ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలని ఆయన అడిగారు. ఈ స్థితి వల్ల దయాళ్ అమ్మాళ్ పేరును చార్జిషీట్‌లో చేర్చకూడదని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మే 13వ తేదీ తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు నిరీక్షించాలని డిఎంకె నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

బాబాకు సచిన్ దంపతుల నివాళి

పుట్టపర్తి : సత్యసాయి బాబాకు సచిన్ టెండుల్కర్ దంపతులు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం సచిన్ దంపతులు చాముండేశ్వరీనాథ్‌తో కలిసి పుట్టపర్తి వచ్చారు. కుల్వంత్ హాల్‌లోని బాబా పార్థివ దేహాన్ని చూసి చలించిపోయిన సచిన్ కంటతడి పెట్టారు. సచిన్, ఆయన భార్య అంజలి బాబాను దర్శించుకున అక్కడే కుర్చుని ప్రార్థన చేశారు. బాబాతో సచిన్‌కు ఎనలేని అనుబంధం ఉంది. తరచు పుట్టపర్తి వచ్చి బాబాను దర్శించుకునేవారు. కాగా ప్రముఖ గాయని సుశీల బాబా భౌతికకాయాన్ని దర్శించి భోరున విలపించారు. కేంద్రమంత్రులు విలాస్ రావ్ దేశ్ ముఖ్, ప్రపుల్ పటేల్ లు కూడా ఈరోజు ఉదయం సాయి భౌతిక కాయాన్ని దర్శించుకుని నివాళులర్పించారు.

మూడో అవతారం ప్రేమసాయి!

అనంతపురం: తన మొదటి అవతారం షిర్డీ సాయిబాబాగా పేర్కొన్న బాబా.. రెండో అవతారం సత్యసాయిబాబా అని చెప్పారు. ఈ అవతారం పరిసమాప్తమైన ఏడాదికి కర్ణాటకలోని మాండ్యా జిల్లా గునపర్తిలో మూడో అవతారం ప్రేమసాయిగా తిరిగి అవతరిస్తారని భక్తులు అచంచలమైన విశ్వాసంతో చెప్తున్నారు. బాబా 1960లోనే ‘ప్రేమ సాయి’ రూపాన్ని కూడా భక్తులకు పరిచయం చేశారని స్పష్టం చేస్తున్నారు. బాబా భక్తులకు ఎన్నో చిత్ర, విచిత్రాలు గోచరించాయి. సాయి నామస్మరణలో ఉన్న భక్తులకు ప్రకృతిలో కూడా ఎన్నో విశేషాలు దర్శనమిచ్చాయి. నిండు చంద్రుడిలో సత్యసాయి ఆకారం దర్శనమివ్వటం ప్రపంచ దేశాల్లో గొప్ప సంచలనం సృష్టించగా.. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక వింతగా మిగిలిపోయింది. 2007 అక్టోబరు 4న సత్యసాయిబాబా ఆకారం చంద్రుడిలో కనిపించిందని ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరిగింది.

సమర్థతకు-అసమర్థతకు మధ్య ఉపఎన్నికలు

తాడిపత్రి: ఉప ఎన్నికలు నీతికి-అవినీతికి , సమర్థతకు-అసమర్థతకు మధ్య జరుగుతున్నాయన్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. కడప జిల్లాలో ప్రచారానికి వెళ్తూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కడప ఉప ఎన్నికల ప్రచారానికి మంత్రులను తరలించి పాలనను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సిఎం అయ్యాక రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడుందో తెలియడం లేదన్నారు. రాష్ట్ర ప్రగతి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందన్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు డబ్బు వెదజల్లుతున్నాయన్నారు. ఒంటరి వాడినని జగన్ చెప్పుకుంటున్నాడని, కానీ జగన్ వద్ద లక్షల కోట్లు ఉన్నాయన్నారు. కడపలో వైఎస్సార్ ఫ్యాక్షన్‌ను పెంచిపోషించారని ఆరోపించారు. మొన్నటి వరకు సూట్‌కేసుల్లో బాంబులు ఉండేవని, నేడు డబ్బులు వస్తున్నాయన్నారు. అధికార వ్యామోహం, సిఎం కావాలనే ఆలోచనతోనే జగన్ నీచ రాజకీయాలకు నడుంకట్టారన్నారు. యుపిఎ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెంచిపోషిస్తోందని చంద్రబాబుఆరోపించారు. అవినీతి రహిత పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. దేశం నుండి వేల కోట్ల నల్లధనం విదేశాలకు తరలించడం సిగ్గుచేటన్నారు. అవినీతిపై అన్నాహజారే చేపట్టిన పోరులో భాగంగా ఆరోపణలను నిరూపించుకునేందుకు సిద్ధమా అని ప్రశ్నించిన నేపధ్యంలో అధికార పార్టీ మిన్నకుండి పోయిందన్నారు. అవినీతిపై ఉద్యమం చేస్తే సహకరించాల్సింది పోయి వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అరికట్టక పోతే పేదవాడు మరింత పేదవాడుగా మిగులుతాడన్నారు. అకాల వర్షాలతో లక్షల ఎకరాల పంట దెబ్బతినిందన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వరి పండించే రైతుకు అన్యాయం జరుగుతోందని, వరి ధాన్యానికి మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేశారు.