వేటు వేసే హక్కు కాంగ్రెస్ కు లేదు: సురేఖ
posted on Apr 20, 2011 @ 2:12PM
హైదరాబాద్: తమపై అనర్హత వేటు వేసే హక్కు కాంగ్రెసు పార్టీకి లేదని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. అనర్హత వేటుకు భయపడేది లేదని, తాను వైయస్ జగన్ వెంటే నడుస్తానని ఆమె అన్నారు. తమపై అనర్హత వేటు వేస్తారని వచ్చిన వార్తలపై ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో కాంగ్రెసుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. వైయస్ జగన్ బిజెపితో దోస్తీ కట్టారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యను ఆమె ఖండించారు. బిజెపితో కలవాల్సిన అవసరం జగన్‌కు లేదని ఆమె చెప్పారు. డి శ్రీనివాస్ దిగజారి మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తిట్టిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిని చేర్చుకున్నప్పుడే కాంగ్రెసు తనపై తాను వేటు వేసుకోవాలని కొండా సురేఖ అన్నారు.
తన భర్త కొండా మురళికి భద్రత కుదింపుపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్నవారిని మానసికంగా హింసించడంలో భాగంగానే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగుతోందని ఆమె విమర్సించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. తాము గోడ మీది పిల్లులాంటివాళ్లం కాదని, తాము వైయస్ కుటుంబంతోనే ఉంటామని ఆమె చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకమని వైయస్ జగన్ ఇప్పటి వరకు చెప్పలేదని, అందువల్ల జగన్ తెలంగాణకు వ్యతిరేకి అనడం సరికాదని ఆమె అన్నారు. ఉప ఎన్నికల తర్వాత తెలంగాణపై వైఎస్ జగన్ తన వైఖరిని వెల్లడిస్తారని సురేఖ తెలిపారు. 177 జీవో ఉపసంహరించుకునే వరకూ తెలంగాణ మంత్రులు కేబినెట్ సమావేశాలకు హాజరు కావద్దని కోరారు.