రాయపాటి సంచలన వ్యాఖ్యలు

గుంటూరు: గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల కంటే రాజకీయాల్లో ఇప్పుడు సంపాదన బాగా పెరిగిందని ఆయన చెప్పారు. రాయపాటి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు డబ్బు తీసుకొని ఓట్లు వేసినంత కాలం.. వ్యవస్థ ఇలాగే ఉంటుందన్నారు. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేసే ప్రజాప్రతినిధులు.. గెలిచాక తిరిగి ఆ డబ్బును సంపాదించుకోవడం పైనే దృష్టి పెడుతున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో తనకు రూ.15 నుంచి రూ.20 కోట్లు ఖర్చయినట్లు రాయపాటి తెలిపారు. 2014లో జరిగే ఎన్నికలకు రూ.100 కోట్లు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులు రూ. వందల కోట్లను అక్రమంగా సంపాదిస్తున్నారని రాయపాటి ఆరోపించారు. కాగా, సాయిబాబా ప్రవేశపెట్టిన సేవలన్నింటినీ కొనసాగించేందుకు వీలుగా.. రూ.లక్షల కోట్ల ఆస్తులున్న సత్యసాయిబాబా ట్రస్ట్‌ను సర్కారు స్వాధీనం చేసుకోవాలని కోరారు. సాయి మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరూ.. బాబా చూపిన మార్గంలోనే నడవాలని రాయపాటి కోరారు.

సత్యసాయి ట్రస్టు భవిష్యత్తు ఏమిటి?

హైదరాబాద్‌: పుట్టపర్తి సత్య సాయిబాబా వారసుడిని ఇప్పటికిప్పుడు ప్రకటించే అవకాశాలు లేవు. పుట్టపర్తి ట్రస్టు వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని, ట్రస్టు పనులు కొనసాగుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు భవిష్యత్తు ఒక రకంగా అయోమయంగానే ఉంది. ట్రస్టు విలువ 40 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఆకాశ రామన్న ఉత్తరాలతో ట్రస్టు సభ్యుల్లో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ ట్రస్టు చైర్మన్‌గా సత్య సాయిబాబా కొనసాగుతూ వచ్చారు. చెక్‌పై సంతకం చేసే అధికారం కూడా ఆయనకు ఒక్కరికే ఉండేది. ఈ వివాదాన్ని ట్రస్టు సభ్యులు ఎలా పరిష్కరించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మిగతా బాబాల మాదిరిగా కాకుండా సత్య సాయిబాబా తన కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ట్రస్టు సభ్యుడైన సత్య సాయిబాబా సోదరుడు జానకీ రామయ్య కుమారుడు రత్నాకర్ తనకు పెద్ద పాత్ర కావాలని డిమాండ్ చేస్తున్నారు. జానకీరామయ్య మృతితో రత్నాకర్ ట్రస్టు సభ్యుడయ్యారు. కార్యదర్శి కె. చక్రవర్తి వంటి ట్రస్టు నిర్వాహకులు సంస్థ ప్రొఫెషనల్స్ చేతుల మీదుగా నడవాలని అభిప్రాయపడుతున్నారు. చక్రవర్తి సత్య సాయిబాబాకు సేవలు అందించడానికి ఐఎఎస్ పదవికి స్వస్తి చెప్పారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి పిఎన్ భగవతి, మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎస్‌వి గిరి చక్రవర్తి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. పోలీసులకు గత కొద్ది రోజులుగా ఆకాశ రామన్న ఉత్తరాలు వస్తున్నాయి. కరపత్రాల పంపిణీ జరిగింది. దీంతో ట్రస్టు సభ్యుల్లో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ ట్రస్టు డీడ్ ప్రకారం ఏ మార్పులైనా వ్యవస్థాపక ట్రస్టీ ఆమోదంతోనే జరగాల్సి ఉంటుంది. వ్యవస్థాపక ట్రస్టీ లేకపోవడంతో ట్రస్టు భవిష్యత్తు ఏమిటనేది తెలియడం లేదు.

సత్యసాయి బాబా జిల్లాగా అనంతపురం జిల్లా?

హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుట్టపర్తి సత్యసాయి బాబా సేవలకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా అనంతపురం జిల్లా పేరును ఇకపై సత్యసాయి బాబా జిల్లాగా పేరు మార్చాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ దిశగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు ఎన్.రఘువీరా రెడ్డి, శైలజానాథ్‌లు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ముందు మంత్రివర్గంతో పాటు ఉన్నతస్థాయిలో చర్చించి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. కులమతాలకు అతీతంగా శాంతి, ప్రేమ ఆప్యాతానురాగాలకు ఆయన ఒక చిహ్నమని, భక్తిని, సేవను మేళమించి ప్రపంచానికి మార్గనిర్ధేశం చేసిన మహనీయుడు అని సత్యసాయి బాబాను రాజకీయ పార్టీల నేతలు కొనియాడుతున్నారు. "మానవ సేవే మాధవ సేవ" అని ఆచరించి చూపారని, తన హితంకన్నా జనహితమే మేలని ఆయన భావించేవారని, అటువంటి గొప్ప ప్రపంచ సేవకుడ్ని రాష్ట్రమే కాదు ప్రపంచమే కోల్పోయింది. దీనికి చిహ్నంగా అనంతపురం జిల్లా పేరును భగవాన్‌ సత్యసాయి బాబా పేరుగా మార్చాలని భావిస్తోంది. అలాగే, సాయి నివాసమైన పుట్టపర్తిని ప్రత్యేక పుణ్యక్షేత్రంగా మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

బాబా జీవితం ఆదర్శప్రాయం: సబిత

హైదరాబాద్‌: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రపంచం ఓ గొప్ప సేవకుడిని కోల్పోయిందని సబిత అన్నారు. ప్రతి వ్యక్తి ఆయన బాటలో నడవాలని ఆమె సూచించారు. విదేశాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పారు. కాగా హోంమంత్రి సోమవారం పుట్టపర్తికి వెళ్లనున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మరణం తనను ఎంతో కలచి వేసింది అని ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. సత్యసాయిబాబాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బాబా సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తమయ్యారని చెప్పారు. బాబా చాలా గ్రామాలకు తాగునీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చారని గుర్తు చేసుకున్నారు. కాగా కడప జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హుటాహుటినా పుట్టపర్తికి ఉదయం బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆయన బాబా పార్థివ శరీరాన్ని దర్శించుకొని నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాబా సేవలు అమోఘమని చెప్పారు. బాబా మరణంతో కేవలం పుట్టపర్తి, అనంతపురం జిల్లా మాత్రమే కాదని అందరూ విషాదంలో మునిగిపోయారని చెప్పారు.

ప్రధాని సహా పలువురు సంతాపం

హైదరాబాద్: సత్యసాయి మృతిపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, సీనియర్ బీజేపీ నాయకులు అద్వానీ, జయలలిత, కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యురప్పలతోపాటు పలువురు ప్రముఖుల తమ సంతాపాన్ని వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. నీతివంతమైన, అర్ధవంతమైన జీవితానికి స్పూర్తినిచ్చిన గొప్ప అధ్యాత్మికవేత్త అని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మానవ విలువలకు నిలువుటద్దం..అనేక విద్యాసంస్థలు, ఆరోగ్య సంస్థల ద్వారా ప్రజల సేవకు అంకితమయ్యారన్నారు. అధునిక కాలంలో స్వామి రామకృష్ట పరమహంస, స్వామి వివేకానంద, స్వామి దయానంద, మహాత్మగాంధి దేశానికి ఆదర్శవంతులుగా నిలిచిపోయారు.. ప్రస్తుత భారతంలో ఆధ్యాత్మిక రంగంలో సత్యసాయి విభిన్న వ్యక్తి అని బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ అన్నారు. అసంఖ్యాక విద్యాసంస్థలు, ఆస్పత్రుల ఏర్పాటు ద్వారా సుమారు ఐదు దశాబ్దలపాటు సేవలందించారని ఏఐడీఎంకే అధినేత్రి జయలలిత అన్నారు. ఆయన మృతి మానవ లోకానికి తీరని లోటన్నారు. మానవ లోకం కోసం సర్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బాబా అని కర్నాటక ముఖ్యమంత్రి యాడ్యురప్ప అన్నారు. కాగా, భక్తులు, ప్రజల దర్శనార్ధం సత్యసాయి పార్ధీవ శరీరాన్ని ప్రశాంతి నిలయానికి తరలించారు. ప్రత్యేకం అలంకరించిన వాహనంలో బాబా మృతదేహాన్ని ఉంచి భద్రతా ఏర్పాట్ల మధ్య నిలయానికి తీసుకువెళ్లారు.

పుట్టపర్తికి సచిన్

హైదరాబాద్: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పార్థివ శరీరాన్ని దర్శించుకోవడానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సోమవారం పుట్టపర్తికి వెళ్లనున్నట్టు సమాచారం. సచిన్ టెండుల్కర్ సత్యసాయికి పరమ భక్తుడు అని తెలిసిందే. బాబా మరణ వార్త విని సచిన్ టెండుల్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం దక్కన్ చార్జర్స్‌తో ఆడనున్న ఆటను బాబాకే అంకితం ఇస్తున్నట్టు సచిన్ చెప్పారు. ఈ ఆటలో తాను సెంచరీ చేసినా దానిని బాబాకే అంకితమిస్తానని చెప్పారు. కాగా ఆదివారం దక్కన్ చార్జర్స్‌తో మ్యాచ్ ఉన్నందునే సచిన్ వెళ్లలేక పోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బాబా ఆరోగ్యం బాగులేనందున తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నట్టు శనివారం సచిన్ చెప్పారు. ఇప్పుడు బాబా మరణవార్త విని సచిన్ మరింత కలత చెందారు. శనివారం సాయంత్రం సతీమణి అంజలితో సచిన్ హైదరాబాదుకు వచ్చిన విషయం తెలిసిందే.

అధికార లాంఛనాలతో బాబాకు అంత్యక్రియలు

పుట్టపర్తి: భగవాన్ సత్యసాయి బాబా భౌతిక కాయానికి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు.  భగవాన్ సత్యసాయి బాబా పార్దీవానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు అంజలి ఘంటించారు. మానవసేవే మాధవసేవని సందేశమిచ్చిన బాబా నిర్దేశించిన మార్గంలో అందరూ నడవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళని ఆయన పేర్కొన్నారు. బుధవారం వరకు సంతాపదినాలుగా ప్రకటించామన్నారు. బుధవారం అనంతపురం జిల్లాకు సెలవు ప్రకటించారు. ఆరోగ్యం, విద్య, దుర్భిక్ష ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు బాబా ఎంతో చేయూతనిచ్చారని ముఖ్యమంత్రి తన సంతాప సందేశంలో తెలిపారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికై బాబా ఎంతగానో కృషి చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా పుట్టపర్తికి కావాల్సినన్ని బస్సులు నడపాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

27న బాబా అంత్య క్రియలు: గీతారెడ్డి

పుట్టపర్తి: భగవాన్ సత్యసాయి బాబా పార్థీవ దేహానికి బుధవారం(ఈ నెల 27న) అంత్య క్రియలు జరుగుతామయని రాష్ర్ట మంత్రి గీతారెడ్డి తెలిపారు. బాబా మరణం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంయమనం పాటించాలని భక్తులకు ఆమె విజ్ఞప్తి చేశారు. బాబాను బతికించడానికి ప్రభుత్వ పరంగా అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు కూడా బాబాను కాపాడేందుకు శతవిధాలాల ప్రయత్నాలు చేశారన్నారు. బాబా పార్థీవ దేహాన్ని రెండు రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉంచుతామని చెప్పారు. భక్తులు క్రమశిక్షణతో బాబాకు వీడ్కోలు పలకాలని ఆమె కోరారు. పుట్టపర్తికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని గీతారెడ్డి తెలిపారు.

భక్తులు గుండె నిబ్బరం చేసుకోవాలి: అనిల్‌

పుట్టపర్తి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబాది కేవలం దేహమే అయితే ఎలా అని ఆయన ప్రపంచమంతా ఎలా దర్శనమిస్తారని అందుకే ఆయన తన దేహాన్ని వీడినారని భక్తులు తెలుసుకోవాలని బాబా ప్రసంగాలను అనువదించిన డాక్టర్ అనిల్‌కుమార్ ఓ టీవి కార్యక్రమంలో భక్తులకు సూచించారు. బాబా భక్తులు గుండె నిబ్బరం చేసుకోవాలని చెప్పారు. బాబా కేవలం దేహాన్ని మాత్రమే వీడారని, ఆత్మ అలాగే ఉందని, ఆ ఆత్మ కూడా భక్తుల మదిలో నిత్యం ఉంటుందని చెప్పారు. సత్యసాయి వ్యక్తి కాదని శక్తి, మహాద్బుత వ్యక్తి అని చెప్పారు. సాయిబాబా పిలిస్తే పలికే వ్యక్తి అని అన్నారు. బాబా లేరని మన నోట రాకూడదన్నారు. మానసికంగా బాబా మన మదిలోనే ఉన్నారన్నారు. మనం బాబా మాటలను నిత్యం గుర్తు పెట్టుకోవాలన్నారు. షిర్డి సాయిబాబా సమాధి నుండే మాట్లాడతానని ఆనాడే చెప్పారని అన్నారు. అలాగే బాబా ఇప్పుడు దేహం విడిచి మాత్రమే వెళ్లారని అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోడమే బాబా ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు. సాయీ అని పిలిస్తే ఓయూ అని పలికే వాడు బాబా అని చెప్పారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ ట్రస్టు సభ్యులపై అపనమ్మకం వద్దని భక్తులను కోరారు. ట్రస్టు సభ్యులు బయటకు వెళితే లక్షల జీతం వస్తుందని దానిని వదులుకొని బాబా సేవలో ఉన్నారన్నారు. బాబా సేవలో చిత్తశుద్ధితో ఉన్న ట్రస్టు సభ్యులపై అనుమానాలు ఎలాంటివి పెట్టుకోవద్దని కోరారు.

పుట్టపర్తికి తరలివస్తున్న ప్రముఖులు

అనంతపురం: భగవాన్ సత్యసాయి బాబా మరణం వార్త వెల్లడికాగానే ప్రముఖులు పుట్టపర్తికి తరలి వస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. భగవాన్ సత్యసాయి బాబా మరణం వార్త వెల్లడికాగానే ప్రముఖులు పుట్టపర్తికి తరలి వస్తున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి బయలుదేరారు. ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కడప నుంచి పుట్టపర్తికి పయనమయ్యారు. బెంగళూరులో ఉన్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవి బాబా మరణవార్త వినగానే పుట్టపర్తికి బయలుదేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రముఖులే కాకుండా జాతీయస్థాయి నేతలు కూడా పలువురు తరలి రానున్నారు.

శోకసంద్రంలో బాబా భక్తులు

పుట్టపర్తి: భగవాన్ సత్యసాయి బాబా మరణవార్తతో ఆయన భక్తులు విషాదంలో మునిగిపోయారు. తమ దేవుడు ఇక లేడన్న సమాచారంతో భక్తులు నిర్ఘాంతపోయారు. గత 28 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా కోలుకుంటారని ఎదురుచూసిన భక్తులకు ఈ రోజు చేదు వార్త అందింది. బాబా ఇక లేరన్న చేదు నిజాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబా తిరిగి రారన్న వార్తతో పుట్టపర్తితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు నిశ్చేష్టులయ్యారు. భగవంతుడు అనే పదానికి అర్థం చెప్పిన మహానుభావుడు అస్తమించడంతో భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమత, మమత, మానవత పంచిన బాబా మళ్లీ తమకోసం మరో అవతారం ఎత్తుతారని భక్తులు విశ్వాసంతో ఉన్నారు. బాబా మళ్లీ రావా అని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. 

బాబా మృతికి కంటతడి పెట్టిన అద్వానీ

పుట్టపర్తి: కోట్లాది భక్తులకు ఆరాధ్యుడు అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మృతిని తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ కన్నీరు పెట్టుకున్నారు. బాబా మరణించాడనే వార్త తెలియగానే ఎల్.కె.అద్వానీ మీడియా ముందే కన్నీళ్ల పర్యంతమయ్యారు. బాబా మృతిని తాను తట్టుకోలేక పోతున్నట్టు చెప్పారు. అయితే బాబా అందరి మనసుల్లో ఉన్నారని చెప్పారు. కాగా బాబా మరణ వార్త విని పుట్టపర్తి శాసనసభ్యుడు పల్లె రఘునాథ్ రెడ్డి బోరున విలపించాడు. వెంటనే సొమ్మసిల్లి పడిపోయాడు. పుట్టపర్తిలోని జెండామాను వీధిలో నారాయణమ్మ అనే భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాబా భక్తులు పూర్తిగా దుఖసాగరంలో మునిగి పోయారు. పుట్టపర్తికి బాబా భక్తులను తరలించడానికి రాష్ట్రం, పలు రాష్ట్రాల నుండి ప్రత్యేక బస్సులు ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి.

ఆ నలుగురికి ఉపసభాపతి నోటీసులు

అనంతపురం: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న తమ ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందిగా కాంగ్రెస్‌ శాసనసభా పక్షం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. ఉపసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఆదేశాల మేరకు స్పీకర్‌ కార్యాలయం శనివారం వారికి నోటీసులు పంపింది. సాక్ష్యాధారాలతో సీఎల్పీ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల్ని ప్రస్తావిస్తూ దాని ప్రతిని నోటీసుకు జతచేసి పంపారు. నోటీసు అందిన వారం రోజుల్లోగా ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలంటూ గడువు విధించారు. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వరంగల్‌ జిల్లాకు చెందిన కొండా సురేఖలపై సీఎల్పీ గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ టిక్కెట్లపై గెలిచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం, పార్టీ అధ్యక్షురాలిని విమర్శించడం వంటి కారణాలతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపైనే డిప్యూటీ స్పీకర్‌ వారికి నోటీసులు జారీచేశారు. రెండ్రోజుల పాటు తిరుపతి పర్యటనకు వెళ్ళి వచ్చిన ఆయన శనివారం సాయంత్రం అసెంబ్లీకి వచ్చాక నోటీసులు జారీ అయ్యాయి. వారం తర్వాత ఎమ్మెల్యేల నుంచి వచ్చే వివరణను పరిశీలించి డిప్యూటీ స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఫిర్యాదుతోపాటు, ఇచ్చిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంశాన్ని అతి త్వరగా పరిష్కరించాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. నలుగురు ఎమ్మెల్యేలు గత ఏడాది కాలంగా నిర్వహించిన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై సీఎల్పీ పూర్తి ఆధారాలతో కూడిన నివేదికను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించింది. వారు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలతో కూడిన పత్రికల క్లిప్పింగులు, వీడియో సీడీలను జతపరిచింది. నలుగురిపై అనర్హత వేటు వేయడానికి సరిపడా సాక్ష్యాధారాలు సమర్పించామని, ఇందులో నుంచి వారు తప్పించుకునే అవకాశమే లేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

సత్యసాయి బాబా జీవిత ప్రస్థానం

పుట్టపర్తి: సత్యనారాయణరాజు అలియాస్ సత్యసాయి బాబా. 1926లో పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకు ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించాడు. సత్యనారాయణ వ్రతం తర్వాత పుట్టిన సంతానం కనుక పిల్లవాడికి అలా పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతకు అవే మోగాయనీ ఇప్పటికీ చెప్పుకుంటారు. ప్రొఫెసర్ నారాయణ కస్తూరి రచించిన జీవిత కథ ప్రకారం వ్రతం తర్వాత ఈశ్వరమ్మకు ఒక నీలిరంగు గోళం వంటి కాంతి తనలో లీనమౌతున్నట్లుగా కల వచ్చింది. తరువాత ఆమె గర్భవతి అయ్యింది. బిడ్డ జననం తరువాత పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చింది. అందుకే కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు. అయితే ఈ అనుభవాలను గురించి ఆ సమయంలో ఉన్న వ్యక్తుల నుండే విభిన్న కథనాలు వినబడుతున్నాయి. యౌవ్వనంలో సత్యసాయిబాబా దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది. చిన్న వయస్సులోనే నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరచాడు. తర్వాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివాడు. మార్చి కొంత విచిత్రమైన ప్రవర్తన (తేలు కుట్టినట్లుగా) కనబరచాడు. ఈ సంఘటన తర్వాత అతని ప్రవర్తనలో మార్పులు కనబడసాగినట్టు చెప్పుకుంటారు. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవాడు. పురాతన శ్లోకాలు చెప్పేవాడు. భోజనం సరిగా చేసేవాడు కాడు. 1940లో తాను షిరిడీ సాయిబాబా చెందిన ఫకీరు అవతారమని ప్రకటించుకున్నాడు. అదే పేరు తనకు పెట్టుకున్నాడు. కస్తూరి వ్రాసిన జీవిత చరిత్ర ప్రకారం అక్టోబర్ 20, 1940లో, తన 14 యేండ్ల వయస్సు ఉన్నపుడు తన పుస్తకాలు వదిలేసి, "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది" అని చెప్పారు. తర్వాత మూడేండ్లు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద గడిపాడు. అప్పుడే అతనిచుట్టూ ప్రజలు గుమికూడడం మొదలయ్యింది. వారితో అతను భజనలు చేయించేవాడు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారం అని ప్రకటించాడు. అప్పటినుండి సాయిబాబా అదే విషయం చెబుతూ వచ్చాడు. 1942 నాటి బుక్కపట్నం స్కూలు రికార్డులలో అతని పేరు ఉంది. 1944లో అనుచరులు (భక్తులు) ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని "పాత మందిరం" అంటారు. ప్రస్తుతం ఇది ఆశ్రమమైన ప్రశాంతి నిలయం. దీని నిర్మాణం 1948లో మొదలయ్యింది. 1963లో తన ప్రవచనంలో తాను శివుడు శక్తిగల అవతారమని ప్రకటించాడు. ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమనీ, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తాననీ చెప్పాడు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించాడు. 1958లో సత్య సాయిబాబా అనుచరులు సనాతన సారధి అధికారిక పత్రికను ప్రచురిచడం ప్రారంభించారు. అదేసమయంలో పలు పాశ్చాత్య దేశాల నుంచి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారు సత్యసాయిని సందర్శించడం అధికమైంది. ఒక్క 1968లో మాత్రమే ఈశాన్య ఆఫ్రికా ప్రాంతానికి సాయిబాబా భారతదేశం దాటి బయటకు వెళ్ళాడు. కాని అతని అనుచరులు, భక్తులు, సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. 1960లో ఒక ప్రవచనంలో తాను ఈ మానవ రూపంలో ఇంకా 59 సంవత్సరాలు ఉంటానని చెప్పాడు. ప్రచురింపబడిన ఒక పుస్తకంలో బాబా ఇలా చెప్పాడని వ్రాయబడింది."నా పాత శరీరంలో నేను ముసలివాడను, బలహీనుడను అయ్యాను గాని ఈ క్రొత్త శరీరంలో అలా కాను." పుట్టపర్తే సత్యసాయి ప్రీతిపాత్రమైన స్థలం. పుట్టపర్తిలోనే ఇప్పటికీ నివాసం ఉంటున్నాడు. ఒకప్పటి ఈ చిన్న గ్రామం ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్యజ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల (దీని డిజైనుకు పలు అవార్డులు లభించాయి). ఒక ఆధ్యాత్మిక మ్యూజియమ్, ఒక రైల్వే స్టేషను, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి పెక్కు సదుపాయాలు ఆవిర్భవించాయి. పుట్టపర్తి ఆశ్రమాన్ని దేశ విదేశాలకు చెందిన వీవీఐపీలు దర్శించుకున్నారు. సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలల నుంచి 10 లక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారతదేశం నుంచి, 180 ఇతర దేశాల నుంచి 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు. సంవత్సరంలో అధికభాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉంటుంది. వేసవికాలం కొన్నిరోజులు బెంగళూరులోని "బృందావనం" ఆశ్రమంలో గడుపుతాడు. ఎప్పుడైనా కొడైకెనాల్ ‌లోని "సాయి శృతి ఆశ్రమానికి వెళతాడు. సత్యసాయిబాబా మూడు ముఖ్య మందిరాలను స్థాపించాడు - అవి ముంబైలోని "ధర్మక్షేత్రం" లేదా "సత్యం", హైదరాబాదులోని "శివం", చెన్నైలోని "సుందరం". బాబా ఆశ్రమాలలో దినచర్య ఉదయం ఓంకార స్మరణ, సుప్రభాతాలతో మొదలవుతుంది. తర్వాత వేద పారాయణ సంకీర్తన, భజనలు జరుగుతాయి. బాబా దర్శనం ఇస్తాడు. ముఖ్యంగా అక్టోబరు, నవంబరు మాసాలలో బాబా ఇచ్చే దర్శనం పట్ల భక్తులకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఎందుకంటే బాబా జన్మదినం ఈ కాలంలోనే వస్తుంది. దర్శన సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను, వినతి పత్రాలను స్వీకరిస్తాడు. విభూతిని 'సృష్టించి' పంచుతాడు. కొందరిని ప్రత్యేక దర్శనానికి, మాట్లాడడానికి అనుమతిస్తాడు. ఇలా ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో సంతోష కారణంగా ఉంటుంది. అటువంటి దర్శన సమయాలలో బాబా భక్తుల మనసులోని మాటలను, ఇతర అనూహ్యమైన విషయాలను వెల్లడిస్తుంటాడని అలా భక్తులు ఆశ్చర్యపడుతారని అంటారు.

సత్యసాయి బాబా ఇక లేరు

పుట్టపర్తి: భగవాన్ సత్యసాయి బాబా ఆదివారం తుదిశ్వాస విడిచారు. భౌతికంగా ఆయన భక్తులకు దూరమయ్యారు. ఈ ఉదయం 7.38 నిమిషాలను సత్యసాయి బాబా దేహాన్ని వదిలి వెళ్లినట్టు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. గత 28 రోజులుగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా ఈ రోజు లోకాన్ని విడిచారు. బాబా మరణంతో పుట్టపర్తిలో విషాద వాతావరణం నెలకొంది. బాబా నిర్యాణం వార్త విని భక్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాబా ఇక లేరు అన్న వార్తను తెలుసున్న ఒక మహిళ పుట్టపర్తిలో కుప్పకూలిపోయారు. అలాగే, దేశ విదేశాలకు చెందిన బాబా భక్తులు పుట్టపర్తికి చేరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి అనంతపురం నుంచి పుట్టపర్తికి బయలుదేరారు.  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ పుట్టపర్తికి వెళ్లాలని నిర్ణయించారు. మరికొద్ది సేపట్లో వీరు పుట్టపర్తికి బయలుదేరతారు. బాబా పార్థివ శరీరాన్ని భక్తుల సందర్శనార్థం కుల్వంత్ హాల్‌కు నేటి సాయంత్రం తరలించనున్నారు. భక్తుల సందర్శనార్ధం రెండురోజులు అక్కడే ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం వరకు భక్తుల సందర్శనార్థం కుల్వంత్ హాలులో ఉంచుతారు.

జగన్ పై ధ్వజమెత్తిన చంద్రబాబు

హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కడప ఉప ఎన్నికల్లో కోట్లాది రూపాయలను జగన్ కుమ్మరిస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. ఐదేళ్లలో జగన్‌కు ఇన్ని కోట్లు, ఇన్ని ఇళ్లు ఎలా వచ్చాయని ఆయన అడిగారు. తండ్రి వైయస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఆయన అన్నారు. రాజకీయ నేతల తలలకు వెల కట్టి వైయస్ జగన్ డబ్బులు చెల్లిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించి గెలవడానికి జగన్ సిద్ధపడ్డారని ఆయన అన్నారు. కడప ఉప ఎన్నికలు నీతికి, అవినీతి మధ్య జరుగుతున్నవని ఆయన అన్నారు. తమ అవినీతి వ్యతిరేక పోరాటాన్ని కడప నుంచే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కావాలని వైయస్ జగన్ కలలో కూడా కలవరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని మార్చేస్తానని జగన్ అంటున్నారని, లక్ష కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించిన జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చేస్తారో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. కడపలో వైయస్ రాజశేఖర రెడ్డి ముఠాకక్షలను పెంచి పోషించారని ఆయన ఆరోపించారు.

బెడిసికొట్టిన చిరు 'ఫిరాయింపుల' వ్యూహం

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేల మాదిరి, చిరంజీవి పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డిలు జై జగన్ అంటూ ఆయన వెంట తిరుగుతున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిపై పార్టీ ఫిరాయింపుల చట్టం వేటు వేయిద్దామని ప్రయత్నిస్తున్న చిరంజీవి వ్యూహం బెడిసికొట్టింది. చిరంజీవి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసేలోపే వారే ఎదురుదాడి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేయాలనే నిర్ణయం తమకు ఇష్టం లేకుండా జరుగుతుందంటూ ఆ లేఖలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు కాకపోయినా మున్ముందు పార్టీ ఫిరాయింపుల చట్టం వల్ల ఇబ్బందులు తప్పవని భావిస్తున్న వారు ఇప్పటికే తమ లాయర్లను రంగంలోకి దింపారు. తమకు ఇష్టం లేకుండా కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం అవుతున్న తరుణంలో ఆ చట్టం తమకు వర్తిస్తుందా? లేదా? ఒకవేళ వర్తిస్తే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? అనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు.

ఏ క్షణంలోనైనా కీలక ప్రకటన

పుట్టపర్తి: భగవాన్ సత్యసాయి బాబా చికిత్స పొందుతున్న పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. వీఐపీలు పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో భద్రత పెంచినట్టు పోలీసులు చెబుతున్నారు. పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నేడు పుట్టపర్తికి రానున్నారు. దుకాణాలను మూసివేయించారు. రహదారులను దిగ్బంధించారు. అధిక సంఖ్యలో పోలీసులను మొహరించడంపై భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోకి బాబా బంధువులు కంటతడి పెట్టుకుంటూ వెళ్లారు. సత్యసాయి ట్రస్టు సభ్యులు కూడా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఏ సమయంలోనినా బాబా ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. మరోవైపు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఈ ఉదయం 9.30 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. 11 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బాబా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు తెలిపారు.