‘బాబు’లో మార్పుకు లోకేష్ కారణమా ?
posted on Aug 14, 2012 @ 11:00AM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సహజ సిద్ధమైన తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. ప్రతీ అంశాన్నీ పరిశీలిద్దామనే బాబు ఒక్కసారిగా తేల్చి పారేస్తున్నారు. హఠాత్తుగా బాబులో వచ్చిన ఈ మార్పులు రాష్ట్రంలోని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాను తెలంగాణా ఇవ్వాలని లేఖరాస్తానని చంద్రబాబు ప్రకటించారు. దీని వెనుక అసలు రాజకీయ ఉద్దేశ్యం వేరేగా ఉందని ఆయన సన్నిహితులే అంటున్నారు. సీమాంధ్రలో వైకాపా అధినేత జగన్మోహనరెడ్డిని తట్టుకుని గెలవటం అసాధ్యమని చంద్రబాబునాయుడు 2012 ఉప ఎన్నికల ఫలితాల అనుభవంతో అంచనా వేస్తున్నారు.
దీన్ని తెలంగాణాలోనే భర్తీ చేయాల్సిన అవసరముందని బాబు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలకమైన పొలిట్‌బ్యూరో కూడా ఇదే అభిప్రాయానికి వచ్చింది. దీంతో బాబు కూడా తన పంధామార్చుకుని తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం ఇవ్వాల్సింది కాంగ్రెస్ కాబట్టి తమకేమీ నష్టం జరగదని అభిప్రాయానికి వచ్చారు. తాను ఒక లేఖరాసేస్తే పని అయిపోతుందని భావించిన చంద్రబాబు తెలంగాణాఓటర్ల కోసం తన నిర్ణయాన్ని మార్చేసుకున్నారు. ప్రతీపనీ ఆలస్యం చేసే బాబు తెలంగాణా ప్రత్యేకరాష్ట్రమే కాకుండా వర్గీకరణ చేయాల్సిందేననే డిమాండుతో ప్రజల ముందుకు రానున్నారు. ఏలాగూ వర్గీకరణ తన ప్రభుత్వ హయాంలో వచ్చిందే కాబట్టి ఇప్పుడు మాదిగలను సిద్ధం చేసుకుంటే 2014ఎన్నికల్లో బీసీలు, ఎస్సీల్లో మాదిగలు కష్టపడి పని చేస్తారని తెలుగుదేశం ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చింది. అలానే ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే చర్చించేయాలని చంద్రబాబు పొలిట్‌బ్యూరోను కంగారుపెడుతున్నారట. బాబు నిజంగానే మారిపోయారా? అన్నట్లుగా ఆయన తీరుందని ఆ పార్టీనేతలే చెబుతున్నారు. అయితే బాబును నడిపిస్తున్నది మాత్రం ఆయన కుమారుడు నారా లోకేశ్ అంటున్నారు. ఈ మార్పు లోకేశ్ మార్కు కావచ్చని తెలుగుదేశం పార్టీ శ్రేణులంటున్నాయి.