చంచల్‌గూడా చేరుతున్న కిరణ్ క్యాబినేట్
posted on Aug 14, 2012 @ 10:30AM
జగన్ అక్రమాస్తుల కేసులో ఒక్కొక్కటిగా ‘నిజాలు’ వెలుగు చూస్తుంటే ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం వేయటం లేదంటే నిజంగా ఆశ్చర్యపోవల్సిందే...! వైఎస్ పాలనలో ఇబ్బడి ముబ్బడిగా విడుదల చేసిన జీవోలు రాష్ట్ర సంక్షేమం కోసం కాదనీ, కేవలం పుత్రప్రేమతో చేసిన సంతకాలేననీ సిబిఐ రుజువులతో నిరూపించే ప్రయత్నాలు చేస్తుంటే... ఏదో ఒక క్షణంలో మంత్రులు కూడా బోనెక్కుతారని అందరూ ఊహించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసిన సిబిఐ సోమవారం నాలుగో ఛార్జిషీటు దాఖలు చెయ్యడంతో మరోమంత్రి ముద్దాయయ్యారు.
‘నిన్న మోపిదేవి... నేడు ధర్మాన... మరి రేపు ఎవరో...’ అంటూ ఎవరికివారే అంచనాలు వేసేసుకుంటున్నారు. మోపిదేవి ఇప్పటికే చంచల్‌గూడా చేరుకున్నారు, నేడోరేపో ధర్మాన కూడా అరెస్టవుతారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే... వైఎస్ హయాంలో మంత్రులుగా చేసిన వారందరి ఆస్తులూ, అప్పుల చరిత్రపై నిశిత అధ్యయనం ఇప్పటికే ప్రారంభ మయ్యిందన్న గుసగుసలుకూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ విచారణపర్వం ఇలాగే కొనసాగుతూ రాబోయే కొద్దినెలల్లో కిరణ్ క్యాబినేట్‌ను చంచల్‌గూడాకు చేర్చడం ఖాయమంటూ దేశం వర్గాలు జోస్యం చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలతో అటు వైఎస్‌ఆర్‌సిపి, ఇటు కాంగ్రెస్ సతమతమౌతూ మంత్రుల సమీక్షాసమావేశాలు చంచల్‌గూడాలోనే జరుపుకోవల్సిన స్థితికి చేరుకున్నామంటూ దేశం వర్గాలు విమర్శనాస్త్రాలు సంధిస్తోంది...! ‘పిల్లుల మధ్య రొట్టెముక్క తగాదా’ కథను గుర్తు తెచ్చుకుంటూ సందట్లో సడేమియాగా 2014 ఎన్నికల్లో తాము అధికారం కైవసం చేసుకోవడం ఖాయమని దేశం వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి...!