సత్తిబాబును ఎలా కంట్రోల్ చేయాలబ్బా !
posted on Aug 13, 2012 7:57AM
ఆధిపత్యం చెలాయించాలంటే అవతలవాళ్లని మాట్లాడ నీయకుండా చేయటమే కరెక్టని చాలా మంది అనుకుంటారు. ఇది రాజకీయనాయకులలో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్డర్లు జారీ చేస్తుంటారు. ఎలాంటి చర్చకు తావులేకుండా ఏక పక్ష ప్రకటనలు చేస్తుంటారు. అందులో అందవేసిన చెయ్యి పిసిసి ప్రసిడెంట్ బొత్స సత్యనారాయణది. అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఇందిరమ్మ బాట సందర్బంగా పార్టీకార్యకర్తల సమావేశం జరిపించి నువ్వేం చెబుతావ్.. ఇంకా ఏమిటి చెప్పేది... ఎంత సేపు మాట్లాడతావ్.. అంటూ కార్యకర్తలను మాట్లాడనీయకుండా సమావేశం ముగించేశారు. ఇదే తంతుగా ఇప్పుడు బిసి విద్యార్దుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ సబ్‌కమిటీ సమావేశంలో కూడా ఎవరినీ మాట్లాడనీయకుండా పూర్తి స్ధాయి ఆధిపత్యం చెలాయించే దోరణి కనబరిచారని సబ్‌కమిటి సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజు రీ ఎంబర్స్‌మెంటుకు 31 వేలకు మించి ఇవ్వలేం. అంతకు మించి ఇవ్వాలంటే ప్రభుత్వంపై భారం పడుతుంది.
దాన్ని భరించలేం. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి ఏమాత్రం బాగోలేదు అంటూ హడావిడి చేసి జనం కోసం మాత్రం పీతాని సత్యనారాయణను పిలచి మీడియాకు వివరించమని పురమాయించడం తమకు దిగ్రాంతి కలుగచేసిందని కమిటీ సభ్యులు వాపోతున్నారు. తర్వాతి రోజు ఫీజులను ఇదివరలో మాదిరిగానే ప్రభుత్వం భరిస్తుందని, కుదిస్తే అంగీకరించడం కుదరదని డిల్లీలో సత్తిబాబు ప్రకటన చేయడం ముఖ్యమంత్రిని ఇబ్బందికి గురిచేయడంకోసమేనని కిరణ్‌వర్గీయులు చెబుతున్నారు. ఇంతకు ముందు కేంద్రప్రభుత్వం రిలయన్స్ గ్యాసును మహారాష్ట్రలోని రత్నగిరికి కెటాయించినప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు గ్యాసు తేలేనందుకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రిని ఇరకాటం పెట్టారు. తెరవెనుక ఒకలా, తెరపైన మరోలా మాట్లాడుతూ బొత్ససత్యనారాయణ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారని ముఖ్యమంత్రి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్తిబాబును కంట్రోల్ ఎలా చేయాలో తెలియక వారు సతమతమవుతున్నారు.