రెడీమేడ్ కార్యకర్తలతో వైకాపా రెడీ?
posted on Aug 14, 2012 @ 10:33AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాల్లోనూ బలమైన శక్తిగా ఎదుగుతోందన్న విషయం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ గుర్తించారు. అయితే ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి కూడా రాజకీయ వంశానికి చెందిన వారికే ప్రాథాన్యత కల్పిస్తున్నారని ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. అంటే రెడీమేడ్‌గా మనం బట్టలు కొన్నట్లే రెడీమేడ్‌గా కార్యకర్తలున్న నాయకులను పార్టీలో చేర్చేసుకుంటున్నారన్న విషయం తేటతెల్లం అవుతోంది.
తాజాగా పీజెఆర్ కుమార్తె విజయ వైకాపాలో చేరారు. ఈమెతో పాటు కార్యకర్తలూ వలస వచ్చారు. పీ జనార్థనరెడ్డికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మథ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేది. అటువంటిది విజయ రెండుసార్లు జగన్ కోసం చంచల్‌గూడా జైలుకు వెళ్లారు. ఆ తరువాత విజయమ్మ సమక్షంలో వైకాపా తీర్థం తీసుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే కార్యకర్తల సమీకరణలోనూ, ప్రాంతాల వారీగా కలవాల్సిన వ్యక్తుల డైరీనీ విజయ సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. తెలంగాణాలో పీజెఆర్ అన్న పేరుకే ఒక ముఖ్యమంత్రికి ఇచ్చినంత విలువ ఇచ్చేవారు. ప్రజాసమస్యలపై ఆయన గళం ఎత్తాడంటే రాష్ట్రముఖ్యమంత్రి అయినా ప్రతిపక్షనాయకుడైనా హడలిపోవాల్సినంత వేగంగా చర్యలు తీసుకునేవాడు.
పీజెఆర్ మరణం తరువాత కాంగ్రెస్‌లో అటువంటి తెలంగాణా నేత లేడని ఇప్పటికీ కేంద్ర నాయకత్వం గుర్తుచేసుకుంటూనే ఉంటుంది. పీజెఆర్ కుమార్తె వైకాపాలో చేరటం ఒకరకంగా టిఆర్‌ఎస్‌కు మింగుడుపడని విషయం. ఎందుకంటే తెలంగాణాలో ఈమెకు ఉండే ఫాలోయింగు టిఆర్‌ఎస్‌కు ఎదురుగాలివంటిదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయలాగ ఉండే నాయకులకే పెద్దపీట వేయాలని, వలసతో పాటు పార్టీ బలోపేతం అయ్యే ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోకూడదని వైకాపా భావిస్తోంది. అందుకే వలస నాయకుల చేరిక కోసం ఎదురుచూస్తోంది.