బి.సి.లకు దూరమవుతున్న కాంగ్రెస్
posted on Aug 13, 2012 8:00AM
రాష్ట్రంలోని బిసి ఓటర్లను ఆకట్టుకుంటానికి తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో 100 సీట్లు, వారి సంక్షేమానికి రూ.10,000 వేల కోట్లు ప్రకటించి ముందంజలో ఉంది. వైసిపి పార్టీకి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి ఓటర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిసిలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయకుండా వారికి ఫీజురీఎంబర్స్‌మెంటును పాక్షికంగా మాత్రమే చెల్లిస్తాననటం రానున్న ఎన్నికలలో బిసిలను దూరం చేసుకోవడమేనని పలువురు అధికార నేతలు ఆందోళన చెందుతున్నారు. ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఏర్పడ్డ మంత్రుల ఉప సంఘం కూడా అన్ని వర్గాలను కలుపుకు పోవాలని నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తుందని చెబుతున్నారు. ఇంజనీరింగ్ విద్యలో ఏకీకృత ఫీజువిధానం అమలులోకి తేవాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో ఫీజు రిఎంబర్స్‌మెంట్ చెల్లింపులపై గత కొద్దిరోజులుగా రాష్ట్ర సర్కార్ మల్ల గుల్లాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పీతాని సత్యనారాయణ నేతృత్వంలో ఒక ఉపసంఘం వేసింది. ఈ ఉపసంఘం ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ కోటాకింద విద్యార్ధులు చెల్లించే ఫీజును 31 వేలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మిగాతాది బ్యాంకు రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనితో అధికార కాంగ్రెస్ పార్టీ లోని బిసి నాయకులు, సీనియర్ నాయకులు భగ్గుమంటున్నారు. బిసి వ్యతిరేక విధానాల వల్ల రానున్న ఎన్నికలలో బిసి ఓటర్లు కాంగ్రెస్‌కు దూరం అవుతారని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.