జగన్ శిబిరంలో నిరుత్సాహాం?
posted on Aug 11, 2012 @ 10:53AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చేస్తాడని ఆ పార్టీ నేతలు ఆశలు పెంచుకున్నారు. సుప్రీంకోర్టులో తన అరెస్టుపై సిబిఐను సవాల్ చేస్తూ జగన్ దాఖలు చేసిన కేసును ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీంతో ఆ పార్టీ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు. అంతేకాకుండా ఇకపై నియోజకవర్గాల్లో ఎలా నెగ్గురావాలన్న ఆలోచనల్లో పడ్డారు. జగన్ కనుక బయటకు వస్తే పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహంతో నింపాలని పలుప్రణాళికలు వేసుకున్న వారికి సుప్రీం తీర్పు శరాఘతంలా తోచింది. అందుకే దీనిపై వ్యాఖ్యానించటానికి కూడా మీడియా ముందుకు రాలేదు.
ప్రత్యేకించి ఏలూరులో విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ గురించి ధర్నా చేస్తామని ప్రకటించిన వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఒక్కరోజు తన కార్యక్రమం వాయిదా వేసుకోవటానికి కారణం జగన్‌కేసు అని తెలుస్తోంది. ఆమె అనుకున్నట్లు తన కుమారుడు ఇంటి వచ్చేస్తే తాను ధర్నా విజయవంతం చేసి జగన్‌ను గొప్పగా చూపాలని ప్రణాళిక వేసుకున్నారు. తీరా చూస్తే సుప్రీం కోర్టు కేసును డిస్మిస్ చేయటంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారని సమాచారం. ఏదేమైనా జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ కొంత పట్టుదలగా వ్యవహరిస్తోంది. తన కాల్‌లిస్టు విషయంలో జోక్యం చేసుకున్నందుకు జెడి లక్ష్మినారాయణ కూడా కేసును సీరియస్‌గా తీసుకున్నారని తెలుస్తోంది.
రాష్ట్రప్రభుత్వం సహకరించకపోయినా సమాచారహక్కు చట్టాన్ని ఆయన ఉపయోగించుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటి దాకా లేని ఒక కొత్త అంశం వైకాపాను వేధిస్తోంది. ఒకవేళ అక్రమాస్తులు సేకరించారన్న పూర్తి ఆధారాలతో జగన్‌కు శిక్షపడితే తమ పార్టీ భవిష్యత్తు ఏమిటనేది నేతలు ఆలోచిస్తున్నారు. దీని గురించి ఇటీవల కార్యకర్తల అభిప్రాయాలు కూడా పార్టీ నేతలు సేకరిస్తున్నారట. అయితే వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఎంత కాలం పార్టీ గురించి పని చేయగలరన్న అంశంపై కూడా పార్టీలో అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో, తమ పార్టీ భవిష్యత్తు ఏమిటో అర్థం కాక వైకాపా నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు.