మంది సొమ్మును మొబైల్ కంపెనీలకు దోచిపెడతారా?
posted on Aug 13, 2012 8:04AM
అమ్మకు అన్నంపెట్టలేని వాడు పిన్నమ్మకు చీరపెడతానన్నాడని సామెత. ద్రవ్వోల్బణం అరికట్టలేని కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు నిత్యావసర సరుకుల రేట్లను అందుబాటులో ఉంచటం లేదు. పెట్రోలు, పాలు, గ్యాసు, కరెంటు ,రోడ్లు, ఉచితవిద్య, ఉద్యోగాలు ఏమీ ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు సెల్‌పోన్లు ఇవ్వాలని యోచిస్తోంది. మంది సొమ్ము మొబైల్ కంపెనీలకు దోచిపెడటం అంటే ఇదే. యుపిఎ గవర్నమెంట్ ఇప్పటికే 2 జి స్కామ్‌లో ఇరుక్కున్నా బుద్ది వచ్చినట్లులేదు. కోట్లాది రూపాయలు మొబైల్ కంపెనీలకు ధారాదత్తం చేసే మరో కార్యక్రమం చేపట్టారు. 65 సంవత్సరాల స్వతంత్య్ర దేశంలో సామాన్య ప్రజలకు తాగునీరు కనీసం మూడు పూటలు గడిచే మార్గం లేక నానా అవస్తలు పడుతున్నారు.
వాళ్లను ఆదుకునేది పోయి రోజుకు 17 రూపాయలు సంపాదించేవారు పేదవారు కాదన్నారు. పాలు, పంచదార, ఉప్పుతో సహా అన్ని రేట్లు పెరిగినా కేంద్రం నిస్సహాయంగా నిలవడం తప్పమరేమీ చెయ్యలేకపోవడం సామాన్యుడిని ఆవేదనకు గురిచేస్తుంది. పెరుగుతున్న ధరల గురించి, పన్నులు గురించి యువతను విద్యావంతులను చేయటం కాని వారికి ఉద్యోగ భద్రత గాని పెంచకుండా ఏం మాట్లాడాలని సెల్‌ఫోన్లు పంచుతారో తెలియడం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి.ప్రజల్ని మబ్య పెట్టే పనులు కాకుండా దేశ భవిష్యత్తుకు, ప్రజాశ్రేయస్సుకు ప్రాధాన్యతా పధకాలను చేపట్టాలని రాజకీయ మేధావులు కోరుతున్నారు.