గంజాయి దొంగలు దొరకరా?
posted on Aug 11, 2012 @ 10:42AM
గంజాయి దొంగలను పట్టుకోవటమే మరిచిపోయిన ఎక్సయిజ్ చాలా కాలం తరువాత అరెస్టు చేసి కోర్టుదాకా వారిని తీసుకువెళ్లింది. ఇంత వరకూ బాగానే ఉంది కోర్టు ముందుకు వచ్చాక ఎక్సయిజ్ సిబ్బంది కళ్లు మూసుకున్నారు. అంతే కళ్లుతెరిచేలోపే దొంగలు పరారయ్యారు. రెండురోజుల పాటు వారికి కాసిన కాపాలా వృథా అయిపోయిందని ఎక్సయిజ్ సిబ్బంది తిరిగి గంజాయిదొంగల వేటకు బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరులో సంచలనమైంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంజాయిసాగు విస్తరిస్తోందని ఆరోపణల నేపధ్యంలో అక్కడి ఎక్సయిజ్ సిబ్బంది దాడులకు ప్రణాళిక వేసింది. దాని ప్రకారం గ్రామాల వారీ శోధన, తనిఖీలు చేస్తూ చివరికి గంజాయిదొంగలను గుర్తించింది. వీరు ఒడిశ్శాకు గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారాన్ని ఎక్సయిజ్ పోలీసులు ధృవీకరించుకున్నారు. వెంటనే వీరిని పాడేరు ఎక్సయిజ్‌పోలీసుస్టేషనుకు తీసుకువచ్చారు. దొంగల నుంచి విషయం రాబట్టి మరుసటి రోజు ఉదయం కోర్టుముందు హాజరుపరచాలని నిశ్చయించుకున్నారు. వీరు అనుకున్నట్లే కోర్టుదాకా గంజాయిదొంగలను తీసుకువెళితే వారు అక్కడ అదును చూసుకుని ఉడాయించారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఎక్సయిజ్ సిబ్బంది గత్యంతరం లేక తిరిగి గంజాయి దొంగల గురించి వేట కొనసాగిస్తున్నారు.