టిటిడి డిక్లరేషన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు
posted on Aug 14, 2012 @ 11:29AM
అన్యమతస్తులు తిరమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో స్వామివారిపై తమకు నమ్మకముందని డిక్లరేషన్‌ను తప్పని సరిచేస్తూ టిటిపి చేసిన నిర్ణయం అనేక విమర్శలకు తెరతీసింది. రోజుకు వేలమంది దర్శించుకునే తిరుమలలో ఎవరు ఏ మతస్తులో ఎవరికి తెలుసు.....అయినా దర్శించుకొనేందుకు వస్తున్నారంటేనే నమ్మకంతోనే కదా... మన దేశం లౌకిక రాజ్యం దీనిలో ఎవరు ఏమతాన్ని అయినా అనుసరించే స్వేచ్చ ఉంది. అయినా సాక్షాత్తూ స్వామి వారే బీబీ నాంచారిని పరిణయమాడి లౌకిత్యాన్ని చాటితే పర మతస్తులకు డిక్లరేషన్ ఏమిటి దీన్ని రాజకీయ నాయకుల కోసమే ప్రయోగిస్తున్నారని మరీ ముఖ్యంగా వైసిపి నేత వైయస్ జగన్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత జరిగిన పరిణామంలో ఈ డిక్లరేషన్‌ను తెరపైకి తెచ్చారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దర్శనంతోరాని డిక్లరేషన్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని వారు అడుగుతున్నారు. వాస్తవానికి ఈ నిర్ణయం 1997 లోనే ఉన్నా ఇప్పుడు అమలు చేయవలసిన అగత్య మేమిటని లౌకిక వాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు కుల, మత బేధాలు లేకుండా సహజీవనం చేస్తున్నప్పుడు ఇలాంటి సున్నితమైన అంశాలను లేవనెత్తకూడదని అంటున్నారు. ప్రజలకు సమస్యలున్నంత వరకు దేవుళ్లు ఉంటారు. వారి సమస్య పరిష్కారం కోసం ఏ దేవుడిదగ్గరకైనా వారు వెళ్లవచ్చు. అమితాబచ్చన్ లాంటివారే తిరుపతిని దర్శించారు. కడపలోని దర్గాను దర్శిచారు. చాలా మంది హిందువులు దర్గాలకు కూడా వెళుతుంటారు. ఇలాంటి వారి మద్య మతాలకు సంబందించి చిచ్చుపెట్టకూడదని ప్రజలు కోరుతున్నారు. అలాగే రాజకీయనాయకులు ఓటర్లను ఆకర్షించడానికి గానూ అన్ని మతాలకు చెందిన మందిరాలను సందర్శిస్తారు. ప్రజలు కూడా ఎప్పుడూ వారిని తప్పు పట్టలేదు. అన్ని మతాలకు సంబందించిన వారు ఓట్లు వేయడం ద్వారానే వారు వారి నియోజక వర్గాల్లో గెలుపు సాధిస్తారని మరచిపోకూడదు. దేవుడిని ప్రజలకు దగ్గరగా వుంచడమే తిరుమల దేవస్దానం లక్ష్యంగా వుండాలని ప్రజలు కోరుకుంటున్నారు.