రాష్ట్రంలో రోజుకు 10 మందిబాలికలు, 12 మంది మహిళల అదృశ్యం
posted on Aug 15, 2012 @ 10:42AM
మానవ అక్రమరవాణా రోజురోజుకూ పెరిగిపోతుంది. మరి ముఖ్యంగా బాలికలను, స్త్రీలను వ్యభిచార గృహాలకు అమ్మేవారి వల్ల వీరికి ముప్పు వాటిల్లుతుంది. మిసింగ్ కేసులకు సంబందించి రాష్ట్రపోలీసు శాఖ, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ సంయుక్తంగా జరిపిన సర్వేలో దిగ్రాంతికరమైన నిజాలు తెలిసాయి. 2009 నుండి 47,181మంది మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి దానిలో 16,787 బాలికలు, 12,882 మహిళలు. 2009లో కనిపించకుండా పోయిన వారిలో 66 శాతం మంది బాలికలే. ఈ సంవత్సరం జూలై వరకు కనిపించకుండా పోయిన వారు 2,786 మంది కాగా వారిలో 70 శాతం మంది బాలికలే వారి సంఖ్య 1,955 . అంటే ప్రతిరోజు సగటున 10 మంది బాలికలు అపహరణకు గురిఅవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సంవత్సరం జూలైవరకు 2,519 మంది స్త్రీలు తప్పిపోయిన కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజు 12 మంది స్త్రీలను అపహరిస్తున్నారని తెలుస్తుంది. గత నాలుగేళ్లనుండి 23,760 మంది కనబడకుండా పోయారు. ఇప్పటి వరకు వీరి జాడ తెలియలేదు. వీరిలో చాలా మందిని వేశ్యా గృహాలకు అమ్మి వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కనబడకుండా పోయిన వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియచేసేందుకు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించామని అడిషినల్ డైరెక్టర్ జనరల్ వియస్‌కె కౌముది తెలిపారు. స్ధానికంగా ఉండే పోలీస్ స్టేషన్‌లో గాని, స్వచ్చంధ సంస్థల సహకారం గాని తీసుకోవచ్చని వారు తెలిపారు. దీనిలో గుర్తింపబడని మృతదేహాల వివరాలను కూడా పొందుపరిచారు. ఇంటినుండి తప్పిపోయి లేదా తప్పించుకొని వచ్చిన పిల్లలను రైల్యే పోలీసుల లేదా స్వచ్చంధ సంస్థల ద్వారా చిల్డ్రన్స్ హోమ్‌కు గాని తల్లిదండ్రుల వద్దకు గాని పంపడం జరుగుతుంది. తప్పిపోయిన బాలబాలికల ఫోటోను, వివరాలను తమ దగ్గర ఉన్న ఫోటోలతో సరి పోల్చుకొని వారిని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుందని ఎడిజి కౌముది తెలిపారు.