జైపాల్` కిరణ్ మధ్య గొడవే లేదా ?
posted on Aug 14, 2012 @ 12:22PM
కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సిఎంగా రాబోయేది లేదని స్పష్ట మవుతున్నది. ఒకవేళ తెలంగాణను వివాదం లేకుండా ప్రకటిస్తే, వాటాల పంపిణీకి జైపాల్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించే అవకాశం ఉన్నది. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన అభిప్రాయం లేనిది ముఖ్యమంత్రిగా వచ్చే ప్రసక్తే లేదని గతంలోనే ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ విషయంలో కూడా జైపాల్‌రెడ్డి తనదైన పాత్రను పోషించి 11 నెలల పాటు అనధికారికంగా గత నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టి, ప్రధాని సమీక్షకు పంపారు. ఈ కారణంగానే గ్యాస్ విషయంపై ప్రధాని జోక్యం చేసుకున్నట్లు తెలుస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం చాలా తక్కువ. ముఖ్యమంత్రిగా జైపాల్‌ను పంపించే అవకాశం ఒక ఐచ్ఛికమే తప్ప కచ్చితం కాదు. దీనిపై ముఖ్యమంత్రి భయపడాల్సిన పనిలేదని జైపాల్ సన్నిహితులు పేర్కొంటున్నారు. జైపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి విమర్శలు ఎదుర్కోవడం కొత్త కాదు.
రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి లేదా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సీటు కావాలని గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఆయన కోరారు. అయితే దీనిలో మేడ్చల్ నియోజకవర్గం మాత్రం అప్పట్లో వైఎస్సార్ ఇవ్వలేదు. జిల్లా రాజకీయాలను ఆయనకు వ్యతిరేకంగా క్రియేట్ చేశారు. ఇదే జిల్లా చేవెళ్ళ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో మేడ్చల్‌లో టికెట్ పొందని అభ్యర్థినే జైపాల్ ప్రతిపాదించారు. అయితే దీనికీ కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుపెట్టారు. రాష్ట్ర మంత్రి వర్గంలో హోంమంత్రి సబితారెడ్డి, జానారెడ్డి జైపాల్‌రెడ్డి నిర్ణయాన్ని సమర్థించినప్పటికీ కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త వ్యక్తిని రంగంలోకి తీసుకుని వచ్చి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డిపై జైపాల్‌రెడ్డి చేసింది ఏమీ లేదు. తాజాగా ముఖ్యమంత్రిగా జైపాల్ వస్తారేమోనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి అనుయాయుల వ్యాఖ్యలను జైపాల్‌రెడ్డి అనుయాయులు ఖండిస్తున్నారు.