త్వరలో వైసిపిలోకి గంగుల భానుమతి?
posted on Aug 14, 2012 @ 12:03PM
భాను చేతిలో హత్యకు గురి అయిన మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతి త్వరలో వైయస్సార్ పార్టీలో చేరుతున్నారని తెలిసింది. తన జిల్లా నాయకత్వంగాని, ముఖ్యమంత్రిగాని తనను పట్టించుకోక పోవడం వల్ల ఆమె వైసిపి కి ప్రాధాన్యత నిస్తున్నారని తెలిసింది. అలాగే సూరిని హత్య చేసిన భానుకు కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకలతో సంబంధాలు ఉండటం వల్ల బెయిల్‌పై బయటకు వస్తే భానుతో తనకు ప్రమాదం ఉందని ఆమె కలత చెందుతున్నారు. ఇదే విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆమె పలుమార్లు కలసి చర్చించినా సరైన హామీ లభించనందువల్ల ఆమె ఈ నిర్ణయానికి వచ్చారు. దీనితో రాయలసీమలో వైసిపి బలమైన పార్టీగా ఉన్నందువల్ల తనకు రక్షణగా ఉంటుందని ఆమె భావిస్తున్నారు. అంతేకాక తన పొలిటికల్ భవిష్యత్తుకు కూడా డోకా వుండదని గంగుల భానుమతి భావిస్తున్నారు. తనకున్న ఆస్తులను కాపాడుకోవాలంటే పదవులుండాలని, పదవులుండాలంటే భవిష్యత్ ఉన్న రాజకీయపార్టీలో ఉండాలని ఆమె ముందుచూపుతో వైసిపిలో చేరుతున్నారనుకోవచ్చు.