జగన్ పంచన చేరుతున్న వై.ఎస్. శతృవులు!
posted on Aug 14, 2012 @ 11:19AM
రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం గాని శాశ్వత మిత్రత్వం గాని ఉండదనేది పి.జానార్ధన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి వైసిపి కాంగ్రెస్‌లో చేరటంతో రుజువయ్యింది. బ్రతికన్నప్పుడు వైయస్సార్, పిజెఆర్ ఉప్పు నిప్పు గా ఉండేవారు. ముఖ్యమంత్రిగా వైయస్ నిర్ణయాలను పిజెఆర్ శాసనసభ సాక్షిగా వ్యతిరేకించి సభాసంఘాల కోసం పట్టుపట్టిన సంఘటనలు ఉన్నాయి. ఏలేరు కుంభకోణాన్ని వెలికి తీసి అసెంబ్లీలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడవేసిన సందర్బంలో పిజెఆర్‌కు ఎలాంటి సహాయ సహకారాలు వైయస్ అందించలేదు.
పిజెఆర్ కుమార్తె గృహప్రవేశం నాడు పిజెఆర్ కారు నిలచి ఉండటంతో దానివెనుక వెనుక వచ్చిన కారులో వైయస్ సోదరుడు వైయస్ రవీంద్రనాధ్‌రెడ్డి, అతనికుమారుడు కారు హారను మ్రోగించినప్పటికి కారు ప్రక్కకు తీయలేదని పిజెఆర్ అతని కుమారుడు ప్రస్తుత ఎమ్మేల్యే విష్ణువర్ధన్ రెడ్డిడి గొడవ జరిగింది. తమపై దాడి జరిగిందని వైయస్ సోదరుడు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ లో పిజెఆర్ అతని కుమారుడిపై ఫిర్యాదు చేశారు. ఫలితంగా జనార్దన్‌రెడ్డి, కుమారుడు విష్టువర్దన్ రెడ్డి, అతని అల్లుడు మహిపాల్‌రెడ్డిని అరెస్టు చేసి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పిజెఆర్ తన అనుచరులతో జూబ్లీ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వైయస్ సోదరుడు ఆయన కుమారుడిపై పిజెఆర్ భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైయస్ సోదరుడిని అరెస్టు చేయాలని ఆందోళన చేశారు. తనకు జరిగిన అన్యాయం పై ఏకంగా నిరాహార దీక్ష చేపడతానని కూడా ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాలపై కలత చెందిన కాంగ్రెస్ అధిష్టానం తన దూతలను పంపి ఆయన్ను సముదాయించింది. ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్‌నేత వి హన్మంతరావు మద్యవర్తిత్యం ఫలించింది.దాంతో ఆయన తన నిరాహార దీక్షను విరమించుకున్నారు. కొన్నాళ్లకు జనార్దన్‌రెడ్డి గుండెపోటుతో హఠాత్మరణం చెందారు. అయితే విజయారెడ్డి దానం నాగేందర్‌కు చెక్ చెప్పటానికే వైసిపిలో చేరారు.
దానం తన సోదరిని ఖైరతాబాద్ స్ధానానికి పోటీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి విజయా రెడ్డి వైసిపి గూటికి చేరుకున్నారు. ఒకప్పుడు వైయస్‌కు సన్నిహితంగా ఉండి ఆతరువాత వైరం పెరిగి తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపి అయిన మైసూరరెడ్డి సైతం ప్రస్తుతం వైయస్సార్ పార్టీలో కీలక స్ధానంలో ఉండటం విశేషం. ఇలా ఒకప్పటి వైయస్ శత్రువులంతా తిరిగి ఆయన కుమారుడి పార్టీలోకే చేరుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.