అధికారంకోసం చంద్రబాబు కొత్తపాట్లు!
posted on Sep 4, 2012 @ 5:10PM
ఒకనొకప్పుడు హైటెక్ ముఖ్యమంత్రి అని పిలిపించుకున్నారు. ఇప్పుడేమో అధికారం కోసం నానా అవస్ధలు పడుతున్నారు. తన తొమ్మిదేళ్ల పాలన ఓ అద్భుతమని ఆయన అనుకుంటున్నారు. అప్పటి కరువుకష్టాలను ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. అయితే ఇటీవల బీసి డిక్లరేషను ప్రకటించి ఆ కులసంఘాలను తనవైపుకు తిప్పుకోవటం ద్వారా 49శాతం ఓటుబ్యాంకు మళ్లిందని అభిప్రాయపడుతున్నారు. వందస్థానాల్లో అవకాశమిస్తానని ఆయన బీసిలకు ఇచ్చిన భరోసా కూడా ఫలవంతమవుతుందని ఆశిస్తున్నారు. తాను ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే 2012 ఉపఎన్నికల్లో పార్టీ ఘోరంగా వోడిపోయిందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.
అందుకని తాను, తన పార్టీ కార్యకర్తలూ ప్రజల్లో ఉండేందుకు 117రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటన 2014 ఎన్నికలయ్యేటప్పటికి మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందని తెలుగుదేశం శ్రేణులు కూడా నమ్ముతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీసబ్ప్లాన్పై దృష్టి సారించిన నేపథ్యంలో గిరిజనుల ఓటుబ్యాంకు సాధించుకునేందుకు ఈ పర్యటనను ఉపయోగించుకోనున్నారు. ప్రజల వద్ద 117రోజులు గడిపిన తరువాత బాబు రాష్ట్రస్థాయిలో బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అదీ జనవరి 14వతేదీ అని కూడా ప్రకటించారు. పనిలోపనిగా అన్ని జిల్లాల్లోనూ మినీమహానాడు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడుతున్నారు. మిగిలిన స్థానాల్లో 58నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించటం ద్వారా పార్టీని కూడా పట్టిష్టం చేయాలని బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏమైనా ఈసారి మా చంద్రబాబు పక్కా ప్లానింగ్తో పర్యటిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.