వైఎస్ఆర్సిపిలో ఉప్పునూతలను ఆకట్టుకున్నదేమిటో?
posted on Sep 4, 2012 @ 4:59PM
ఒకప్పటి శత్రువులు ఇప్పుడు మిత్రులై చెట్టాపట్టాలేసుకోవటం రాజకీయంలో షరా మామూలే అంటుంటారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి కూడా మినహాయింపుకాదు. ఒకప్పుడు వైఎస్ను వ్యతిరేకించేవారు. అసలు తెలంగాణా రాకపోవటానికి వైఎస్ఆర్ కారణమని చిటపటలాడిన వ్యక్తిగా పురుషోత్తమరెడ్డికి బాగా గుర్తింపొచ్చింది. అప్పట్లో వై.ఎస్ మీద అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడ్డ పెద్దాయన ఇప్పుడు పూర్తిగా మాటమార్చారు. అదే నోటితో తాను వైఎస్ హయాంలో చూసినంత అభివృద్థి మళ్లీ చూడలేదంటూ డంకా బజాయించి చెబుతున్నారు. ఉప్పునూతలకి మొదట్నుంచీ ఫీలింగ్స్ చాలా ఎక్కువ. అతిగా ప్రేమించడం, అతిగా ద్వేషించడం ఆయనకు అలవాటేనని ఆయన సన్నిహితులంటుంటారు.
ఇప్పుడు మళ్లీ వైఎస్ మీద పెద్దాయనకి బాగా ప్రేమపుట్టుకొచ్చిందేమో.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అందరూ లబ్ది పొందారని, అప్పటి సంక్షేమపథకాలు అన్ని వర్గాలకు మేలు చేశాయని, రాష్ట్రంలో ప్రస్తుతం పాలన స్తంభించిపోయిందని, తాను ఈ నెల 9న వైకాపాలో చేరనున్నానని, జగన్మోహనరెడ్డి సమర్ధవంతమైన నేతగా ఎదుగుతాడని ఉప్పునూతల ప్రకటించారు. మరి వైఎస్ బతికున్న రోజుల్లో ఆయన తెలంగాణారాష్ట్రం రాకుండా అడ్డుపడుతున్నారని, వైఎస్ అభివృద్థి నిరోధకుడని చేసిన ప్రకటనల మాటేంటి? అసలు ఉప్పునూతల జగన్ వర్గంలో చేరడానికి బలమైన కారణాలేంటోనని అంతా అనుకుంటున్నారు.
కేవలం జగన్మోహనరెడ్డి పిలుపు ఇచ్చారని ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక తెలంగాణావాదులు పట్టించుకోలేదని అలిగారా? కాంగ్రెస్లో ఉంటే టిఆర్ఎస్తో ఉండే దోస్తానా దెబ్బతింటోందనిపించిందా? వైఎస్సార్సీపీలో చేరితే ఈసారి ఎన్నికల్లో తేలిగ్గా విజయం సాధించేయొచ్చనా? ఏమో.. ఉప్పునూతల మనసులో ఉన్న మాటని ఆయనంతట ఆయన బైటపెడితేతప్ప కనుక్కోవడం చాలా కష్టమే.