చదువులతీరు మారాలి!
posted on Sep 8, 2012 @ 7:10PM
కొత్తకాపురానికి వెళ్ళే కూతురుకు అత్త, ఆడపడుచులతో జాగ్రత్తగా మసలుకోమని అమ్మ చెప్పి పంపిస్తుంది. ఒకప్పుడు కొత్తగా కాపురానికి పంపించే కూతుళ్లకి పండంటి కాపురానికి పదో, పన్నెండో సూత్రాలుచెప్పి పంపించేవాళ్లు. ప్రస్తుతం రాష్ట్రంలో వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న విద్యార్ధుల పుణ్యం పుచ్చి సర్కారు వాళ్లక్కూడా ఈ సూత్రాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. అందుకోసం భారీ ఎత్తున కసరత్తుకూడా జరుగుతోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్ధుల్లో వృత్తినైపుణ్యాన్ని, ఇంజనీర్లలో నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి కృషిచేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ ఐటీఈఎస్ పరిశ్రమల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై ఇట్స్‌ఏపీ ప్రభుత్వానికి పది సూత్రాలతో ఓ ప్రణాళికను అందజేసింది. ఇవి సరిగ్గా అమలయ్యేలా చూస్తే, రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు, విద్యార్ధులకు మంచిరోజులు వచ్చినట్టే. భావి ఇంజనీర్లలో వృత్తినైపుణ్యం పెంచాలన్న ప్రభుత్వాశయం నిజంగా మెచ్చుకోదగిందే. ఎందుకంటే.. ఇప్పటివరకూ టెక్నికల్ చదువు తెలివితేటలమీద కాక, ర్యాంకులు, డొనేషన్ల మీద మాత్రమే బతుకుతోంది. వీలైతే ఈ సూత్రాన్ని కేవలం ఇంజినీరింగ్ విద్యకి మాత్రమే కాదు.. కిందిస్థాయినుంచి అన్ని తరగతులకూ వర్తింపజేయాలని రాష్ట్రంలో పిల్లల్ని చదివించుకుంటున్న తల్లిదండ్రులంతా కోరుకుంటున్నారు. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని, విద్యార్ధుల భవిష్యత్‌కై రూపొందించిన ఇలాంటి ప్రణాళికలు, విధానాల్ని నిజాయితీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.