కిరణ్ కి జలగండం?
posted on Sep 4, 2012 @ 4:51PM
శ్రీశైలం నీటిని విడుదల చేస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన కర్నూలు పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి తన డిమాండును నెరవేర్చుకోవటంలో విజయం సాధించారు. ఆయన పట్టుదలకు సిఎం కిరణ్కుమార్రెడ్డి తలొగ్గారు. అలానే నాగార్జునసాగర్ నీటిని డెల్టాకు వదలొద్దని లేఖ రాసిన నల్గొండ జిల్లా పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేంద్రరెడ్డి, సిఎం స్పందిస్తారని ఎదురుచూస్తున్నారు. డెల్టాకు నీరివ్వకపోతే మేమెలా పంట వేయాలని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రైతులకు మద్దతుగా దీక్షలు చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తదనుగుణంగా పాచికలు కదుపుతోంది. తాజాగా మాజీ మంత్రి మండలి బుద్ద ప్రసాద్ అవనిగడ్డలో కృష్ణా డెల్టా నీటికోసం నిరవధిక దీక్ష ప్రారంభించారు. అయితే సిఎం మాత్రం కృష్ణా నీటితగవులు తీర్చలేక ఇదేం జలప్రళయంరా నాయనోయ్.. అంటూ తలపట్టుకుని కూర్చుంటున్నారు. ఒకవైపు రాజీనామాలు, మరోవైపు దీక్షలు కిరణ్ తలకు బొప్పికట్టిస్తున్నాయి. ఇవి చాలక తెలుగుదేశం పార్టీ నేతలు తాము రైతుల పక్షాన నిలబడ్డామని నిరూపించుకునేందుకు కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేయాలన్న డిమాండుతో చేస్తున్న ఆందోళన కిరణ్ కుమార్ రెడ్డికి మరింత తలనొప్పిగా మారింది. కిరణ్ పరిస్థితి ఇప్పుడు ముందునుయ్యి వెనక గొయ్యిలా తయారయ్యింది.