కాంగ్రెస్ లో కుల సమీకరణాలు?
posted on Sep 4, 2012 @ 5:04PM
కాంగ్రెస్ పార్టీ కులసమీకరణల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నతస్థాయి మార్పులు తప్పవంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం కదలకపోయినా డిప్యూటీ సిఎం, పీసిసి అధ్యక్ష స్థానాలు కొత్తగా కుల సమీకరణల ఆధారంగానే మారబోతున్నాయి. ఇప్పటి దాకా బీసిల్లో మంచి పట్టున్న పీసిసి చీఫ్ బొత్సా సత్యన్నారాయణని ఉప ముఖ్యమంత్రి పదవి వరిస్తుందన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయ్. ఇదేగనక నిజమైతే ఓ రెడ్డి, ఓ బీసి రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చాటింపేసుకునే అవకాశం కాంగ్రెస్ కి దొరుకుతుంది. రెడ్డికులానికి కాంగ్రెస్ కొమ్ము కాస్తోందంటూ కాపులనుంచి వినిపిస్తున్న విమర్శల్ని తిప్పికొట్టేందుకు చిరంజీవికి కేంద్ర మంత్రిపదవి ఇవ్వొచ్చనే ఊహాగానాలుకూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. పీసిసి చీఫ్ పదవికి మంత్రి కన్నా లక్ష్మినారాయణను ఎంపిక చేయొచ్చని మరో ప్రచారం జరుగుతోంది. డెప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క కూడా ఈ రేసులో ఉన్నారు. ఒకవైపు రెడ్డి సామాజికవర్గాన్ని సంతృప్తిపరుస్తూనే రెండోవైపు కులాల ఆధారంగా మార్పులు చేసి 2014 నాటికి తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకొన్ని మార్పులు చేర్పులుకూడా ఉండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.