చూడు.. చూడు.. రాజధానిలో రోడ్ల తడాఖా!
posted on Sep 8, 2012 @ 6:53PM
సంపూర్ణ ఆరోగ్యవంతులకు సవాల్! ఇదేమిటి అనుకుంటున్నారా! నాకు ఇప్పటివరకు వళ్ళునొప్పులంటే ఎరుగను...అని ఎవరైనా సవాల్ చేస్తే.. వెంటనే మన రహదారులపై ప్రయాణించమనండి... భవిష్యత్‌లో మళ్ళీ అటువంటి సవాల్ చెయ్యరు... ఇదీ మన రహదారుల తడాఖా!
రాష్ట్రంలో రహదారుల వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు వాటి ఆనవాళ్ళు కోల్పోతున్నాయి. సాధారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులు మరమ్మతులు చేయాలన్నా, కొత్త రోడ్లు వేయాలన్నా వర్షాకాలం రాకముందే పని చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్ అండ్ బి మాత్రం అందుకు విరుద్ధంగా వర్షాకాలం మొదలైన తర్వాత కొన్ని జిల్లాల్లో మరమ్తతులు, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టింది. రాజధానిలో రోడ్ల పరిస్థితి గురించి ఆయా అధికారులను కదిలిస్తే జీవవైవిధ్య సదస్సు జరిగే సమయానికి కొత్త రోడ్లు వేయాల్సి ఉందని, అందుకే ఇప్పుడు వేయటం లేదని సమాధాన మిస్తున్నారట. కనీసం రోడ్లకు మరమ్మతులైనా చేస్తే పరిస్థితి కొంతవరకైనా మెరుగుపడే అవకాశం ఉంటుంది. గుంతలు పడిన రోడ్లపై ప్రయాణిస్తున్నవారిలో కొందరికి నడుం నొప్పి వస్తుంటే, ఇంకొందరు వెన్నెముకలోని డిస్క్‌లు దెబ్బతింటున్నాయి. 25`30 సంవత్సరాల మధ్య వయసు వారు ఎక్కువగా నడుంనొప్పితో తన దగ్గరికి వస్తున్నారంటూ ఓ ఆర్థోపెడిక్ వైద్యుడు తెలిపారంటే రహదారుల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ప్రతీదీ వ్యాపారం అయిపోయింది. రోడ్లేయడంకూడా వ్యాపారమే. వర్షాకాలంలో రోడ్లేస్తారు, సీజన్ పూర్తయ్యేసరికి ఆ రోడ్లు కనిపించకుండా పోతాయ్. మళ్ళీ టెండర్లు గట్రా మామూలే.. మళ్ళీ వర్షాకాలంలోనే కొత్త రోడ్లొస్తాయ్. బ్రిటీషోళ్లేసిన వందల యేళ్ళనాటి వంతెనలు నేటికి చెక్కుచెదరకుండా ఉంటే కొత్తగా కట్టిన వంతెనలు మాత్రం కుప్పకూలుతున్నాయ్. మన రోడ్లమీద గర్బిణీ ఆసుపత్రికి బయలుదేరితే.. దారిలోనే ప్రసవమైపోతుంది. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే నేతలు కనిపించినట్టు, వర్షాకాలంలోనే వర్షాకాలంలో మాత్రమే రోడ్లేసేవాళ్లు కనిపిస్తారు. ఆ తర్వాత పరిస్థితి మళ్ళీ మామూలే! ప్రభువులు అలాగే ఉంటారు. ప్రజలు ఇలాగే బాధలు పడుతుంటారు. రోడ్లు కనిపించినంత కాలం కనిపించి మాయమైపోతుంటాయ్.