రాజీనామా వాపస్ తీసుకోవాలని డిమాండ్ ...

మహారాష్ట్ర రాజకీయాలు చాలా వేడిగా సాగుతున్నాయి ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసిన తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశమైన ఎన్.సి.పి. లెజిస్లేచర్ పార్టీ ఇరవై నిముషాల్లోనే ఒక నిర్ణయానికి వచ్చింది. పవార్ రాజీనామా లేఖను ఉపసంహరించుకోవాలని ఈ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేల మనోభావాల ఎన్.సి.పి. అధ్యక్షుడు శరద్ పవార్ కు తెలియజేయాలని నిర్ణయించారు. అజిత్ పవార్ రాజీనామాపై నిర్ణయాన్ని శరద్ పవార్ కే వదిలేయాలని ఎన్.సి.పి. నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీ రాజ్ చవాన్ ఇంకా రాజీనామాను అంగీకరించలేదు. విద్యాభవన్ లో జరిగిన సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేలు. 9 మంది ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు.  అటు పృథ్వీరాజ్ చవాన్ తన నివాసంలో కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి పరిస్థితిని సమీక్షించారు.

శ్మశానంలో నిద్ర.... స్థలం వచ్చేనా...!

  తిరుపతిలో పద్మావతీపురం, లక్ష్మీపురం, శ్రీనివాసపురం ప్రాంతవాసులకు సరైన శ్మశానం లేదు. ఈ ప్రాంతంలో దాదాపు 60వేలమంది నివసిస్తున్నారు. శ్మశానవాటికకోసం స్థలం కేటాయించాలంటూ తిరుపతి ఎం.ఎల్‌.ఎ. భూమాన కరుణాకరరెడ్డి ఓ రాత్రి శ్మశాననిద్ర చేపట్టారు. బతికుండగా బారెడు జాగా ఇవ్వలేని ప్రభుత్వం, చనిపోయాక శవాన్ని పూడ్చటానికి కూడా జానెడు స్థలం చూపడం లేదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి మరిన్న ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ శ్మశానం నిద్రకుపక్రమించి నిరసన తెలపడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం రాజకీయనాయకుడంటే ఏమైనా చేయవచ్చు. ఏదైనా చేయించవచ్చు. అది ప్రజలకోసమైనా.. తనకోసమైనా... శ్శశానవాటికకు స్థలంకోసం భూమాన శ్మశాననిద్ర విజయవంతమై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆశిస్తున్నారు స్థానికులు.

ఇది మంచికా.. చెడుకా..!

  మనిషిలో అలసత్వం వుంటే అది అతన్నే బాధపెడుతుంది. కాని ప్రభుత్వాలకు, పాలకులకు, సంస్థలకు అలసత్వం ఉంటే అది జాతినేకాదు, దేశాన్ని కూడా బాధపెడుతుంది. అందరూ భారతదేశంవైపు చూస్తుంటే... భారతదేశం విదేశాల వైపు చూస్తుంటుంది. ఇటీవల భారతదేశంలోకి పిల్లల ఆటబొమ్మలు మొదలు ఎన్నో చైనా వస్తువులు భారతదేశ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వాటి తాకిడికి ఎంతోమంది చిన్నవ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు కూడా పడ్డారు. ఇప్పుడు కొత్తగా శవపేటికలను దిగుమతి చేస్తోంది. కేరళ అలప్పౌజా జిల్లాకు చెందిన ఓ కంపెనీ చైనాలోని షాంఘైకి చెందిన ఓ శవసేటికల తయారీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. దానికనుగుణంగా ‘స్వర్గపెట్టె’ అని పిలిచే 170 శవపేటికలు కేరళకు వచ్చాయి. ఈ శవపేటికలను పౌలోనియా అనే చెట్టు కలపతో తయారుచేయడం వల్ల గట్టిగా, పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు దీన్ని దిగుమతి చేసుకున్న కంపెనీ యాజమాని. ఇప్పటికే అలవాట్లతో సహా ఎన్నో విదేశాల నుండి ఎగుమతులు చేసుకుంటుంటే..... మనిషి ఎంతో ప్రధానమైన చావు, పుట్టుకల్లో పుట్టినరోజు వేడుకల్లో ఇప్పటికే పలు విదేశీ వస్తువులు దర్శనమిస్తుంటే చివరకు మరణానికి సంబంధించి విషయాల్లో కూడా విదేశీ వాడకాన్ని వదలలేకపోవడం మంచికో.. చెడుకో..!

సమరానికి సిద్దమవుతున్న పోలీస్‌ శాఖ

  రాష్ట్రంలో భద్రత నానాటికీ కొరవడుతోంది. అసలు ఈ పదం ఉచ్చరించటానికే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ముందుగా కేంద్ర సంస్థలను హెచ్చరించగల స్థాయికి ఇంకా పోలీసువిభాగం ఎదగలేదు. ఓ గోకుల్‌ఛాట్‌, ఓ ఛార్మినార్‌ వంటి అనుభవాలు నుంచి రాష్ట్ర పోలీసు శాఖ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవటం లేదు. దీంతో కేంద్రశాఖలు ఎప్పటికప్పుడు స్పందించాల్సి వస్తోంది. పలానా కార్యక్రమాలకు ఎందుకు భద్రత లేదని ప్రశ్నించి హెచ్చరించాల్సిన స్థితి తప్పటం లేదు. ప్రత్యేకించి రాష్ట్రంలో నిర్వహించనున్న జీవవైవిధ్య సదస్సుకు విదేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలున్నాయి. విదేశీయులు అడుగుపెట్టినప్పుడే ఉగ్రవాదులు పంజా విసరటానికి ప్రయత్నిస్తుంటారు. హింసకు పాల్పడే అవకాశమున్న ఈ సదస్సు గురించి ఇంటలిజెన్స్‌ బ్యూరో స్పందించింది. ఈ సదస్సుకు వచ్చే వీవీఐపీలకు హైసెక్యూరిటీ కల్పించాలని ఇంటలిజెన్స్‌ కోరింది. విదేశీప్రతినిధులకు ఒక్కొక్కరికీ బాడీగార్డులను నియమించాలని పోలీసుశాఖను కోరింది. దీంతో పాటు సదస్సు జరిగే ప్రాంతాల్లో నిఘా పెంచాలని కూడా సూచించింది. ముందుగా అనుమానితుల జాబితా తయారీ చేసి పోలీసుశాఖ వారిని అదుపులోకి తీసుకుంటే కొంత వరకూ ప్రయోజనం ఉండవచ్చని కూడా ఇంటలిజెన్స్‌ సూచించింది. దీంతో పోలీసువిభాగం అప్రమత్తమైంది. ఒకవైపు తెలంగాణా మార్చ్‌, మరోవైపు జీవవైవిధ్యసదస్సు కూడా రాష్ట్రపోలీసు విభాగ పనితీరుకు పెద్దసవాళ్లుగా నిలుస్తున్నాయి. ఈసారైనా భద్రతలో భేష్‌ అనిపించుకోవాలని పోలీసువిభాగం కొంచెం సీరియస్‌ వర్కవుట్‌ చేసేందుకు సిద్ధపడుతోంది. అలా కనుక చేయకపోతే మాత్రం విమర్శలను ఎదుర్కోక తప్పదు. అంతేకాకుండా రాష్ట్రంలో భద్రతాసమస్య తీవ్రమవుతుంది కూడా.

స్థానిక ఎన్నికల సస్పెన్స్‌ వీడేదెన్నడు?

      స్థానికఎన్నికలు...ఈ మాట తరుచుగా కాంగ్రెస్‌ పెద్దల నోట మాత్రమే వినిపిస్తోంది... ఎప్పుడైనా  కార్యకర్తలను ఊరడిరచటానికి...ఇంకొంచెం ద్వితీయస్థాయి నాయకులకు ఆశలు కల్పించటానికి....మరికొంచెం ముందుకు వెళితే ప్రతిపక్షాల నోరు నొక్కటానికి కాంగ్రెస్‌ ఈ పదాన్ని ఓ అస్త్రంలా ఉపయోగించుకుంటోంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే పోకిరి సినిమాలో షిండే అన్నట్లు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా....అన్నట్లు బతికే ఓ రాష్ట్రపెద్ద రోజూ ఎవరికో ఒకరికి స్థానిక ఎన్నికలు వచ్చేస్తున్నాయ్‌ అని చెప్పేస్తుంటారు. చివరికి ఇదెంత పెద్ద జోక్‌గా మారిందంటే ఆ పార్టీలో ఎవరు కూడా ఆ పెద్ద అంటే నమ్మకం లేనంతస్థాయికి తీసుకువెళ్లింది. అఫ్‌కోర్స్‌! అందరికీ తెలిసిన ఆ పెద్ద సిఎం కుర్చీలో కూర్చుని తన పదవి కోసం ఈ మంత్రాన్ని పఠిస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మాట నిలుపుకోలేని సత్తా ఆయనకే చెల్లిందని కాంగ్రెస్‌ సీనియర్లు, పలుజిల్లాల్లోని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా చెప్పుకుంటున్నారు. నలుగురు ఏమంటే నాకేటీ సిగ్గు అన్నట్లు ఆయన మాత్రం ఎక్కడ ఏ సభ జరిగినా ఈ పదం వాడకుండా ముగించటం లేదు. తాజాగా ఏలూరు కాంగ్రెస్‌ సభలో కూడా ఒక నెలలో స్థానిక ఎన్నికలు అని హామీ ఇచ్చేశారు. నెలల తరబడి ఒక నెలలో ఎన్నికలు అని ఆయన చెప్పుకుంటూ పోవటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఉప ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ స్థానిక ఎన్నికలు కనుక జరిపించకపోతే ఖచ్చితంగా కేంద్ర నిధులు గ్రామపంచాయతీలకు ఆపేస్తామని కూడా హెచ్చరించారు. ఆ గడువు కూడా పూర్తయినా ఇప్పటికీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియటం లేదు. ఉప ఎన్నికల ప్రచారానికి తిరుపతి వచ్చి వెళుతూ ఎయిర్‌పోర్టులో తనను సాగనంపటానికి వచ్చిన కూతుహలమ్మ వంటి కాంగ్రెస్‌ నేతలకు కూడా సిఎం ఒకనెలలో స్థానిక ఎన్నికలు జరిపించేసి పార్టీని బలోపేతం చేసేద్దామని లేని ఉత్సాహాన్ని కల్పించారు. అంత తొందరగా సిఎం స్పందించారంటే ఇక ఎన్నికలే అనుకుని ద్వితీయశ్రేణి నాయకత్వానికి చిత్తూరు నేతలు ముందుగా వరాలు కురిపించారు. ఆ ద్వితీయశ్రేణి నేతలు ఇప్పుడు తిరుపతిలో ఎదురుతిరుగుతున్నారు. ఇదేమి పార్టీ అని కూడా నిలదీస్తున్నారు. మీ కన్నా మాట నిలుపుకునే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బావుందని తిరుపతి కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ సమావేశాల్లో విరుచుకుపడుతున్నారు. ఇంతలా సిఎం ప్రకటనపై నిరసన వ్యక్తం అవుతున్నా ఆయన మాత్రం అస్సలు ఈ విషయం పట్టించుకోలేదు. అంతేకాకుండా కేంద్ర మంత్రి చంద్రదేవ్‌ చెప్పినట్లే స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రత్యేకించి 11వ ఆర్థిక సంఘం నిధులు అస్సలు రాష్ట్రంలోని పంచాయతీలకు విడుదలవుతున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రప్రభుత్వానికి ఏర్పడిరది. దీంతో తాజాగా సీనియర్‌ మంత్రి జానారెడ్డి స్పందించి సుప్రీంకోర్టులో ఎన్‌ఎల్‌పీ వేసైనా నిధులను తెప్పించుకోవాలని భావిస్తున్నారు. నిధులు ఆపవద్దని కేంద్రాన్ని కోరుతామంటున్నారు. ముఖ్యమంత్రితో కూడా ఈ విషయమై చర్చిస్తామని తెలిపారు. అయితే ఎన్నికలు నిర్వహించటం అనేది ఇప్పట్లో జరగదని మాత్రం మంత్రి ప్రకటనను బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే అధికారాలు కోల్పోయి ఖాళీగా తిరుగుతున్న ద్వితీయశ్రేణి నేతలు మాత్రం ఈ సస్పెన్స్‌కు తెరదించాలని డిమాండు చేస్తున్నారు. నేరుగా అధిష్టానం ఈ విషయంలో పూనుకోవాలని వారు కోరుకుంటున్నారు.

పరిపూర్ణ విజయం

  అక్రమంగా క్వారీయింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలానే చారిత్రక ప్రాశస్త్యం ఉన్న వకుళమాత గుడి మళ్లీ కట్టాలని కూడా ఆదేశించింది. హైకోర్టు స్పందించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైందవ సాంస్కృతి ప్రాభవానికి తిరుమల నిదర్శనమని, అటువంటి తిరుమల రాయుడు, శ్రీనివాసుడు తల్లి వకుళమాత గుడి జీర్ణా(దురా)వస్థకు చేరటానికి కారణాలు పరిశీలించాలని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామి ఇటీవల కోరారు. అంతేకాకుండా ఆయన ఆందోళన కూడా చేపట్టారు. మతభ్రష్టత్వానికి దారితీస్తున్న ఈ పరిస్థితులపై ఆయన ఆగ్రహంతోనే అప్పటి చికాగో సభలో వివేకానందున్ని జ్ఞాపకం చేసుకుని స్వామిజీ కాకినాడలో ఓ పెద్ద బహిరంగసభ కూడా నిర్వహించారు. హైందవజాతికి దిశానిర్దేశం చేసేందుకు ఆయన తన వంతు పాత్రను పోషించారు. ఈ సమయంలో హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ముఖ్యంగా స్వామిజీకి, హైందవ సంస్కృతిని నమ్ముకున్న వారికి ఊరటను ఇచ్చింది. అసలు ఆలయం పరిసరాల్లో క్వారీయింగ్‌ను పరిపూర్ణానంద సరస్వతి తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఆయన తరువాత మరికొందరు ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయం ఉన్న పరిసరాల్లో మైనింగ్‌ కార్యకలాపాలను ఆపేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ క్వారీలపైనే ఆధారపడిన పేదల పరిస్థితిని కూడా హైకోర్టు దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యామ్నాయ ఉపాథి చూపించాలని దిశానిర్దేశం కూడా చేసింది. ఈ తీర్పు గురించి విన్న పలు ప్రాంతాల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విస్తరిస్తున్న గుడుంబా వ్యాపారం?

  మొగుడు మొత్తేవాడైతే ఊరంతా ఊరుకుంటుందా అన్నట్లుంది నేటి వాతావరణం. ప్రభుత్వ చేతకానితనానికి అతిపెద్ద నిదర్శనం గుడుంబా తయారీ, వ్యాపారం. ఈ వ్యాపారం ఒకప్పుడు రాష్ట్రరాజధాని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమై ఉండేది. పైపెచ్చు ఇతర ప్రాంతాలకు అస్సలు రవాణా కాకుండా పోలీసులు, ఎక్సయిజ్‌ రెండుకళ్లుగా కాపుకాసేవారు. ఇప్పుడున్న ఆమ్యామ్యాల సంస్కృతి వల్ల ఆ రెండు కళ్లు కూడా మూసుకుపోయాయి. దీంతో తెలంగాణా జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ గుడుంబావ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ఈ వ్యాపారం వల్ల కల్లుదుకాణదారులైతే తమ దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ వృత్తికే గుడుంబా పెద్ద శాపమైందని గీతకార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణాజిల్లాల్లో చీప్‌లిక్కర్‌ వ్యాపారం పడిపోయింది. దీనికి కారణం కూడా గుడుంబా అందుబాటులో ఉండటమేనని తెలుస్తోంది. సారాతో సమానంగా ఉండే ఈ గుడుంబా అంటే తెలంగాణా ప్రాంతవాసులు చెవి కోసుకుంటారనేవారు. తాజాగా కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి మండలం గోపయ్యపల్లిలో పోలీసులు దాడి చేస్తే 1700లీటర్ల గుడుంబా కోసం సిద్ధంగా ఉన్న పులిసిన బెల్లం పానకం, వెయ్యిలీటర్ల గుడుంబా దొరికింది. నిందితులను అన్వేషించే పనిలో పోలీసులున్నారు. ఇలానే వరంగల్‌జిల్లాలోనూ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ గుడుంబా తయారీ ఓ కుటీరపరిశ్రమలా సాగుతోందని తెలుస్తోంది. ఇకనైనా తమ నిద్రను వదిలి అధికారులు గుడుంబాను అదుపులోకి తేవాలని మహిళలు కోరుతున్నారు.

ఆరుషి హత్యకేసులో నూపుర్ విడుదల

ఆరుషి హత్యకేసులో తల్లి నూపుర్ తల్వార్ విడుదలయ్యింది. కన్నకూతురు ఆరుషితోపాటు పనివాడినికూడా చంపేశారన్న అభియోగాలపై విచారణను ఎదుర్కున్న నూపుర్ కి వారంరోజుల క్రితం సుప్రీంకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఐదునెలలుగా ఘజియాబాద్ లోని దస్నా జైల్లో ఉన్న నూపుర్ కి విముక్తి లభించింది. ఈ కేసులో మీడియా చేసిన సాయంవల్లే నూపుర్ విడుదల కాగలిగిందని, న్యాయం కోసం గట్టిగా పోరాడతామని ఆరుషి తండ్రి రాజేష్ చెబుతున్నారు. 2008 మే 16న నోయిడాలోని రాజేష్ ఇంట్లో ఆరుషి, హేమరాజ్ ల జంటహత్యలు కలకలం రేపాయి. కూతురు పనివాడితో తిరుగుతుందన్న కోపంతో తల్లిదండ్రులే ఆ పిల్లని, పనివాణ్ణి చంపేశారని సీబీఐ దంపతులిద్దరిమీదా అభియోగాలు మోపి అరెస్ట్ చేసింది. ఢిల్లీ హైకోర్ట్ ఇద్దరికీ రిమాండ్ విధించింది. సుప్రీంకోర్ట్ బెయిల్ పిటిషన్ ఆమోదించడంతో నూపుర్ కి జైలునుంచి విముక్తి లభించింది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

హర్యానాలోని సూరజ్ కుండ్ లో భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయ్. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల్ని బట్టి జనానికి దగ్గరయ్యేందుకు తమ పార్టీలో ఏ స్థాయిలో మార్పులు చేర్పులు చేసుకోవాలన్న దానిపై బీజేపీ జాతీయ స్థాయి నేతలు ఈ కార్యవర్గ సమావేశాల్లో మేథో మధనం జరుపుతున్నారు. గడ్కరీ పదవీకాలం ముగియడంతో మరో కొత్త అధ్యక్షుడి ఎంపికపైకూడా ఈ సదస్సులో కసరత్తు జరుగుతోంది. మెజారిటీ నేతలు మరోసారి గడ్కరీకి అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానానికి సూచిస్తున్నారు. అద్వానీ లాంటి పై స్థాయి నేతల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో గడ్కరీ మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గట్టిగానే చెప్పుకుంటున్నారు.

రాహుల్ కోసం బీజేపీ నేతల్ని ఉతికారేశారు

జార్ఖండ్ లో పార్టీని పటిష్టం చేసేందుకు రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. రాహుల్ పర్యటనని అడ్డుకుని తీరాలన్న కసితో ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా యూపీఏ రాజకుమారుడి కాళ్లకు అడ్డంపడ్డారు. వెనక్కి తిరిగి వెళ్లిపొమ్మంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. భవిష్యత్ ప్రథానమంత్రిగా తాము ఊహించుకుంటున్న రాహుల్ కి ఇంతచేటు అవమానం జరిగేసరికి కాంగ్రెస్ కార్యకర్తలు, లోకల్ నేతలకు ఎక్కడ కాలాలో అక్కడే కాలింది. కాకపోతే కాక మరీ ఎక్కువయ్యిందేమో, వరసపెట్టి దొరికినవాళ్లని దొరికినట్టుగా బిజెపి నేతల్ని, కార్యకర్తల్నీ ఉతికి పారేశారు. మళ్లీ ఆ ఛాయల్లోకి రావాలంటే భయం పుట్టేరీతిలో చావగొట్టి వదిలిపెట్టారు. ఈ దెబ్బతో నేను అధిష్ఠానం దృష్టిలో పడి సామాన్య కార్యకర్త స్థాయినుంచి జాతీయ స్థాయికి ఎదిగిపోవాలన్నంత కసి కాంగ్రెస్ కార్యకర్తల్లో కనిపించింది. క్షణాల్లో రాహుల్ కి దారి క్లియరైపోయింది.

ఇంతకీ లేఖ ఇస్తారా? లేదా బాబూ..?

తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇచ్చే విషయంలో తెలుగుదేశం పార్టీలో భారీ స్థాయిలో అంతర్మధనం జరుగుతోంది. అసలు లేఖ ఇవ్వాలా వద్దా అన్న విషయంలో చంద్రబాబు చాలా సందిగ్ధంలో పడిపోయారు. తెలంగాణ నేతలు లేఖ ఇవ్వాలని గట్టిగా పట్టుపడుతుంటే సీమాంధ్ర నేతలు మాత్రం లేఖ ఇస్తే పార్టీ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంమీద చంద్రబాబు చాలాసార్లు ఇరు ప్రాంతాలనేతలతో చర్చలు జరిపారు. ఫైనల్ గా ఓ సారి సీమాంధ్ర నేతల వెర్షన్ తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని బాబు గట్టిగా అనుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణపై లేఖ విషయంలో పార్టీలోని సీమాంధ్ర నేతల మధ్య పొరపొచ్చాలొచ్చినట్టు సమాచారం. టిడిపి సీమాంధ్ర నేతల్లో కొందరు ఇచ్చేస్తే పోలా అని బాబుకి సలహా ఇస్తుంటే, ఇన్నాళ్లూ పోరాటం చేసింది తేలిగ్గా ఇచ్చేయడానికేనా అంటూ కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా బుధవారం తిరిగే లోగానే లేఖపై ఓ నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారని గట్టి సమాచారం.

కొత్త మిత్రులపై సిడబ్ల్యూసీలో చర్చ

ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఆర్థిక సంస్కరణల గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. సీనియర్ నేతలకు ఏకరువు పెట్టారు. ప్రస్తుత తరణంలో దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించడానికి ఆర్థిక సంస్కరణలు చాలా ముఖ్యమని సోనియా.. పార్టీ సహచరులకు చెప్పినట్టు సమాచారం. మమతావర్గం ప్రభుత్వంనుంచి వైదొలగడంతో బైటినుంచి మద్దతిస్తున్న ములాయం సింగ్ వర్గాన్ని, మాయావతి వర్గాన్ని సోనియాగాంధీ.. కొత్త మిత్రులుగా పేర్కొనడం విశేషం. సంస్కరణల విషయంలో తాను మన్మోహన్ కి పూర్తిగా అండగా నిలబడతానని సోనియా హామీకూడా ఇచ్చారట.

ఇంతకూ అక్రమాస్తుల దోషులెవరు?

  అక్రమాస్తులు, ఫెరా నిబంధనల ఉల్లంఘన వంటి కేసుల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చంచల్‌గూడా జైలులో ఉన్నారు. భారతీయశిక్షాస్మృతి ప్రకారం తప్పుఎవరు చేసినా దానికి సహకరించిన వారూ దోషులే. కానీ, ప్రస్తుత వాతావరణం చూస్తుంటే జగన్‌ మాత్రమే దోషి. మిగిలిన వారందరూ నిజాయితీపరుల్లా బొంకుతున్నారు. నేరుగా నేరం చేసినది జగన్‌, ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని ఈ కేసుల్లో దోషులు చెబుతుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత పెద్ద నేరాలు చేయాలంటే సహకరించే పాత్రధారులూ ఎక్కువగా ఉంటారనేది జగమెరిగిన సత్యం. అయితే పాత్రధారులు మాత్రం తామేమీ చేయలేదని, తమకు తెలియకుండానే తప్పు జరిగిపోయిందని బొంకుతున్నారు. ప్రత్యేకించి ఎవరి మాట పరిశీలించినా అందరూ శ్రీవైష్ణవులే రొయ్యల బుట్టలో మాత్రం రొయ్యలు మాయమయ్యాయన్నట్లుంది పరిస్థితి. గతంలో మహిళా ఐఎఎస్‌ అధికారి శ్రీలక్ష్మి మాటలు గుర్తు చేసుకుంటే తనపై ఒత్తిడి వల్లే ఇలా జరిగిందన్నారు. కనీసం ఆ తరహాలో కూడా మిగిలిన వారు మాట్లాడటం లేదు. తాజాగా దోషిగా సిబిఐ ప్రకటించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు గమనిస్తే తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇదే విషయం రుజువు అవుతుందనే పూర్తి విశ్వాసం తనకుందని అన్నారు. న్యాయం పొందటానికి తనకున్న అన్ని అవకాశాలూ ఉపయోగించుకుంటానని తెలిపారు. తెలియక తప్పిదం, పొరపాటు కూడా చేయలేదని ధర్మాన నొక్కి చెబుతున్నారు. మరి తెలియక తప్పిదం చేయకపోతే వాన్‌పిక్‌ భూములు ఎలా విదేశీకంపెనీ, నిమ్మగడ్డ ప్రసాద్‌ పరమయ్యాయన్న రహస్యం మాత్రం అంతుబట్టడం లేదు. పోనీ, ఈ మంత్రి విచారణలో సహకరించేందుకు మానసికంగా సిద్ధమయ్యారా? అంటే అదీ అనుమానంగా కనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్‌లో రాజీనామా సమర్పించేసి ఢల్లీ పెద్దల ఒత్తిడితో, సిఎంను మెతకవైఖరి అవలంబించేలా చేసిన మేధావి కాబట్టి. ఇప్పటిదాకా ఏ మంత్రి ఇంత ఒత్తిడి సిఎంపై తీసుకురాలేదని పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. ఏమైనా చివరికి జగన్‌ ఒక్కరే దోషిగా మిగిలే అవకాశం ఉంది అన్నట్లుంది ప్రస్తుత వాతావరణం.

ఆందోళన బాటలో పెట్రోలియం డీలర్లు

  గతంతో పోల్చుకుంటే వ్యాపారం పెరిగినా లాభం తగ్గిందని పెట్రోలు డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలియం కంపెనీలు తమ షేర్‌ వాల్యూ పెంచుకుంటూ లాభాల బాటలో పయనిస్తుంటే తాము మాత్రం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి వెళుతున్నామని వారంటున్నారు. తాము బంకులు పెట్టి సిబ్బంది సహాయంతో పెట్రోలు అమ్మకాలు చేయకపోతే కంపెనీలు ఏమి చేయగలవని ప్రశ్నిస్తున్నారు. పైసల్లో ఉన్న లాభం కోసం తాము ఒక్కోసారి చిల్లర నష్టపోతున్నా పట్టించుకోవటం లేదని డీలర్లు వాపోతున్నారు. చిల్లరపైసలు చేరకుండా పెట్రోలియం ధరల్లో మార్పు ఉండదని, ఆ చిల్లరే తమకు ఇబ్బందిగా మారుతున్నందున రౌండ్‌ చేయాలని సూచించినా కంపెనీలు పట్టించుకోవటం లేదన్నారు. తమ ఉత్పాదనలు అమ్ముతున్నారా? లేదా? అన్నదే కంపెనీలు పరిశీలిస్తున్నాయి కానీ, లాభం తక్కువయి తాము పడుతున్న పాట్లు గమనించటం లేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో డీలర్లు అందరూ ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. అక్టోబరు 1,2 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లను నిషేధిస్తారని ఆ సంఘం భారత కమిటీ సంయుక్త కార్యదర్శి రాజీవ్‌ అమరం తెలిపారు. తమ ఇబ్బందులను గమనించి పెట్రో కంపెనీలు దిగిరాకపోతే వాటికి అర్థమయ్యేలా భవిష్యత్తులో మరిన్ని నిరసనకార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ రెండు రోజుల కొనుగోళ్ల నిలిపివేతకే కంపెనీలు తలొగ్గుతాయని తాము భావిస్తున్నామన్నారు. ఒక వేళ అప్పటికీ కంపెనీలు స్పందించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్రంలో పెట్రోలు బంకు డీలర్లు ‘తెలుగువన్‌.కామ్‌’కు తెలిపారు.

మహాత్మా! కేన్సర్‌కేషీట్లపై ఇంత చులకనా?

  ఉత్తరతెలంగాణాలో సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలకు మహాత్మాగాంధీ ప్రభుత్వ మెమోరియల్‌ (ఎంజిఎం) ఆసుపత్రి ఒక్కటే పేదలకు అందుబాటులో ఉంది. అయితే ఈ ఆసుపత్రిలో వైద్యాధికారులు కేన్సర్‌ రోగుల కేషీట్లను భద్రపరిచే విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. గదిలో ఓ మూలన ఈ కేషీట్లు పడేస్తున్నారు. ప్రత్యేకించి ఈ కేషీట్లను ఫైల్‌ చేయటానికి అవకాశం ఉన్నా అంతగా పట్టించుకోవటం లేదు. అసలే తెలంగాణా జిల్లాల్లో కేన్సర్‌ వ్యాధిని అంటువ్యాథిలా చూస్తుంటే కనీసం రోగుల పరిస్థితిని తెలియజేసే కేషీట్ల విషయంలో ఆసుపత్రి నిర్వాహకులు నిర్లక్ష్యం చూపటం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. తమ ప్రాంతంలో కేన్సర్‌ అని చెప్పుకు తిరగలేని పరిస్థితికి తోడు తమ వివరాలున్న కేషిట్లను గాలికి వదిలేయటం ఏమీ బాగోలేదని రోగులు వాపోతున్నారు. ఆసుపత్రిలో రికార్డు మెయింటెన్‌ చేయటం ఎంత అవసరమో కూడా గుర్తించటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కోసం వచ్చే బంధువులకు వివరాలు చెప్పాలన్నా, భవిష్యత్తులో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఈ కేషీట్ల ఆధారంగా రికార్డు బయటకు వస్తుందన్న విషయాన్ని సిబ్బంది గమనించటం లేదన్నారు. సిబ్బంది అంత చులకనగా వదిలేస్తుంటే దాన్ని వైద్యాధికారి కూడా ప్రేక్షకపాత్రలా చూసీచూడనట్లు ఉండటం తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఇకనైనా కేషీట్లను భద్రపరిచి తమ పట్ల ఎంజిఎంకు ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలని కేన్సర్‌ రోగులు కోరుతున్నారు.

ఇసుక మాఫియాకు షాకిచ్చిన కొత్త పాలసీ ?

  ఇసుక తవ్వకాలు, అమ్మకాలు విషయంలో అక్రమాలను ప్రభుత్వం కొత్తపాలసీని ద్వారా అదుపు చేయనుంది. ఈ పాలసీ వల్ల అక్రమాలు జరిగే అవకాశాలు తగ్గుతాయని రాష్ట్రప్రభుత్వం నమ్మబలుకుతోంది. రోజూ దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పట్టుకున్నామని చెప్పుకునే వాతావరణం స్థానంలో సామాన్యుడు కూడా స్వేచ్ఛగా ఇసుకను వినియోగించుకునే స్థాయికి చేరతాడని ఆశిస్తోంది. ముందుగా ప్రకటించినట్లే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా పంపిణీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఈ ఇసుకను నిత్యవసరం కింద పరిగణించింది. రీచ్‌ల్లో రాజ్యమేలుతున్న మాఫియా పక్కకు తప్పుకునే పరిస్థితులను ప్రభుత్వమే కల్పించింది. ఇసుకరీచ్‌లకు టెండర్‌కమ్‌ పబ్లిక్‌ ఆక్షన్‌ పద్ధతిని ఆపేసి లాటరీల ద్వారా కేటాయింపులు చేయనున్నది. క్యూబిక్‌ మీటరు ఇసుక ధర రూ.325గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరకు 20శాతం మించకుండా జిల్లా అధికారులే ధరను శాసిస్తారు. తవ్వకాల్లో పరిమితి విధించే వాల్టా చట్టం అమలు చేస్తారు. యంత్రాల వాడకాన్ని నిషేధిస్తారు. పీసా చట్టం 1966 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఇసుకరిచ్‌లను ఎపీఎండీసీ, ఐటీడీఏ సహకారంతో గ్రామసభల్లో ఆమోదం పొందిన సొసైటీలు నిర్వహిస్తాయి. నీటిలోపల ఇసుకతవ్వకాలను రిజిస్టర్డ్‌ బోట్స్‌, మైన్స్‌ సొసైటీలకు లాటరీ పద్దతిలో కేటాయిస్తారు. రిజర్వాయర్లతో డీసిల్టింగ్‌ ద్వారా ఇసుకను ఇరిగేషన్‌శాఖ వెలికి తీస్తుంది. ఈ ఇసుకను ప్రభుత్వపనులకు వినియోగిస్తారు. పట్టాభూముల్లో మేట వేసిన ఇసుక తొలగింపునకు సీనరేజి ఫీజు చెల్లించి రైతులే అనుమతి పొందాలి. మండల పరిధిలో ఉన్న చిన్నచిన్న నదులు, వాగుల్లో ఉన్న ఇసుకను స్థానిక అవసరాలకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీనరేజీ ఫీజు లేకుండా ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు ధృవీకరణతో ఇసుకను ఉచితంగా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర సరిహద్దులకు ఇసుకరవాణా నిషేధించారు. ఇతరరాష్ట్రాలకు ఇసుకను రవాణా చేస్తే వాహనాలను సీజ్‌ చేస్తారు. ఇసుకసీనరేజీ ఫీజులు నూరుశాతం జిల్లాపరిషత్తు జనరల్‌ ఫండ్స్‌ ఖాతాలో జమ చేస్తారు. దీనిలో 25శాతం జిల్లా పరిషత్తు, 50శాతం మండలపరిషత్తులు, 25శాతం గ్రామపంచాయతీలు వాటాగా పొందుతాయి. ఇప్పుడు రాజధానికి తరలిస్తున్న పది ఘనపుమీటర్ల ఇసుక ధర 16నుంచి 18వేల రూపాయలు ఉంటే కొత్త పాలసీ ప్రకారం ఏడు నుంచి ఎనిమిదివేల రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఐదు హెక్టార్లలోపు రీచ్‌లకు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 107 ఇసుకరీచ్‌లను తవ్వకాలకు అనుకూలమైనవని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అమలులో ఉన్నవి 77రీచ్‌లు మాత్రమే. నూతనవిధానంలోకి రావటానికి ఆసక్తి చూపకపోతే 42 రీచ్‌లకు గనులశాఖ డబ్బు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమైనా ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లు, టెండరుదారులు కొత్తపాలసీ పర్వాలేదంటూ ఊపీరిపిల్చుకుంటున్నారు. నిర్మాణాలు పూర్తి చేసేందుకు పాలసీని వెంటనే అమలులోకి తేవాలని వారు కోరుతున్నారు.

గ్రామస్థాయిలో పట్టుకోసం ‘దేశం’ ఆరాటం!....పాదయాత్రల వెనుక లక్ష్యం?

    తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 117 రోజుల పాదయాత్ర గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి దారి తీయాలని ఆ పార్టీ నేతలు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అందుకే చంద్రబాబు యాత్రతో పాటు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్‌ఛార్జి స్థాయిలో ఉన్న వారందరూ ఈ యాత్రతో పాటు కానీ, ముందుగా కానీ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటించాలని పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సూచిస్తోంది. ఈ పాదయాత్రల తీరుతెన్నులను పరిశీలిస్తున్న పొలిట్‌బ్యూరో ప్రతీ అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. గ్రామస్థాయిలో పార్టీ పట్టు కనుక పెరిగితే 2014 ఎన్నికలను ఎదుర్కొవటం పెద్ద పని కాదు అని భావిస్తోంది. అందుకే ముందుగా ఈ పాదయాత్ర జరిగే అన్ని జిల్లాల్లోని నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. అక్టోబరు 2న చంద్రబాబు పర్యటన అనంతపురం జిల్లా హిందుపురం నుంచి ప్రారంభమవుతోంది. దీంతో సమాంతరంగా గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం చేయటానికి పర్యటనలు ప్రారంభించాలని పొలిట్‌బ్యూరో జిల్లా నేతలను ఆదేశిస్తోంది. బాబు పర్యటించే హిందుపురం, కర్నూలు, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులను రాష్ట్ర నేతలు ముందస్తుగా ప్రతీరోజూ సంప్రదిస్తున్నారు. అంతేకాకుండా పాదయాత్ర ప్రారంభమయ్యాక గ్రామాల వారీగా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పర్యటనల వివరాలు, బాబు పాదయాత్ర తీరుతెన్నులు రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ప్రతీ సోమ, మంగళవారాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. ప్రత్యేకించి బాబు యాత్ర ఎలా ఉండాలన్న రూట్‌మ్యాప్‌ జిల్లా నేతల ఆలోచనలతో రూపుదిద్దుకోవాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అందుకే బాబు కూడా ఆ జిల్లా నేతలతో కలిసి వారిచ్చిన సూచనల ప్రకారం పర్యటించేందుకు సిద్ధపడుతున్నారు. కొన్ని నినాదాల ఆధారంగా గ్రామీణులను తెలుగుదేశం పార్టీవైపు నడిపించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఎన్టీఆర్‌ హయాం నుంచి అచ్చొచ్చిన ‘నడుస్తోంది రాబందుల రాజ్యం...రాబోయేది రామన్న రాజ్యం’ అన్న నినాదానికి పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అసమర్ధపాలన అంతమొందిద్దాం అన్న నినాదానికి ప్రాధాన్యత ఇస్తోంది. బిసి డిక్లరేషను ప్రకటించినందున చట్టసభల్లో పెరగాలి బిసిల భాగస్వామ్యం అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అని నినాదమిస్తోంది. ఇలా నినాదాలు కొత్తఅంశాలతో బాబు పాదయాత్రను హుషారెక్కించేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తులు చేస్తోంది. ఏమైనా ఈ అవకాశం అధికారానికి ఉపయోగపడాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలగా ప్రయత్నిస్తోంది.  

మార్పు విద్యార్ధుల్లో రావాలి!

  విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్‌ ఘటనలకు తావులేకుండా పటిష్టచర్యలు తీసుకోవాలని అన్నిజిల్లాల ఎస్పీ, పోలీస్‌ కమిషనర్‌లకు డిజిపి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అలాగే ర్యాగింగ్‌ బాధితులకు పూర్తి రక్షణ కల్పించాలని, ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ర్యాగింగ్‌ జరక్కుండా చర్యలు తీసుకోవాలని, వైస్‌ ఛాన్సలర్‌, ప్రిన్సిపాల్‌లతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని ఓ సర్క్యులర్‌లో సూచించారు. నిజంగా హర్షించదగ్గ పరిణామం. అలాగే గతంలో జరిగిన ర్యాగింగ్‌పై చర్యలు తీసుకుంటున్నామని, ఇక ఎక్కడ ర్యాగింగ్‌లు జరగవని అన్నారు. కాని జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. కొత్త విద్యార్ధులను పరిచయం చేసుకోవడమంటే వారంతా ఎందుకు కాలేజీలో చేరమా? అని బాధపడేలా వుండకూడదు. తల్లిదండ్రులకు దూరంగా చదువుకుంటున్నా మాకు ఓ అండ వుందన్న సంతృప్తితో కాలేజీలకు రావాలి. అలా వారు రావాలంటే ఆయా సంస్థల్లోని విద్యార్ధుల్లో మార్పు రావాలి. ర్యాగింగ్‌ అంటే మా జన్మహక్కు అన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తుంటారు. కాలేజీల్లోకాని, విద్యార్ధులకు సంబంధించిన హాస్టళ్ళలోకాని ర్యాగింగ్‌ అన్నది జరగకుండా వుండాలంటే అది ఎంత ఇబ్బందికరమో వారికి తెలియాలి. మా వెనుక అండవుందని కొందరు ప్రవర్తిస్తుంటారు. అటువంటివారికి ఆయా పెద్దలు బుద్ధిచెప్పిననాడు ర్యాగింగ్‌ అన్నది విద్యాసంస్థల్లో జరగదు. కేవలం మగపిల్లలే ర్యాగింగ్‌ చేస్తారనుకుంటే పొరపాటే! ఆడపిల్లలు సైతం ర్యాగింగ్‌ చేసిన సంఘటనల కథనాలు సామాన్య ప్రజలు చదివారు కూడా! ర్యాగింగ్‌ జరగకుండదంటే ముందు విద్యార్ధుల్లో మార్పువచ్చేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కొందరు విద్యార్ధుల వెనుక వుండి నడిపించే వారు తెలుసుకోవాలి. మరో విద్యార్ధిని ర్యాగింగ్‌ చేసేముందు ఆ స్థానంలో మనమే ఉంటే ఎలా ఫీలవుతామో ఆలోచించుకుంటే మంచిది.