కడపజిల్లాలో ఓ పల్లెకి గురువారమంటే భయం
posted on Sep 10, 2012 @ 4:29PM
కడపజిల్లా జి.వెంకటాపురానికి గురువారం భయం పట్టుకుంది. గురువారమొస్తేచాలు వెంకటాపురంలో ఓ శవం లేస్తోంది. దెయ్యం భయం కాదు. రోగాలూ రొప్పులూ లేవు. కానీ.. ఓ సైకో గురువారం రోజున ఊరిమీదపడి కనిపించినవాళ్లనల్లా కాల్చిపారేస్తున్నాడు. ఇంతకీ ఆ సైకో చంపుతోంది ఎవర్నో తెలుసా.. వాళ్ల సొంత బంధువుల్నే. క్రికెట్టాడేటప్పుడు మొదలైన చిన్న గొడవని మనసులో పెట్టుకుని ఆస్తి తగాదాల్ని తిరిగి తవ్వుకుని వెంకటరమణ అనే యువకుడు ప్రత్యర్థుల్ని కాల్చి చంపుతున్నాడు. ఇదే గొడవలకు సంబంధించి జైలుకెళ్లొచ్చిన నిందితుడు జైలు పరిచయాల సాయంతో ఓ తుపాకీని సంపాదించి ప్రత్యర్థుల్ని ఇష్టంవచ్చినట్టు కాల్చిపారేస్తున్నాడు. 21 జూన్ 2102 గురువారం రోజున వెంకటరమణ ఊళ్లో మొదటి హత్య చేశాడు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వ్యక్తిని కాల్చిపారేశాడు. ప్రతిసారీ గురువారం రోజున మాత్రమే హంతకుడు దాడిచేస్తుండడంతో ఊరివాళ్లకు గురువారం రోజున తిండీ నిద్రా కరువయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు, ఊరివాళ్లకు రక్షణ కల్పించేందుకు ఓ పోలీస్ బెటాలియన్ ఊరంతా తిరుగుతూ కాపలా కాస్తోంది.