అంతా మామూలేనా...!
posted on Sep 6, 2012 @ 4:10PM
సందర్భం ఏదైనా.. కొన్ని సందర్లాల్లో ఆయా వ్యక్తులు చేసే పనులు కొంతకాలం గుర్తుండి పోతాయి. అది ఏయే సందర్భాల్లో చేశారన్న విషయం నామమాత్రంగా గుర్తున్నా ఆ చర్య మాత్రం... అలా.. గుర్తుండిపోతుంది. గతంలో ఓసారి ఇండియా అద్భుత విజయం సాధించిన సందర్భంలో... ఆ సమయంలో ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్‌గా వున్న గంగూలీ చొక్కా గాలిలో తిప్పుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
సినిమాల్లో అయితే చొక్కా లేకుండా చాలా సార్లు నటించిన నటుడుగా సల్మాన్‌ఖాన్ గుర్తుండిపోతాడు. చాలామంది సల్మాన్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమయిందంటే చాలు.. అందులో చొక్కా విప్పదీసే సీన్ ఉంటుంది... అని రూఢీ అయిపోయేవారు. అలాగే జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీకి చెందిన ఎం.ఎల్.ఎ. సమరేష్‌సింగ్ అసెంబ్లీలో తన చొక్కాను చించుకుని ప్రభుత్వానికి తన నిరసనను తెలిపారు. బొకారో నిరాశ్రయులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిరాశ్రయులైన వారికోసం ఓ కమిషన్‌ను వేయాలన్న తన డిమాండ్‌కు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అందుకు నిరసనగా సింగ్‌గారు తన చొక్కాచించుకుని వినూత్నరీతిలో తన నిరసనను తెలియజేశారు. ఆ రోజు అసెంబ్లీలో మాత్రం ఈ విషయంపై ఈ సింగ్‌గారు ఈజ్ కింగ్ అనిపించుకున్నారు. కాకుంటే వచ్చిన చిక్కల్లా ఏంటయ్యా...! అంటే... స్కూల్లో పిల్లలు టీచర్ తను చేసిన హోమ్ వర్క్‌ను ముందు దిద్దలేదని చొక్కా చించుకున్నాడనో.... రైళ్ళు గంటలతరబడి ఆలస్యంగా వస్తున్నాయంటూ ఎవరైనా చొక్కాలు చించుకున్నారనుకోండి... పరిస్థితి ఏంటీ..! అబ్బే! ఏం కాదు...చినిగిన చొక్కా మళ్ళీ కుట్టిచ్చుకుంటారు అంతే...! అంతా మామూలే...!