5413 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం
posted on Jun 12, 2012 9:22AM
రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలకు 242మంది పార్లమెంటు స్థానానికి 13మంది పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 12 జిల్లాలకు చెందిన 46లక్షల 13వేల 589మంది ఓటర్లు పాల్గొనే అవకాశం ఉంది. వీరి కోసం 5413పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 3200 కేంద్రాలు సమస్యాత్మకమని ఎన్నికల కమీషన్ గుర్తించింది. అంతేకాకుండా ఎన్నికల పేరు చెప్పి నేరాలకు పాల్పడకుండా 3373 ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లెక్కల్లో లేని అక్రమసొమ్ము 42కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రూ 12.72 కోట్ల విలువైన బంగారాన్ని, లక్షా 92వేల 647లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 3390 బెల్టుషాపులను ఎక్సైజ్ సిబ్బంది మూయించారు. 12 జిల్లాల్లోనూ మద్యం డ్రైడేలను ప్రకటించి మంగళవారం సాయంత్రం ఐదుగంటల వరకూ మద్యం దుకాణాల మూసివేతకు ఎక్సైజ్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 10,746మంది నేరగాళ్ళపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నుంచి పోలింగ్ కేంద్రాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతవాతావరణంలో ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయగలిగామని ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి భాన్వర్ లాల్ తెలిపారు. అక్రమాలకూ పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మొత్తం 50వేల మంది పోలింగ్ సిబ్బంది పటిష్టవంతమైన ఈ ఉప ఎన్నికల్లో పాల్గొంటారని తెలిపారు. ఓటర్లు స్వచ్చందంగా ఓటెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు.