బోస్ కు చెమటలు పట్టిస్తున్న ప్రత్యర్ధులు!
రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తాజా మాజి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మొదట కొంత సానుకూల వాతావరణం కనిపించినప్పటికి తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వై.ఎస్.ఆర్. కాంగెస్ పార్టీలోని ముఖ్య నాయకులే ఆయనకు పెద్దగా సహకరించడం లేదు. దీనికి తోడు ఆయన ప్రదాన ప్రత్యర్ధులు అనూహ్యంగా పుంజుకుని ఆయనకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గత రెండు రోజులుగాఎ.పి లగడపాటి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణలతో పాటు ప్రముఖులు ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ ను సిబిఐ అరెస్ట్ చేసిన నేపధ్యంలో ఆ పార్టీ గౌరవాధ్యక్షులురాలు, జగన్ తల్లి విజయమ్మ ప్రచార భాద్యతలను తీసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ అరెస్ట్ కు నిరసనగా చేపట్టిన బంద్ కు ప్రజల నుండి స్పందన కరవవటంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకుని తమ ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. విజయమ్మపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తూ చేసిన ప్రచారాన్నికి, పర్యటనలకు విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ తరపున ప్రచారాన్ని నిర్వహించిన ఎ.పి.లగడపాటి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణలు జగన్ అవినీతిని ఎండగట్టారు.
కాంగ్రెస్ అభ్యర్ధి తోటకు అనుకూల, ప్రతికూల అంశాలు:
జగన్ ను సిబిఐ అరెస్ట్ చేయటం, వైఎస్సార్ కాంగెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మ ప్రచార భాద్యతలను తీసుకొని ప్రచారాన్ని ప్రారంభించటం కాంగ్రెస్ కు కొంత ఇబ్బందిగా మారినా కాంగ్రెస్ తరపున ప్రచారాన్ని నిర్వహించిన ఎం.పి లగడపాటి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణల పర్యటన కాంగ్రెస్ కు బలాన్నిచ్చింది. రెడ్డి సామాజికవర్గ ఓట్లు నియోజకవర్గ పరిధిలో పెద్దగా లేవు. చేనేత, దళిత వర్గాలు ఇప్పటికే తోటకు మద్దతు ప్రకటించింది. మత్స్యకారులను సముదాయించేందుకు పార్టీకి చెందిన మత్స్యకార నాయకులు నియోజకవర్గ పరిధిలో పర్యటించాలి. కె గంగవరంలో ఉన్న 7వేల మత్స్యకార ఓట్లు చీలిపోకుండా చూస్తే ఆ మేరకు లబ్ది చేకూరుతుంది.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులురాలు, జగన్ తల్లి విజయమ్మను కలిసి సంఘీభావం ప్రకటించినా ఆయన ప్రభావం పెద్దగా ఉండదు. అంతే కాక ఎ.పి లగడపాటి, పిసిసి బొత్సా సత్యనారాయణలు ప్రధానంగా టి.డి.పి అభ్యర్ధి చిక్కాల రామచంద్రరావుకు పట్టున్న కాజూలూరు మండలంలోని దళితపేటల్ల్లో ప్రచారాన్ని నిర్వహించటం అనుకూలాంశమే ..కె.గంగవరంలో ఉన సుమారు 8వేల కమ్మ వర్గానికి చెందిన ఓట్లు 42 వేల వరకు ఉండటంతో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నియోజకవర్గ పర్యటనకు ప్రాధ్యాన్యత ఏర్పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్న క్యాడర్ లోపాలు కాంగ్రెస్ కు అనుకూలాం శాలే.
వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి బోస్ కు అనుకూల, ప్రతికూల అంశాలు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన తల్లి విజయమ్మ ప్రచారాన్ని రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. అయినా క్యాడర్ లోపాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. శెట్టి బలిజ వర్గానికి చెందిన ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితమిస్తుండటం బోస్ కు ప్రతికూలాంశంగా మారింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం ప్రకటించినా భోస్ కు వచ్చేలాభమేమీ ఉండదు.
శెట్టిబలిజ వర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టాబాయి, కాపు వర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పోలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ ప్రచారంపై ఆసక్తి చూపకపోవటం ప్రతికూలాంశం. మంత్రి మోపిదేవి అరెస్ట్ సంఘటనను అవకాశంగా తీసుకొని బోస్ మత్స్యకారుల ఓట్లు ఎక్కువగా ఉన్న కె.గంగవరంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు.
టి.డి.పి అభ్యర్థి చిక్కాలకు ప్రస్తుతమున్న అనుకూల, ప్రతికూల అంశాలు :
చిక్కాల రామచంద్రారావు ప్రచారం తొలినాళ్ళలో ముందున్న ఇటీవల కాలంలో కొంత వెనుకబడ్డారు. ముందున్న ఊపు తర్వాత తగ్గినట్లు కన్పిస్తుంది, తొలినుండి టిడిపి అభ్యర్ధి చిక్కాల రామచంద్రారావు నియోజకవర్గంతో ఉన్న టిడిపి ఓట్ బ్యాంక్ పైనే దృష్టి సారించారు. టిడిపి టిక్కెట్ ఆశించిన గుత్తుల సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో ఉండటంతో పార్టీ ఓట్లు చీలుతాయని భావించారు. అనూహ్యంగా గుత్తుల ప్రచారంలో వెనుకబడటం చిక్కాలకు లభ్ది చేకూర్చేదే. 10వేల కమ్మ వర్గం ఓట్లు టి.డి.పికి అధిక సంఖ్యలో పడేలా, ముఖ్యంగా కె.గంగవరం పరిధిలో ఉన్న 7వేల కమ్మ ఓట్లపై దృష్టి కేంద్రీకరిస్తుంది. టిడిపి ఓట్ బ్యాంక్, పార్టీకి చెందిన, తన సామాజిక ఓట్ బ్యాంక్ పైనే చిక్కాల ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.