కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న చిరంజీవి
posted on Jun 23, 2012 @ 2:15PM
రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నారా? పీఆర్పీ అధినేతగా సాధించలేనిది కాంగ్రెస్‌లో ఉంటే కలిసివస్తుందంటూ తానే ఢల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఇప్పుడు ఆ పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పుడో వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆహ్వానం పలికితే చాలా ఆలస్యంగా స్పందించిన చిరంజీవిని ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంది. అందుకే రాజ్యసభ సభ్యత్వం కూడా ఆయనకు ఇచ్చింది. 2014 నాటికి ఏ నాయకుడూ కలిసి రాకపోతే చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంటుందని సోనియాగాంధీ భావించారు. అసలే ఉప ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా లేవని, రాష్ట్రపతి ఎన్నికలు కూడా ముంచుకొచ్చాయన్న ఆందోళనలో హడావుడిగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానంపై చిరు చేసిన వ్యాఖ్యానాలు ఘాటుగా ఉన్నాయి. 2014 ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు ఆశలు వదులేసుకున్నారని చిరు విమర్శించారు.
రామచంద్రపురం కాంగ్రెస్ కార్యకర్తలతో చిరు అవసరం లేని ప్రేలాపన పేలినట్లు అయింది. కాంగ్రెస్‌లో పీఆర్పీని కలిపేశాక ఇక విడిగా పీఆర్పీ ఎక్కడ ఉంది? అని తనను తాను ప్రశ్నించుకోకుండానే చిరు తొందరపడ్డారు. పైగా, రామచంద్రపురంలో మంత్రి తోట నర్సింహం, ఎంపి జివి హర్షకుమార్ తదితరులు ముందుండి మరీ త్రిమూర్తులు విజయానికి కృషి చేస్తే కాంగ్రెస్‌ను అవమానించటం చిరంజీవికే చెల్లింది. దీనికి తోడు అసలు నెగ్గటానికి అవకాశం లేని స్థితిలో తోట నర్సింహం ఒకవైపు కులసమీకరణలు చేస్తూనే తెలుగుదేశం ఓటుబ్యాంకును తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఇక హర్షకుమార్ అయితే తన సామాజిక వర్గ నేతలు (ఎస్సీలు) తోట విజయానికి ప్రధానపాత్రధారులు కావాలని నిజాయితీగానే కోరారు. వీరిద్దరూ ఒకరకంగా నియోజకవర్గంలో రాజకీయాలను పెద్దమలుపు తిప్పటమే కాకుండా కమ్మసామాజిక వర్గాన్ని, శెట్టిబలిజ సామాజికవర్గంలో ప్రతినిధులను ఆకర్షించటంలో సఫలమవడంతో తోట విజయం సాధ్యమైంది. అసలు చిరంజీవి రానక్కర్లేదని తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించేంత బలంగా కాంగ్రెస్ పని చేసింది. ఇక తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో చిరంజీవి పీఆర్పీ కార్యకర్తలతో సమావేశం కాకపోవటం, స్థానికంగా కొందరు పి.ఆర్.పి.నేతలు కాంగ్రెస్ అభ్యర్దిని వ్యతిరేకించటమే ఆ పార్టీ అభ్యర్ది ఓటమికి కారణమని తేలింది. అంటే తిరుపతి ఓటమికి చిరంజీవే ప్రధానకారణమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అసలు తప్పు తన కింద పెట్టుకుని చిరు పీఆర్పీని ఆదరించటం లేదని కాంగ్రెస్‌పై రుసరుసలాడటం ఒకరకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.