కేంద్ర నిధుల కోతతో కునారిల్లుతున్న గ్రామాలు?
posted on Jun 23, 2012 @ 3:09PM
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవటం వల్ల గ్రామాల్లో అభివృద్థి కుంటుపడుతోంది. పంచాయతీ పాలకులు లేకపోవటంతో కేంద్రం నిధులు మంజూరు చేయటం లేదు. దీంతో గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. స్పెషలాఫీసర్ల పాలనలో ప్రతీఏటా విడుదలయ్యే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. పదినెలల క్రితమే పంచాయతీల్లో సర్పంచ్‌లు, సభ్యులు పదవీకాలం పూర్తయినా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదు. కనీసం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా ప్రకటించలేకపోయింది. ఉప ఎన్నికల్లో ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉండటంతో ఆర్నెళ్లపాటు ఈ ఎన్నికలకు దూరమయ్యేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ విషయాన్ని గమనించిన కేంద్రం ఈ అభివృద్థి నిధుల్లో కోతలు పెట్టింది. ఏడాదికి రెండు విడతలుగా విడుదలయ్యే ఈ నిధులు నాలుగువందల కోట్ల రూపాయలుండేది. అంటే విడతకు రెండొందల కోట్ల రూపాయలు కేంద్రం పంపించేంది. అయితే ఈసారి పంపించేదీ లేనిదీ కూడా తేల్చలేదు. 13వ ఆర్థికసంఘం నిధులు ఈ ఏడాది లేనట్లే అని కేంద్రంలో ఉన్న పెద్దలు తేల్చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషోర్‌చంద్రదేవ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఉన్న నిధులతో ఈ ఏడాది అభివృద్ధి చేసుకోమని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు అంటున్నారు. మరి రాష్ట్రప్రభుత్వం ఈ చేదువార్తపై ఎలా స్పందిస్తుందో చూడాలని పంచాయతీ స్థాయి నేతలు ఎదురుచూస్తున్నారు.