అనంత విద్యార్థులకు అన్యాయం
posted on Jun 23, 2012 @ 2:50PM
ఒకప్పుడు కరువు విలయతాండవం చేసిన జిల్లా అనంతపురం. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆకలికి తట్టుకోలేరని ప్రభుత్వపాఠశాలల్లో చేర్పించేవారు. అంతటి దయనీయమైన స్థితిలో ఉన్న ఆ జిల్లాలో ఇప్పుడు నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. 8మంది ఎంఇఓలు మధ్యాహ్నభోజన పథకం నిధులు ఉపయోగించుకోకపోవటంతో అవి వెనక్కివెళ్లిపోయాయి. రూ.31.96లక్షల రూపాయల నిధులు మురిగిపోయాయని పాఠశాల విద్యాసంచాలకుడు ఈ ఎనిమిది మందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ నివేదికను ఆయన కోరారు. దీంతో ఆ ఎనిమిది మంది ఎంఇఓలకు మెమోలు జారీ అవుతున్నాయి. అనంతపురం, హిందుపురం, కళ్యాణదుర్గం, గుడిబండ, అమరాపురం, బ్రహ్మసముద్రం, సి.కె.పల్లి, పరిగి మండలాల్లో విద్యార్థులకు అన్యాయం జరిగింది. హిందుపురం ఎంఇఓ వైఖరి కారణంగా రూ.17లక్షలు వెనక్కి వెళ్లాయి. విచిత్రంగా ఆయన లక్షరూపాయలు కావాలని ప్రతిపాదనలు పంపించారు. భోజనాలు తయారు చేసే ఏజెన్సీలకు చెల్లించాల్సిన నిధులు, కార్మికుల నిధులు వెనక్కి వెళ్లాయి. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి అనంత విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని విద్యాశాఖాధికారులు అంటున్నారు.