నైతికశిక్షణ లేక రక్షకులే కీచకులవుతున్నారా?
posted on Jul 7, 2012 @ 10:42AM
కాపాడాల్సినవారే కామాంధులైతే...రక్షించాల్సిన చేతులు కీచకపర్వానికి తెరలేపితే...వంటి హెడ్డింగులు తరుచుగా పోలీసుశాఖలో కొత్తగా చేరిన కొందరి గురించి తరుచుగా పత్రికల్లో కనిపిస్తుంటాయి. అయినా సరే! కొత్తగా సర్వీసుల్లో చేరేవారిని పోలీసు ఉన్నతాథికార్లు అదుపు చేయలేకపోతున్నారు. ఆ తరువాత బాధితుల ఆరోపణలకు దర్యాప్తు చేసేటప్పుడు ఉన్నతాధికారి అలా ఎందుకు చేశావని సిబ్బందిని ప్రశ్నిస్తుంటారు. అంటే చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా పోలీసు శిక్షణ ఉంటోందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోలీసుశిక్షణలో నైతికతకు ఉన్నతాథికారులు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. నైతికప్రవర్తనపైనే శిక్షణ ప్రారంభిస్తే హోంగార్డు, కానిస్టేబుల్ స్థాయిల్లో అత్యాచారాలు, నేరాలు గురించి ఫిర్యాదులు వచ్చే అవకాశం లేదు. ఆ తరువాత సర్వీసు నుంచి సస్పెన్షన్‌లు ఇతర తలనొప్పులు తగ్గుతాయి.
తాజాగా సిఎం సొంతమండలంలో ఓ కీచకపర్వానికి తెరలేచింది. చిత్తూరుజిల్లా కలికిరి మండలంలో ఇంజనీరింగ్ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఒడిశా నుంచి కూలీలు వచ్చారు. వారిలో నలుగురు యువతులు కూడా ఉన్నారు. ఈ కూలీలు ఇందిరమ్మకాలనీలో బస చేస్తారు. ఈ విషయం తెలిసిన ఇద్దరు కానిస్టేబుల్స్, ఇద్దరు హోంగార్డులు పహారా పేరిట పథకం ప్రకారం ఆ నలుగురు యువతులపై అత్యాచారం చేశారు. ఎవరికి చెప్పినా ఊరుకోమని బెదిరించి వెళ్లిన తరువాత ఉదయం ఆ నలుగురూ ఏడుస్తుంటే విషయం కనుక్కున్న మేస్త్రీలు పోలీసుస్టేషన్‌కు వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్స్ యూసఫ్, రమేష్, హోంగార్డులు భాస్కర్, నాగరాజు అత్యాచారం చేశారని ఆ ఫిర్యాదులో వివరించారు. మదనపల్లి డిఎస్పీ రాఘవరెడ్డి బాధ్యులపై చర్య తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.