కోపం వచ్చినా ఆనందం వచ్చినా తలసాని తీరే వేరు
posted on Jul 7, 2012 @ 11:31AM
తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాసయాదవ్‌తో పరిచయమున్న అందరూ ఆయనకు కోపం వచ్చినా ఆనందం వచ్చినా పట్టుకోలేమంటున్నారు. నిన్నటికి నిన్న ఘాటైన విమర్శలతో తెలుగుదేశంపై ఒంటికాలిపై లేచిన తలసాని ఇప్పుడు ఈ పార్టీ తీరే వేరని గొప్పగా చెబుతున్నారు. పైపెచ్చు బోనాల పండుగకు మా పార్టీ నేత చంద్రబాబును ఆహ్వానించానని కాలరెగరేసి మరీ చెబుతున్నారు. ఇదేమిటీ నిన్నేమో తిట్టేశారు ఈ రోజేమిటీ మా బాబుని పిలిచేశానని గొప్పగా చెబుతున్నావు అని ఎవరైనా అడిగారో వారికి ఓ పెద్దక్లాసే పీకుతున్నారు. మా సొంత పార్టీపై అలుగుతాను, కోప్పడతాను, అలానే గొప్పగా చెప్పుకుంటాను అది నా ఇష్టమే కదా! అని తిరిగి ప్రశ్నించేస్తున్నారు. దీంతో ఇదేం తలనొప్పిరా బాబు అనుకుని అడిగిన వారు మౌనంగా దిక్కులు చూడకుండా బయటకు వెళ్లిపోతున్నారు. పోనీ! ఎవరైనా ఇప్పటికైనా సర్దుకున్నావా అని ప్రశ్నిస్తే వారికీ క్లాసు తప్పదు. సేమ్‌పొజిషన్‌లో మౌనంగా వెనుతిరగాల్సిందే.
ఇప్పటి దాకా కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యాలయానికి దూరంగా ఉన్న తలసాని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలో చేరతారని అంచనాలు వినిపించాయి. ఆయన కూడా జగన్‌ను మాత్రమే అరెస్టు చేశారు, మరి మిగిలిన మంత్రుల సంగతేమి చేశారని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. దీంతో ఈయన కనఫర్మ్‌గా వై.కా.పా.లో చేరిపోతారనుకున్నారు. ఈలోపు మనస్సు మార్చుకుని చంద్రబాబుతో ప్రత్యక్షమయ్యారు. తాను కొన్నాళ్లు దూరంగా ఉన్నా పార్టీని మాత్రం వదలనని బాబు ఎదుటే ప్రకటించారు. అంటే బుజ్జగింపు కార్యక్రమం కూడా జరిగే ఉంటుందని ఎవరైనా అనుకుంటే పప్పులో కాదుకాదు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే తలసాని దేశంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తరువాతే బాబును కలిశారు కాబట్టి బుజ్జగించే పని లేకుండా తలసాని లొంగిపోయారన్న మాట.