జగన్ వోటు ప్రణబ్‌కే
posted on Jul 19, 2012 8:34AM
కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసేందుకు వై.కా.పా. అథినేత జగన్మోహనరెడ్డి సిద్ధమయ్యారని సమాచారం. అత్యంత విశ్వసనీయమైన ఈ సమాచారం అందరికీ ఆసక్తిని పెంచింది. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగ్మాకు బిజెపి మద్దతు ఇచ్చినా జగన్ మాత్రం ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు తెలుపుతున్నారు. అలానే ఈయన తరుపు ఎమ్మెల్యేలు కూడా ప్రణబ్‌కే మద్దతు ఇస్తున్నారు. దీని వెనుక కారణాలు పరిశీలిస్తే అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న జగన్‌ను కాపాడుకునేందుకు ఆయన తల్లి, వై.కా.పా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రధానిని కలిశారు. జగన్‌పై ఇడి ప్రభావం కనుక తగ్గిస్తే తాము రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ఆమె భరోసా ఇచ్చారట. అదీ జగన్ సూచన ఆథారంగానే ప్రధానితో బేటీ జరిగిందని తెలుస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసేందుకు సిబిఐ కోర్టు జగన్‌కు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణకు అనుమతి ఇచ్చింది. అయితే పోలింగ్ పేరిట బయటివారితో జగన్ సంప్రదించకుండా ఓటుకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్న సిబిఐ సూచనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఓటు వేయటానికి అనుమతి ఇవ్వటంతో జగన్ ఎవరికి ఓటు వేస్తారన్న ఆసక్తి ఎక్కువైంది. అయితే విజయమ్మ ఢల్లీ పర్యటన సమయంలో ప్రధానికి ఇచ్చిన హామీ మేరకు ఓటు ప్రణబ్‌కే అన్న విషయం తేలిపోయింది. అంతేకాకుండా చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌పై ఇడి ఒత్తిడి చేయకపోవటమూ విజయమ్మ ఢల్లీ పర్యటన ఫలితమని తెలుస్తోంది. ఏదేమైనా జగన్ సీనియర్ నాయకుడు, రాష్ట్రపతి పదవికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ప్రణబ్ అని పార్టీశ్రేణులకు వివరించారట. దీని ప్రకారం పరిశీలించినా జగన్ ఓటు ప్రణబ్‌కే అన్న విషయం అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించి మంత్రి పదవిని అనుభవించినందుకు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా ప్రణబ్‌కే ఓటేస్తారని భావిస్తున్నారు.