నిమ్మగడ్డకు త్వరలో బెయిల్ ?
posted on Jul 19, 2012 8:36AM
జగన్ అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడాజైలులో ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ త్వరలో బెయిల్‌పై బయటకు రానున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఎ`2 ముద్దాయిగా ఉన్న జగతిపబ్లికేషన్స్ వైస్‌ఛైర్మన్, ఆడిటర్ విజయసాయిరెడ్డికి బెయిల్ దొరికినట్లే ప్రసాద్‌కూ బెయిల్ వస్తుందని ఆయన న్యాయవాది ఆశిస్తున్నారు. దీనికి అవసరమైన వాదన డిఫెన్స్ లాయర్ ఉమామహేశ్వరరావు సిబిఐ కోర్టులో పూర్తి చేశారు. ఎ`2ను వదిలేసి ఎ`12గా ఉన్న నిమ్మగడ్డను సిబిఐ జైలులో ఉంచిన తీరును ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఏ విషయమూ తేల్చకుండా అలా జైలులో ఉంచితే కోర్టు విధించిన శిక్ష కన్నా ఎక్కువ సమయం జైలుజీవితం గడిపినట్లుంటుందని విశదీకరించారు. అసలు జగతిపబ్లికేషన్స్ కేసులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిందితుడవుతారని, ఆయన చనిపోయినందున నిందితుడు కాదంటే సిబిఐ చెబుతున్న కుట్రకు అర్థమే లేదని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ లేనప్పుడు అసలు కుట్రే జరగలేదనుకుంటే నిమ్మగడ్డ కుట్రదారుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. బెయిల్ పొందేందుకు విజయసాయిరెడ్డి అర్హుడైతే నిమ్మగడ్డ కూడా అర్హుడేనని వివరించారు. భారతీసిమ్మెంట్సులో తమ క్లయింట్ పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చేశాయని, ఆ వ్యవహారంలోనే రూ.62 కోట్లకు ఆదాయపన్ను కూడా చెల్లించారని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ కంపెనీ భారతీ సిమ్మెంట్సు కొన్నందున నిమ్మగడ్డ పెట్టుబడి తిరిగి ఇచ్చేశారని తెలిపారు. వాన్‌పిక్ ప్రాజెక్టు గురించి రాష్ట్రప్రభుత్వమూ, రస్`అల్`ఖైమాకు లేని అభ్యంతరాలు సిబిఐకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. భూకేటాయింపులన్నీ కేబినెట్ అనుమతితోనే జరిగాయని, అసలు అన్ని ఆథారాలు సిబిఐ వద్ద ఉంటే నిమ్మగడ్డ వాటిని ఇక తారుమారు చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇలా నిమ్మగడ్డ తరుపున పటిష్టమైన వాదనను సిబిఐ కోర్టు ముందుంచినందున ఆయన త్వరలో బయటికి వస్తారని ప్రసాద్ కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.