నాడు ఎన్టీఆర్...నేడు కిరణ్ కుమార్ !
posted on Jul 19, 2012 8:38AM
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో బస చేయటంతో గిరిజనులు మళ్లీ ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు. తమతో పాటు ఒకరాత్రి గడిపిన నందమూరి తారక రామారావును మరిచిపోవటం సాధ్యం కాదని ఈ సందర్భంగా గిరిజనులు అన్నారు. గత 20ఏళ్లుగా ఏ నాయకుడు ఏజెన్సీ లోతట్టు గ్రామాలకు వచ్చినా గిరిజనులు మాత్రం ఎన్టీఆర్ ఆరోగ్యం బాగుందా? అని ప్రశ్నిస్తునే ఉన్నారు. వారు ఎన్టీఆర్ మరణించారంటే ఇప్పటికీ లోతట్టు గ్రామాల గిరిజనులు నమ్మటం లేదు. తాజాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన గురించి అధికారులు చెప్పినప్పుడు కూడా వారు ఎన్టీఆర్ తరువాత సిఎంగా మాత్రమే భావిస్తున్నారు. అంటే ఇంకా వారి దృష్టిలో ఎన్టీఆర్ బతికే ఉన్నారన్నమాట. ఎన్టీఆర్ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏజెన్సీ వచ్చారు. అంతేకాకుండా ఎన్టీఆర్ వచ్చినప్పుడు భూపతిపాలెం ప్రతిపాదనలు పంపించమన్నారని గుర్తు చేసుకున్నారు.
అదీ అప్పటి ఎమ్మెల్యే జగ్గారావు విజ్ఞప్తి మేరకు భూపతిపాలెం ప్రతిపాదనలు ఎన్టీఆర్ కోరారు. ఆ ప్రాజెక్టుకు కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రంపచోడవరంలో ఎన్టీఆర్ పర్యటించిన తరువాత మారేడుమిల్లి గిరిజన తండాల సమీపంలో ఒకగుడారం వేయించుకున్నారు. గిరిజనులను ఎన్టీఆర్ పలకరించిన తీరు ఆకట్టుకుంది. ఇది లోతట్టు ప్రాంతాల నుంచి ఎన్టీఆర్‌ను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. అప్పట్లో ఆయన్ని చూడటమే గొప్పగా గిరిజనులు భావించారు. గొప్పవాడైనందునే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని విశ్వసించారు. ఆ తరువాత వచ్చిన చంద్రబాబును కానీ, వైఎస్‌ఆర్ కానీ లోతట్టు ప్రాంత గిరిజనులకు ఇంకా తెలియదు. వీరిద్దరి పరిపాలనా కాలం కూడా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారని భావించారు.
తాజాగా భూపతిపాలెం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలలోని ఓ గదిలో విశ్రాంతి తీసుకున్నారు. దీనికి ముందు గిరిజన విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలానే వారితో పాటు క్రికెట్ కూడా ఆడారు. గతంలో తాను క్రికెట్ ఆడిన అనుభవాలను గిరిజన విద్యార్థులతో పంచుకున్నారు. తాను ఉన్న ఒక్కరోజు అనుభవాలు మరిచిపోలేనని సిఎం శెలవు తీసుకుంటుంటే గిరిజనులకు మాత్రం కళ్ల ముందు ఎన్టీఆర్ మెదిలారు.