బాలీవుడ్ లో మొదటి సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా
posted on Jul 18, 2012 @ 5:05PM
అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన రొమాంటిక్ హీరోగానే కాకుండా హిందీ చిత్రపరిశ్రమలో మొట్టమొదటి సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన ప్రదర్శించిన హావభావాలు, స్టైల్స్, డాన్సులు, డైలాగులు అభిమానులను గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఎంతగా అంటే ఆయనను పదేపదే అనుకరించేలా. ఆయనెవరో కాదు బాలీవుడ్ మొట్టమొదటి సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా. 69 ఏళ్ల ఖన్నా బుధవారం మధ్యాహ్నం తన నివాసంలో శాశ్వతనిద్రలోకి జారుకున్నారు.
సినిమా జీవితం ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు అభిమానులతో ‘కాకా’ అని ముద్దుగా పిలుపించుకున్నారు. ఆయనెక్కడకు వెళితే అక్కడ అభిమాన తరంగం సునామీలా పొంగుకొచ్చేది. ఆయన కనబడితే చాలు ఫ్యాన్స్ వరుస కట్టేవారు. ఆయన పేరును నిత్యాపారాయణంలా జపించేవారు. అభిమానులుఆయన కారును ముద్దుల్లో ముంచెత్తిన సంఘటనలు ఉన్నాయి. ఇక మహిళా అభిమానులు నుంచి రక్తంతో రాసిన ప్రేమలేఖలు లెక్కలేనన్ని అందుకున్నారు. ఆయన కంటే ముందు రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ కూడా అభిమానులను అలరించినప్పటికీ ఖన్నా ఏకంగా వారి హృదయాల్లోనే పాగా వేశారు.
1942, డిసెంబర్ 29న జన్మించిన రాజేష్ ఖన్నా దత్తత తీసుకున్న తల్లిదండ్రుల దగ్గర పెరిగారు. ఆయన అసలు పేరు జతిన్ ఖన్నా. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలంటే పిచ్చి. స్కూల్లో ఎన్నో నాటకాల్లో నటించారు. సినిమాల్లో చేరాలనుకుని నిర్ణయించుకున్నాక 1965లో తన పేరును రాజేష్‌గా మార్చుకున్నారు. అదే ఏడాది యునెటైడ్ ప్రొడ్యూసర్స్, ఫిల్మ్‌ఫేర్ నిర్వహించిన ఆల్ ఇండియా టాలెంట్ పోటీలో విజేతగా నిలిచి సినిమా అవకాశం దక్కించుకున్నారు. చేతన్ ఆనంద్ దర్శకత్వంలో ‘ఆఖరి కథ్’ చిత్రం ద్వారా ఖన్నా వెండితెరపై అడుగుపెట్టారు. 1969లో వచ్చిన ‘ఆరాధన’ చిత్రం ఆయన స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో గాయకుడు కిషోర్‌కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడమే కాకుండా రాజేష్ ఖన్నా ఆస్థాన గాయకుడిగా మారిపోయాడు. అక్కడి వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్‌హిట్ పాటలు వచ్చాయి. ఆర్‌డీ బర్మన్, ఖన్నా, కిషోర్‌కుమార్ కలిసి 30పైగా సినిమాలు చేశారు.
CLICK HERE FOR RAJESH KHANNA PHOTOS
ఆరాధన సినిమా తర్వాత ఖన్నా శకం ప్రారంభమైంది. 1969-1972 మధ్య కాలంలో ఏకబిగిన 15 సోలో సూపర్ హిట్‌లిచ్చి భారతీయ చిత్ర పరిశ్రమలో తిరగరాయలేని రికార్డును తన పేరిట లఖించుకున్నారు. మొత్తం 163 సినిమాల్లో నటించిన ఆయన 106 చిత్రాల్లో సోలో హీరోగా చేశారు. 14సార్లు ఫిల్మ్‌ఫేర్కు నామినేటయి మూడుసార్లు బెస్ట్ హీరోగా అవార్డు అందుకున్నారు. 2005లో ఫిల్మ్‌ఫేర్ లఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం స్వీకరించారు.
80వ దశకం చివరివరకు తన నటనతో అభిమానులను అలరించిన ఆయన 1992-96 వరకు కాంగ్రెస్ తరపున లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారు. 70వ దశకం ఆరంభంలో అంజు మహేంద్రుతో ప్రేమాయణం సాగించిన రాజేష్ ఖన్నా 1973లో తన కంటే 15 ఏళ్లు చిన్నదయిన డింపుల్ కంపాడియాను పెళ్లిచేసుకున్నారు. 1984లో వీరు విడిపోయారు. వీరికి ట్వింకిల్, రింకిల్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. డింపుల్‌కు దూరమయిన తర్వాత టీనా మునియమ్ (ఇప్పుడు అంబానీ)కి దగ్గరయ్యారు. వీరిద్దరూ ఫిఫ్టీ-ఫిఫ్టీ, అధికార్, బెవఫాయ్, సురాగ్ తదితర సినిమాల్లో నటించారు. విభిన్న పాత్రలు పోషించినా ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ హీరోగానే ఖన్నా ఖ్యాతికెక్కారు. ఆయన మరణంతో బాలీవుడ్‌లో ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు.
CLICK HERE FOR RAJESH KHANNA PHOTOS