ఐ.ఎ.ఎస్.లలో అవినీతి పరులు లేరా?
posted on Jul 18, 2012 @ 3:22PM
రాష్ట్రమంత్రి టి.జి.వెంకటేష్ ఐ.ఎ.ఎస్.ల పనితీరుపై విసుగుచెంది పని చేయని అధికారులను నడిరోడ్డుపై కాల్చి వేయాలని బహిరంగంగా ప్రకటించడంతో ఐ.ఎ.ఎస్. వర్గాల్లో కలకలం ప్రారంభమైంది. మంత్రి ప్రకటన తమ మనోధైర్యాన్ని దెబ్బతీసేదిగా ఉందని రాష్ట్ర ఐ.ఎ.ఎస్. అధికారుల సంఘం ప్రతినిధి రేమాండ్ పీటర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఐ.ఎ.ఎస్. ఆవేదన సరైందే. కాని వారిలో కూడా అత్యంత అవినీతి పరులు, బద్దకస్తులు, అహంభావులు ఉన్నారు వారి మాటేమిటి? నిజానికి ఐ.ఎ.ఎస్.లను ఘాటుగా విమర్శించిన వారిలో టి.జి.వెంకటేష్ మొదటి వారు కాదు.
పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వారి పనితీరుపై తీవ్ర అసంతృప్తిని గతంలో వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ అయితే వారిని మంచి సేవకులే గాని మంచి పాలకులు కాదని అభిర్ణించగా సుబోధ్ కాంత్ సహాయ్ వారిని జోకర్ల సమూహంగా తేల్చిపారేశారు. కేంద్రమంత్రి జైరాం రమేష్ మరో ముందడుగువేసి బ్యూరోక్రాట్లను ఆటో క్రాట్లన్నారు. ప్రభుత్వ విధానాలను రూపొందించాల్సిన బాధ్యత ప్రజానాయకులపై ఉందని బ్యూరో క్రాట్లు ప్రభుత్వ విధానాలను రూపొందించడానికి సహäయ పడే కన్సల్టెంట్స్ మాత్రమే కాని విధాన రూపకల్పనకు కర్తలు కాదని స్పష్టం చేశారు.
నిజానికి ఐ.ఎ.ఎస్.లోని కొందరు చడీ చప్పుడు లేకుండా కోట్లాది రూపాయలు అక్రమ మార్గంలో ఆర్జిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లి హిల్స్‌లో కొందరు ఐ.ఎ.ఎస్. అధికారులకు కోట్లాదిరూపాయల విలువ చేసే బంగ్లాలు ఉన్నాయి. వీరికొచ్చే నెలవారి జీతాలు , అలవెన్స్‌లతో ఇటువంటి బంగ్లాలను నిర్మించడం సాధ్యం కాదు. రాష్ట్ర సచివాలయంలో కొందరు ఐ.ఎ.ఎస్.లకు ఏజెట్లు ఉన్నారు. వీరి పని ఐ.ఎ.ఎస్.ల తరఫున లంచాలు వసూలు చేయడం. ఇలా చేయడం వల్లనే ఇప్పటికే శ్రీలక్ష్మీ, బి.పి. ఆచార్య జైళ్ళలో మగ్గుతున్నారు. ప్రస్తుత ఐ.ఎ.ఎస్.ల పని తీరుచూస్తుంటే ఆ వ్యవస్ధను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పిస్తోంది.