సీమాంధ్రుల వోటు హక్కును కాలరాచిన బాబు
posted on Jul 18, 2012 @ 3:19PM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల వోటు హక్కును కాలరాచారన్న అపవాదును ఎదుర్కోంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ అభ్యర్దికి వోటు వేయకూడన్న పార్టీ నిర్ణయం పట్ల సీమాంధ్రకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధుల వత్తిడికి లొంగి పోలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని అయితే ఈ నిర్ణయం వల్ల తమ వోటు హక్కుకు భగం కలిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ తెలంగాణా వ్యతిరేకి అని , సంగ్మాకు మతతత్వ బి.జె.పి. మద్దతు ఇస్తున్నందువల్ల ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నిజానికి ప్రణబ్ ఎప్పడూ తెలంగాణాకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. అలాగే గతంలో తమ పార్టీ బి.జె.పి.తో చెట్టాపట్టాల్ వేసుకుతిరిగిన విషయం అందరికి తెలిసిందేనని, బి.జె.పి. మద్దతు ఇచ్చినంత మాత్రాన సంగ్మా మతతత్వవాది అయిపోతారా ? వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెబుతున్నవన్నీ కుంటి సాకులేలని , తెలంగాణా ప్రజా ప్రతినిధుల వత్తిడికి ఆయన లొంగిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా వాదులను సంతృప్తి పర్చడానికి తమ వోటు హక్కును కాలరాయడం ఎంత వరకూ సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.