లోక్‌సత్తాకున్న ధైర్యం ఇతరపార్టీలకు లేదా ?
posted on Jul 19, 2012 @ 12:02PM
ఒక దేవాలయానికి విరాళం ఇస్తే, అన్నదానం చేస్తే కూడా ఆదాయపన్ను రాయితీ లభిస్తుంది. సెక్షన్ 80జి కింద ఆదాయపన్ను శాఖకు చూపవచ్చు. కానీ, రాజకీయపార్టీలు ఎటువంటి విరాళం తీసుకున్నా రశీదులు ఇవ్వవు. 90శాతం విరాళాలన్నీ అలానే తీసుకుని ఎన్నికల సమయంలోనూ, ఇతర రహస్యకార్యక్రమాల్లోనూ వాటిని వాడుతుంటారు. 2012 లో జరిగిన దేశంలోనే అంత్యంత ఖరీదైన ఉప ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఖర్చులు చేశారు. లెక్కల్లో చూపని ఈ నల్లధనాన్ని రెండొందల కోట్లకు పైగా ఖర్చు చేశారు. మొత్తం అసెంబ్లీస్థానాల్లోనూ ఇదే తరహా ఖర్చులు జరిగాయని తేలినా ప్రభుత్వమూ, అటు ఎన్నికల కమిషనూ బీరాలు పలికి సర్దుకుపోయాయి.
ఇంత జరగటానికీ ఒకటే కారణం లెక్కల్లో చూపని డబ్బునే రాజకీయపార్టీలు తీసుకుంటాయి. ఆ నల్లధనాన్నే వినియోగిస్తాయి. పైగా వీటికి హుండీ ఆదాయం అని కూడా పేరుపెట్టాయి. ఈ హుండీ ఆదాయాల బురిడీకి ప్రభుత్వం ఎప్పుడు మంగళం పాడుతుందన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న.. దీనిపై అసలు చర్యలు తీసుకోవాలన్న ఆలోచనే ప్రభుత్వాలకు కొరవడిరది. ఎందుకంటే ఓట్లు కొనుక్కుంటే కానీ, ఏ పార్టీ కూడా అథికారంలోకి రాలేని నేటి పరిస్థితులు. ఇలా ఇంకెన్నాళ్లు అని ఆలోచనతో వచ్చిన లోక్‌సత్తా రాజకీయపార్టీలన్నింటినీ ఒకటే ప్రశ్న అడుగుతోంది.
అదేంటంటే తీసుకున్న ప్రతీ పైసాకు రశీదు ఇవ్వగల థైర్యం ఇతర రాజకీయ పార్టీలకు లేకుండా పోయిందని లోక్‌సత్తా విమర్శిస్తోంది. ఒక్కపైసాకు కూడా రశీదు ఇవ్వగలిగిన సత్తా తమ పార్టీకి మాత్రమే సొంతమని ఆ పార్టీ అథ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ అన్నారు. అలానే ఆదాయపన్ను నుంచి కూడా మినహాయింపు ఇప్పిస్తామన్నారు. మరి మిగతా జాతీయపార్టీలు ఈ తరహా ప్రకటన ఎందుకు చేయలేకపోయాయో ఒక్కసారి ఆలోచించాలి. ఆదాయపన్ను శాఖ కూడా జాతీయపార్టీల ఆదాయ,వ్యయాలను ఒక్కసారి తనిఖీ చేస్తే బాగుంటుందని, లెక్కల్లో లేని డబ్బులున్నట్లు తెలిస్తే ఆ డబ్బును స్వాధీనపరుచుకుంటే జాతిప్రయోజనాలకు అది ఉపయోగపడుతుందని పలువురు సూచిస్తున్నారు.