జికా వైరస్‌ పేరుతో టాటా కారు!

  ప్రపంచాన్నంతా వణికిస్తున్న వైరస్‌ జికా. పుట్టబోయే పిల్లలను సైతం వదలని ఈ వైరస్‌ ఇప్పడు టాటా సంస్థని కూడా తాకింది. కారణం! టాటా మూడేళ్లపాటు కృషి చేసి రూపొందించిన కారుకి జికాని పోలిన పేరు పెట్టుకోవడమే! తమ కారు వేగంగా ఉంటుంది అన్నదానికి సూచనగా టాటా తన కొత్త కారుకి Zippy Car అన్న పేరుని నిర్ణయించింది. దీన్ని పొడి అక్షరాలలో ZICAగా మార్చి అదే బ్రాండుతో విపణిలోకి వెళ్లాలని ఆశించింది. కానీ ఈ పేరు Zika Virusకు దగ్గరగా ఉండటంతో ఇప్పుడు టాటాకి లేనిపోని తలనొప్పులు మొదలయ్యాయి. ప్రచారం కోసం కావాలనే జికా వైరస్‌కు దగ్గరగా ఉన్న పేరుని ఎంచుకున్నారన్న విమర్శలూ మొదలయ్యాయి. విమర్శలే పనిచేశాయో లేకపోతే అలాంటి పేరు అసందర్భంగా ఉంటుందని తోచిందో కానీ ఇప్పుడు టాటా తన ZICA కారుకి మరో పేరుని వెతుక్కేనే పనిలో పడిపోయింది. కానీ అప్పటి వరకూ ఈ కారు పాత పేరుతోనే ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకూ డిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలో కూడా ఇదే పేరుతో ఈ కారుని ప్రదర్శించనున్నారు. ఈ కారు ఏమేరకు వ్యాపిస్తుందో చూడాలి మరి!

A-1 నిందితుడుగా ముద్రగడ పద్మనాభం

  గత నెల 31న తుని వద్ద జరిగిన హింసాకాండకి సంబంధించి పోలీసులు పలు కేసులను నమోదు చేశారు. రైల్వే ఆస్తులను తగలబెట్టడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం, విధులలో ఉన్న పోలీసుల మీద దాడి చేయడం… ఇలా దాదాపు 50కి పైగా కేసులను మోపారు. వీటిలో కొన్ని కేసులలో ముద్రగడ పద్మనాభంని A-1 నిందితునిగా చేర్చడం జరిగింది. ఆందోళనకారులు చాలా కెమెరాలను, సెల్‌ఫోన్లనూ ధ్వంసం చేసినప్పటికీ విధ్వంసానికి తగిన సాక్ష్యాలని పోలీసులు సేకరించగలిగారు. వీటన్నింటి ఆధారంగా దాదాపు 300 మంది నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది. తునిలో జరిగిన సభ హింసాత్మకంగా మారడం అప్పటికప్పుడు జరిగిన పరిమాణం కాదనీ, దీని వెనుక ఒక వ్యూహం ఉందనీ పోలీసులు అనుమానిస్తున్నారు. రైలు పట్టాలకి దగ్గరగా సభాస్థలిని ఎంచుకోవడం, రత్నాచల్‌ వచ్చే సమయానికి రైల్‌రోకోను తీవ్రతరం చేయడం అనేవి ఒక ప్రణాళిక ప్రకారమే జరిగాయని అంటున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభంతో పాటు సభ జరిగేందుకు స్థలాన్ని అందించిన కొబ్బరితోట యజమాని మీద కూడా కేసు మోపినట్లు చెబుతున్నారు.

నోటా లేకపోవడంతో పోలింగ్‌ శాతం తగ్గిందా!

  అత్యంత ఆర్భాటంగా సాగిన గ్రేటర్‌ ఎన్నికలలో నోటా గుర్తులేకపోవడం వల్ల ఏమన్నా నష్టం జరిగిందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు పౌరులు. 2013 సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులలో ఎవ్వరూ కూడా ఓటరుకి నచ్చకపోతే అతను NONE OF THE ABOVE (NOTA) గుర్తుని ఎంచుకోవడం ద్వారా తన అయిష్టతను తెలియచేయవచ్చు. 2013 తరువాత వచ్చిన అన్ని ఎన్నికలలోనూ నోటాని అమలుచేశారు. పైగా కొన్ని స్థానిక ఎన్నికలలో సైతం నోటాని బ్యాలెట్‌లోకి చేరుస్తున్నారు. కానీ ఓటర్లందినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ గ్రేటర్‌ ఎన్నికలలో నోటా సదుపాయం లేకుండా పోయింది. చాలామంది విద్యావంతులు తమకి ఏ అభ్యర్థీ ఇష్టం లేకపోయినప్పటికీ, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నోటాని ఒక అస్త్రంగా భావిస్తారు. కానీ ఆ సౌకర్యం ఈసారి ఎన్నికలలో లేకపోవడంతో వారు పోలింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల కనీసం రెండు శాతం ఓట్లు తగ్గినట్లు అంచనా! ఎన్నికల కమీషన్‌ మాత్రం స్థానిక ఎన్నికలలో నోటాకి సంబంధించిన స్పష్టత లేకపోవడం వల్లే తాము దానిని అమలుచేయలేదని చేతులు దులిపేసుకుంది.

షబ్బీర్‌ అలీ మీద దాడి!

  గ్రేటర్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ చివరి అంకంలో బాహాబాహీ యుద్ధాలు తప్పలేదు. పాతబస్తీలో జరిగిన పురానాపూల్‌ సంఘటనలో సాక్షాత్తు కాంగ్రెస్‌ ముఖ్యనేత షబ్బీర్‌ అలీ మీదే దాడి జరిగింది. అక్కడ మహమ్మద్‌ గౌస్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గౌస్‌ ఒకప్పుడు మజ్లిస్‌ తరఫున గెలిచి ఇప్పడు కాంగ్రెస్‌ పక్షానికి మారడంతో స్థానిక మజ్లిస్‌ కార్యకర్తలంతా ఆయన మీద గుర్రుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అరెస్టులు, వాగ్వాదాలు సాగాయి. సాయంత్రానికి ఇరుపక్షాల నేతలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిపోయింది. గౌస్‌కి మద్దతుగా వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాహనాన్ని మజ్లిస్‌ కార్యకర్తలు ధ్వంసం చేయడమే కాకుండా, అందులో ఉన్న షబ్బీర్‌ అలీ మీద భౌతికంగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు చోద్యం చూస్తుండిపోవడం గమనార్హం. చివరికి పోలీసులు జోక్యంతో ఉద్రిక్తత చల్లారింది.

TRSదే గెలుపు!

గ్రేటర్‌ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్‌ పోల్స్ సందడి మొదలైంది. ఇవి కాకుండా వివిధ పార్టీలు కూడా తమ వర్గాల ద్వారా ఓటర్ల ఎవరికి విజయాన్ని కట్టబెట్టారన్న దానిమీద ఒక నిర్ణయానికి వచ్చాయి. శాతం ఓటర్లు, పోలింగ్‌ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నదాని ప్రకారం ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌ తాను కూడా ఊహించనన్ని సీట్లను గెల్చుకోబోతోంది. మరో పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేకుండానే తాను సొంతగా మేయర్‌ అభ్యర్థిని గెలిపించుకునే స్థాయిలో ఈ పార్టీకి విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్‌ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్‌ 75 నుంచి 80 వార్డులను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక రెండో స్థానం ఎవరిదన్నదే ఇప్పుడ తేలాల్సిన విషయం. అటు టిడిపి-బిజేపీ కూటమికీ, ఇటు ఎంఐఎంకీ కూడా 30 సీట్లు వస్తాయని ఊహిస్తున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం కాంగ్రెస్ నాలుగో స్థానానికి పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు 10 మించి వార్డులు దక్కవని కొందరి అంచనా! మరో వైపు 600కి పైగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులు చాలామంది దారుణంగా ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

పోలింగ్‌ అద్భుతంగా జరిగింది- ఎన్నికల అధికారి!

  ఏవో చిన్నా చితకా సంఘటనలు మినహా పోలింగ్‌ అద్భుతంగా జరిగిందని ఎన్నికల అధికారి జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలలో ఓటింగ్‌ శాతం పెరిగిందని చెప్పారు. 2009తో 40.9 శాతం పోలింగ్ జరగగా అది ఇప్పుడు 45 శాతానికి పెరగడం సంతోషకరమన్నారు. ఈసారి కేవలం 4 దొంగ ఓట్లు మాత్రమే పడ్డాయనీ, గతంతో పోల్చుకుంటే ఇది నామమాత్రమేనన్నారు. ఇక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు మొరాయించిన సందర్భాలు కూడా చాలా తక్కువేనన్నారు జనార్ధనరెడ్డి. 7802 యంత్రాలలో కేవలం 9 యంత్రాలు మాత్రమే… అది కూడా కొద్ది నిమిషాల సేపే మొరాయించాయని చెప్పారు. ఈసారి వెబ్‌కాస్ట్ ద్వారా ఓటింగ్‌ జరిగే విధానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం వల్ల చాలా సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించగలిగామని చెప్పారు. అయితే పోలింగ్‌ 50 శాతం కంటే తక్కువగా ఉండటం తనకు కూడా నిరాశ కలిగించే అంశమన్నారు. నగర పౌరులలో ఉన్న ఈ జడత్వం పోయేందుకు తాము చాలా కృషి చేశామనీ అయితే ఓటర్లలో అవగాహన కలిగించేందుకు ఇది సరిపోయినట్లు లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించారు జనార్ధనరెడ్డి.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!

  ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన హైదరాబాద్‌ నగరపాలిక ఎన్నికలు ఎట్టకేళకు ముగిసాయి. దాదాపు 45 శాతం చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాతంగానే ముగిసిందంటూ ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. లంగర్‌హౌజ్‌ వద్ద బీజేపీ- టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మధ్య కొంత తోపులాట చోటుచేసుకుంది. ఇక అజంపురాలోని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ నివాసం మీద మజ్లిస్‌ కార్యకర్తలు దాడి చేయడంలో పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. మరోవైపు సమస్యాత్మకంగా భావించే పాతబస్తీలోనూ కొంత ఉద్రిక్తత నెలకొంది. పాతబస్తీలోని మీర్‌చౌక్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌- మజ్లిస్‌ పార్టీలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటనలో కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌ అలీలకు స్వల్ప గాయాలు అయ్యాయి.

"జికా వైరస్" పై ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జన్సీ

లాటిన్‌ అమెరికా దేశాల్లోని ప్రజలకు జికా వైరస్ ఈ మధ్య కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బ్రెజిల్ నుండి.. అమెరికా దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ ను అరికట్టడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నా అవి మాత్రం విఫలమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల గర్భిణీ స్త్రీలకు ఎక్కువ సమస్యలు వస్తున్న నేపథ్యంలోనే ఆదేశాల్లో 2018 వరకూ గర్భదారణ దాల్చవద్దని.. ఆదేశాలు కూడా జారీచేసింది. ఇప్పుడు ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని.. చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ వో) కీలక సమావేశం నిర్వహించి.. ముందే మేల్కొని దీనికి తగిన చర్యలు తీసుకోవడానికి హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించింది. వైరస్ కు టీకాను కనిపెట్టే దిశగా పలుదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు చర్చలు జరపనున్నారు.

పఠాన్‘కోట’లో పాగా

శత్రుదేశం గూఢచారులు నేరుగా మన సైనిక స్థావరాల్లో పాగా వేస్తున్నారు. కాబట్టే ఇటీవలి కాలంలో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు పేట్రేగిపోతున్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట కంటోన్మెంట్ లో ఇర్షాద్ అనే వ్యక్తి అరెస్టుతో ఈ దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగు చూసింది. ఇర్షాద్ ఐఎస్ఐ ఏజెంటు. ఇతడు పఠాన్ కోట కంటోన్మెంట్ లో కార్మికుడిగా చేరి అక్కడి రహస్యాలన్నీ పాక్ ఐెఎస్ఐకి చేరవేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. భారతీయుడైన ఇర్షాద్ స్మార్ట్ ఫోన్ నుంచి కంటోన్మెంట్ కు సంబంధించిన రహస్య సమాచారం స్వాధీనం చేసుకున్నారు. దీన్ని అతడు జమ్ములోని సజ్జాద్ కు పంపించాడు. సజ్జాద్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భారత సైన్యంలో పఠాన్ కోట కంటోన్మెంట్ అత్యంత ప్రధానమైన  సైనిక స్థావరం. ఇంకా ఇలాంటి చీడపురుగులు ఎన్ని ఉన్నాయన్న దానిపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఇటీవలే పఠాన్ కోట ఎయిర్ ఫోర్స్ మీద జరిగిన దాడి దృష్ట్యా, వాటికి పాల్పడిన తీవ్రవాదులకు ఇర్షాద్ తోడ్పాటు కూడా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. పాక్ మన దేశంలో టెర్రరిజాన్ని ఫ్రోత్సహిస్తోందనడానికి ఇదొక నిదర్శనం.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సల్మాన్ ఖాన్ ఓటు..

జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న వేళ చాలా విచిత్రకరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంత మంది పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోతే.. కొన్ని చోట్ల మాత్రం ఇక్కడ లేని వాళ్ల పేర్లు కూడా వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు ఓటర్ల జాబితాలోకి బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ పేరు వచ్చి చేరింది. ఈరోజు గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్ననేపథ్యంలో గౌలిపుర డివిజన్‌ లో ఒక ఓటరు పేరు సల్మాన్‌ఖాన్‌, తండ్రిపేరు సలీమ్‌ఖాన్‌గా పేర్కొంటూ సల్మాన్‌ ఫొటోతో జాబితాలో ఓటు ఉంది. అంతేకాదు అందులో సల్మాన్ వయసు 64 ఏళ్లుగా అధికారులు పేర్కొన్నారు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్లనే జాబితాలో ఇలాంటి విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోర్టులోనే పెళ్లి చేసుకున్న క్రికెటర్..

పెళ్లిళ్లు ఒక్కొక్కళ్లు ఒక్కొరకంగా చేసుకుంటారు. కొంత మంది చాలా సింపుల్ గా పెళ్లిళ్లు చేసుకుంటే.. కొంతమంది చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. ఇప్పుడు క్రికెటర్ వరుణ్ ఆరోన్ కూడా చాలా వెరైటీగా పెళ్లి చేసుకున్నారు. టీమిండియాలో పేసర్ గా పేరుతెచ్చుకున్న వరుణ్ ఆరోన్ సింఫుల్ గా అదీ కోర్టులో పెళ్లి చేసుకొని అందరిని విస్మయానికి గురి చేశారు. జంషెడ్ పూర్ లోని కోర్టులో వరుణ్ తన చిన్ననాటి స్నేహితురాలైన రాగిణి సింగ్ ను పెళ్లాడారు. చాలా సింపుల్ గా చట్టబద్ధంగా కోర్టులో ఏకమైన ఈ జంట.. ఫిబ్రవరి 4న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటారని చెబుతున్నారు.

మీరూ ఓటేయ్యండి.. ఎన్టీఆర్.. ఒంటి గంట వరకు 25.83 శాతం పోలింగ్

జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలింగ్ కేంద్రానికి తన తల్లి, భార్యతో వచ్చి ఓటు వేశారు. ఈసందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనకు అనారోగ్యంగా ఉన్నా కూడా తన ఓటు హక్కును తాను వినియోగించున్నానని.. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడానికి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది అందరూ వచ్చి ఓటేయండి అని విజ్ఞప్తి చేశారు. ఓటుపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. తాను అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఓటు వేయడానికి వచ్చానని తెలిపారు. కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 25.83 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

అనుపమ్‌ ఖేర్‌కు మరో ఎదురుదెబ్బ!

అనుపమ్‌ ఖేర్‌కు పద్మభూషణ్ వచ్చిన సంబరం త్వరలోనే అడుగంటిపోయేట్లు ఉంది. బీజేపీని తరచూ సమర్థించే ఈ నటుడు అందుకు బదులుగా ఏదో చిక్కులో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఇప్పడు తాజాగా అనుపమ్‌ని పాకిస్తాన్‌లో అనుమతించేందుకు ఆ దేశం వీసాని మంజూరు చేయకపోవడంతో అనుపమ్ పేరు కాస్తా పొరుగుదేశాలకి కూడా పాకినట్లుంది. కరాచీలో జరిగే సాహిత్య సమావేశానికి హాజరయ్యేందుకు అనుపమ్ వీసాను కోరడంతో, పాకిస్తాన్‌ దాన్ని తిరస్కరించింది. ఒక పక్క బీజేపీకి మద్దతుని అందించడం వల్లే అనుపమ్‌కి పద్మభూషణ్‌ వచ్చిందని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. దానికి తగినట్లుగానే అనుపమ్‌ తనను మైకు దగ్గరకు పిలిచిన చోటల్లా దేశంలో అసహనం ఏమాత్రం లేదు అని అడగకుండానే చెబుతున్నారు. నిన్నటికి నిన్న కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కి ‘కాంగ్రెస్‌ చెంచా’ అని బిరుదునిచ్చి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పడు తన వీసాను తిరస్కరించినందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని ఏం దుమ్మెత్తి పోస్తారో చూడాలి మరి! పాకిస్తాన్‌ అధికారులు మాత్రం ఈ వివాదంలో తలదూర్చేందుకు సిద్ధంగా లేరు. అసలు అనుపమ్‌ ఖేర్‌ వీసా దరఖాస్తు తమకు అందలేదంటూ చేతులు దులిపేసుకున్నారు. అవును మరి... మాటల మాంత్రికుడు అనుపమ్‌తో తలపడేందుకు ఎవరు మాత్రం సిద్ధంగా ఉంటారు!

అమెరికాలోనూ మతాల రాజకీయమే!

అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ వారం ఒక మసీదుని సందర్శించనున్నారు. అధ్యక్షుని హోదాలో ఆయన తన దేశంలో ఒక మసీదులోకి అడుగుపెట్టడం ఇది తొలిసారి. అమెరికాలో నివసిస్తున్న ముస్లిం పౌరులలో సద్భావాన్ని నింపేందుకు ఈ చర్య తీసుకున్నానని చెబుతున్నారు ఒబామా. కానీ ఈ చర్యని తరచి చూస్తే భారతీయ తరహా రాజకీయ సూత్రాలు కొన్ని బయటపడక మానవు. ఈ సంవత్సరం జరగనున్న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఒబామా సొంత పార్టీ అయిన డెమాక్రెటిక్‌ పార్టీకీ రిపబ్లికన్‌ పక్షానికి మధ్య తీవ్రమైన పోరు జరుగుతోంది. రిపబ్లికన్ తరఫున అభ్యర్థిగా నిలిచే అవకాశం ఉన్న డొనాల్డ్ ట్రంప్ చీటికీమాటికీ ముస్లిం ప్రజల మీద విద్వేషాన్ని చిమ్ముతున్నారు. మసీదులని మూసివేయాలనీ, ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టాలనీ… రకరకాల ప్రకటనలు చేస్తున్నారు ట్రంప్‌. ట్రంప్ మాటలకు ప్రపంచం నలుమూలల నుంచీ నిరసన వినిపిస్తోంది. బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులైతే ఏకంగా ట్రంప్‌ను తమ దేశంలోకి అడుగుపెట్టనీయకూడదని అంటున్నారు. ఆశ్చర్యకరంగా అమెరికాలో మాత్రం ట్రంప్‌కు ప్రజల మద్దతు పెరిగిపోతోంది. ట్రంప్‌ను నిలువరించేందుకు ఇప్పుడు ఒబామా మసీదులోకి అడుగుపెడుతున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. పైగా సందర్శన కోసం ఒబామా ఎంచుకున్న ‘బాల్టిమోర్‌’ మసీదుకి తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ISIS ఉగ్రవాదంతో ముస్లింలకీ ఇతర మతస్తులకీ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకే ఒబామా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఎవరేమన్నా ఒబామా నిజంగా దేశ సమైక్యత కోసమే ఈ పని చేస్తుంటే అంతకంటే కావల్సింది ఏముంది!

టీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్.. 12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యారు. నెరేడ్‌మెట్ పోలింగ్ బూత్ వద్ద డబ్బులు పంచుతూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసుల  ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మధ్యాహ్నం 12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి 60 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. జంట నగరాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా యువతీయువకులు ఉత్సాహంతో ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.

60 మంది విద్యార్ధుల ఆత్మహత్య..

తాము ఆత్మహత్య చేసుకుంటామని 60 మంది దళిత విద్యార్దులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఘటన బీహార్ లో జరిగింది. వివరాల ప్రకారం.. బీహార్‌, భువనేశ్వర్‌లోని రాజ్‌ధాని ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో చదువుతున్న 60 మంది విద్యార్ధులు ప్రభుత్వానికి ఈ రకమైన హెచ్చరిక జారీ చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న వీరికి ప్రభుత్వం ఉపకార వేతం చెల్లించకపోవడంతో విద్యార్థులు కళాశాలనుంచి, హాస్టల్‌నుంచి బైటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వం తమకు ఉపకార వేతనాలు చెల్లించాలని.. ఎస్‌సి,ఎస్‌టి సంక్షేమ శాఖ నిర్లక్ష్యం కారణంగా తమ భవిష్యత్తు అంధకారంలో పడినందున తాము ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు.