పఠాన్‘కోట’లో పాగా
posted on Feb 2, 2016 @ 3:07PM
శత్రుదేశం గూఢచారులు నేరుగా మన సైనిక స్థావరాల్లో పాగా వేస్తున్నారు. కాబట్టే ఇటీవలి కాలంలో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు పేట్రేగిపోతున్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట కంటోన్మెంట్ లో ఇర్షాద్ అనే వ్యక్తి అరెస్టుతో ఈ దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగు చూసింది. ఇర్షాద్ ఐఎస్ఐ ఏజెంటు. ఇతడు పఠాన్ కోట కంటోన్మెంట్ లో కార్మికుడిగా చేరి అక్కడి రహస్యాలన్నీ పాక్ ఐెఎస్ఐకి చేరవేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. భారతీయుడైన ఇర్షాద్ స్మార్ట్ ఫోన్ నుంచి కంటోన్మెంట్ కు సంబంధించిన రహస్య సమాచారం స్వాధీనం చేసుకున్నారు. దీన్ని అతడు జమ్ములోని సజ్జాద్ కు పంపించాడు. సజ్జాద్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భారత సైన్యంలో పఠాన్ కోట కంటోన్మెంట్ అత్యంత ప్రధానమైన సైనిక స్థావరం. ఇంకా ఇలాంటి చీడపురుగులు ఎన్ని ఉన్నాయన్న దానిపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఇటీవలే పఠాన్ కోట ఎయిర్ ఫోర్స్ మీద జరిగిన దాడి దృష్ట్యా, వాటికి పాల్పడిన తీవ్రవాదులకు ఇర్షాద్ తోడ్పాటు కూడా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. పాక్ మన దేశంలో టెర్రరిజాన్ని ఫ్రోత్సహిస్తోందనడానికి ఇదొక నిదర్శనం.