అనుపమ్ ఖేర్‌కు మరో ఎదురుదెబ్బ!
posted on Feb 2, 2016 @ 12:44PM
అనుపమ్ ఖేర్‌కు పద్మభూషణ్ వచ్చిన సంబరం త్వరలోనే అడుగంటిపోయేట్లు ఉంది. బీజేపీని తరచూ సమర్థించే ఈ నటుడు అందుకు బదులుగా ఏదో చిక్కులో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఇప్పడు తాజాగా అనుపమ్‌ని పాకిస్తాన్‌లో అనుమతించేందుకు ఆ దేశం వీసాని మంజూరు చేయకపోవడంతో అనుపమ్ పేరు కాస్తా పొరుగుదేశాలకి కూడా పాకినట్లుంది. కరాచీలో జరిగే సాహిత్య సమావేశానికి హాజరయ్యేందుకు అనుపమ్ వీసాను కోరడంతో, పాకిస్తాన్ దాన్ని తిరస్కరించింది. ఒక పక్క బీజేపీకి మద్దతుని అందించడం వల్లే అనుపమ్‌కి పద్మభూషణ్ వచ్చిందని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. దానికి తగినట్లుగానే అనుపమ్ తనను మైకు దగ్గరకు పిలిచిన చోటల్లా దేశంలో అసహనం ఏమాత్రం లేదు అని అడగకుండానే చెబుతున్నారు. నిన్నటికి నిన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ‘కాంగ్రెస్ చెంచా’ అని బిరుదునిచ్చి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పడు తన వీసాను తిరస్కరించినందుకు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఏం దుమ్మెత్తి పోస్తారో చూడాలి మరి! పాకిస్తాన్ అధికారులు మాత్రం ఈ వివాదంలో తలదూర్చేందుకు సిద్ధంగా లేరు. అసలు అనుపమ్ ఖేర్ వీసా దరఖాస్తు తమకు అందలేదంటూ చేతులు దులిపేసుకున్నారు. అవును మరి... మాటల మాంత్రికుడు అనుపమ్‌తో తలపడేందుకు ఎవరు మాత్రం సిద్ధంగా ఉంటారు!